SSC Public Examinations :: March, 2025
TELUGU
(First Language)
Study Material for Quick Revision
Prepared By_
Masu Rajender, MA, TPT, NET.,
School Assistant in Telugu,
ZPHS Rayaparthy, Mandal: Nadikuda,
District: Hanumakonda, Telangana - 506391.
e-Mail: rajendersir.mass@gmail.com
Website: https://www.pravahini.in
ఆల్ ద బెస్ట్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్
ప్రశ్నాపత్రం పూర్తిగా చదవాలి.
సమాధానం రాయగల ప్రశ్నలని ఎంపిక చేసుకోవాలి.
సాధ్యమైనంత వరకు సమాధానాలు వరుసక్రమంలో రాయడం మంచిది.
ఛాయిస్ లు పోగా అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి.
ప్రశ్నను బట్టి మార్కులకు అనుగుణంగా సమాధానాలు రాయాలి.
తెలుసు కదా అని జవాబు ఎక్కువగా రాయకూడదు.
సమాధాన పత్రంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి.
హాండ్ రైటింగ్ చక్కగా ఉండాలి.
బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి.
సమయ పాలన (time adjustment) చాలా ముఖ్యం.
పరీక్ష హాలులో ప్రతీ క్షణం ఎంతో విలువైనది. సమయం వృధాచేయకూడదు.
- కవి పరిచయం - పద్య, గద్యభాగ పాఠ్యాంశాల కవిపరిచయాలు చదవాలి.
- కంఠస్థ పద్యాలు - దానశీలము, వీరతెలంగాణ, భిక్ష పాఠాలలో గల తొమ్మిది పువ్వు గుర్తు గల పద్యాలను, భావాలను, ప్రతిపదార్థాలను కంఠస్థం చేయాలి మరియు సొంతంగా రాయాలి.
- సారాంశాలు - అన్నింటికంటే ముఖ్యం 12 పాఠాల సారాంశాలు తెలిసివుండాలి. వాటిని ఆధారం చేసుకుని ఇచ్చిన ప్రశ్నలకు సొంతమాటల్లో సమాధానాలు రాయాలి.
- ఉపవాచకం - రామయాణములో గల ఆరు కాండములలో ఏ కాండంలో కథ ఎంతవరకు ఉందో గుర్తుంచుకోవాలి. ముఖ్య పాత్రలు, సంఘటనలు గుర్తుంచుకోవాలి.
- సృజనాత్మకత - లేఖ, వ్యాసం, సంభాషణా రచన, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, నినాదాలు, కరపత్రం, గేయం/వచన కవిత, సన్మాన పత్రం/అభినందన పత్రం మొదలైన సృజనాత్మక ప్రక్రియలతో కూడిన అంశాలు రాయగలగాలి.
- పదజాలం - అన్ని పాఠాలలోని పదజాల అంశాలను చదవాలి. సొంత వాక్యాలు, అర్థాలు, పర్యాయాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్యర్థాలు, వీటితో పాటు పాఠ్యపుస్తకం చివరన గల పదవిజ్ఞానం కూడా చదవాలి.
- వ్యాకరణాంశాలు - సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు. కర్తరీ, కర్మణీ వాక్యాలు. ప్రత్యక్ష, పరోక్ష కథనాలు. ప్రాచీన భాష నుండి వ్యావహారిక భాష లోకి మార్చడం. మొదలైన వాటిని అభ్యసించాలి.
(మీరు 100శాతం తెలుగు పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. ఇక మీరు చేయాల్సింది ఏమాత్రం భయపడకుండా పరీక్ష రాసి 10/10సాధించడమే. ఇన్ని రోజులు చదివింది ఒకెత్తు. ప్రశాంతంగా పరీక్ష రాయండి. ప్రశ్నాపత్రం చదవండి. జవాబులు గుర్తుచేసుకోండి. అద్భుతంగా రాయండి)
*10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రం 2025
పార్ట్ - ఎ 60మార్కులు - సమయం గం. 2:30 ని.
