మా ఇంట్ల ఇంకొకరున్నరు ...తుమ్మల కల్పన రెడ్డి

మా ఇంట్ల ఇంకొకరున్నరు ...తుమ్మల కల్పన రెడ్డి

....... మా ఇంట్ల ఇంకొకరున్నరు...

తుమ్మల కల్పన రెడ్డి


నీకేం తెల్సు మా ఇంట్ల ఇంకొకరున్నరని...!!

మా అమ్మ నన్ను కన్నట్టు పురిటి నొప్పులతో దాన్ని కనలేదు...!!

మా అమ్మమ్మ తొట్టెలేషి పేరు పెట్టలేదు...!!

మా నాన్న కట్టం చేసి సాదలేదు...!!

నా తోడబుట్టింది అసలుకే కాదు...

కానీ మా ఇంట్ల ఇంకొకరున్నరు...

మా వంటిట్ల ఉట్టి మీదికెక్కి అల్కగ ఉయ్యలూగుతూ...

నాన్నేసుకున్న చినిగిన బనీన్లో తొంగి చూస్తుంది...

అమ్మ మాసిన నెత్తినెక్కి చిందులేస్తుంది...

మా ఇంటి గోడల పొంటి రాలే సన్నపు బిచ్చల్లో దాక్కుంది...

పాలోల్ల దావత్ పోతే గూడ తెగిన చెప్పులతో నడుస్తుంది....

అల్మారల బట్టల కింద సిల్లర పైసల్లో నిద్ర పోతది...

దినాం పొద్దుగాల సూరీడు అచ్చి పోతడు....

రాత్రికి సందమామ తొంగి సూస్తది...

కానీ ఇది మాత్రం మా ఇంటి పేరు లెక్క మా సుట్టే తిరుగుతది....

ఆధారు కార్డుకు దొర్కనిది...

జనాభా లెక్కల్లో లెక్కకు రానిది...

కానీ మా ఇంట్ల ఇంకొకరున్నరు....

అదే మా "పేదరికం..."

అది మా అమ్మ కాడికస్తే పాలిచ్చి జోలపాడ్తది...

మా నాన్నేమో జబ్బ మీది తువ్వాలోలే  ఏసుకుంటడు...

అది కూడా మాకొక బిడ్డ తీరే మరి...

మనల్ని ముంచిన మేము పెంచుకుంటం...

అందుకే అన్న మా ఇంట్ల ఇంకొకరున్నారని...


--- తుమ్మల కల్పన రెడ్డి 

     @9640462142

0/Post a Comment/Comments