అవగాహన - ప్రతిస్పందన (20 మార్కులు)
పరిచిత గద్యం (1-5 ప్రశ్నలు) 5×1=5మార్కులు
ఉపవాచకం నుండి 8-10 వాక్యాలలో 2 పేరాలుగా గద్యం ఇవ్వబడుతుంది.
గద్యం కింద ఐదు ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఐదింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్నలకు జవాబులు/ప్రశ్నలను తయారుచేయడం/పట్టికలు పూరించడం/బహుళైచ్చిక ప్రశ్నలు వంటివి వస్తాయి.
పరిచిత పద్యం (6వ ప్రశ్న) 1×5=5మార్కులు
పరిచిత పద్యం కంఠస్థ పద్యాలు చుక్క(*)గుర్తు గల పద్యాలలో నుండి ఇవ్వబడుతాయి.
పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి భావాన్ని రాయాలి. లేదా పద్యం ఇస్తే ప్రతి పదార్థం రాయాలి.
ఏదైనా ఒక అంశం నుండి ఇంటర్నల్ ఛాయిస్ తో ప్రశ్న ఉంటుంది.
అపరిచిత గద్యం/పద్యం (7-11 ప్రశ్నలు) 5×2=10మార్కులు
అపరిచిత గద్యం లేదా అపరిచిత పద్యం ఏదో ఒకటి ఇస్తారు.
గద్యం పేరాకు 8వాక్యాల చొప్పున రెండు పేరాలు 16-20 వాక్యాలలో ఉంటుంది.
అపరిచిత పద్యం బాగా ప్రాచుర్యం పొందిన శతకాలనుండి ఒక పద్యం ఇస్తారు.
పద్యం/గద్యం సంబంధించి 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.
వ్యక్తీకరణ - సృజనాత్మకత (40 మార్కులు)
లఘు సమాధాన ప్రశ్నలు (11-15 ప్రశ్నలు) 4×3=12మార్కులు
ఇందులో 4ప్రశ్నలు వుంటాయి.
ఒక్కొక్క ప్రశ్నకు 3మార్కులు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
నాలుగింటిలో రెండు ప్రశ్నలు పద్య భాగం నుండి రెండు ప్రశ్నలు గద్య భాగం నుండి వస్తాయి.
ఇందులో కవి/రచయిత పరిచయానికి సంబంధించి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది.
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (16-18 ప్రశ్నలు) 3×7=21మార్కులు
ఇందులో 3 ప్రశ్నలు వుంటాయి. ప్రతి ప్రశ్న అంతర్గ అవకాశాన్ని కలిగి వుంటుంది.
ఒక్కొక్క ప్రశ్నకు 7మార్కులు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
పద్య భాగం నుండి ఒక ప్రశ్న, గద్య భాగం నుండి ఒక ప్రశ్న, ఉప వాచకం నుండి ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది.
సృజనాత్మకత (19వ ప్రశ్న) 1×7=7మార్కులు
ఇంటర్నల్ ఛాయిస్ తో 1 ప్రశ్న ఇవ్వబడుతుంది.
ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. 7 మార్కులు.
ఈ సెక్షన్ కింద సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు వుంటాయి.
(ఉదా: సంభాషణ/ లేఖా రచన/ ఇంటర్వ్యూ ప్రశ్నావళి/ వ్యాసం/ కరపత్రం/ సన్మాన పత్రం /అభినందన పత్రం /ఆహ్వాన పత్రం/ నినాదాలు/ సూక్తులు/ గేయ రచన/ కవిత/ వర్ణన మొదలైనవి.)
పార్ట్ - బి 20మార్కులు - సమయం 30ని.
భాషాంశాలు
పదజాలం ( 1-10 ప్రశ్నలు) 10×1=10మార్కులు
ఇందులో మెత్తం ప్రశ్నలు 10. మార్కులు 10. అన్ని ప్రశ్నలు పదజాలాంశముల నుండే వస్తాయి
1,2 ప్రశ్నలు సొంత వాక్యాలు మిగతావి అర్థాలు, పర్యాయాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్యర్థాలు నుండి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వుంటాయి.
వ్యాకరణాంశాలు (11-20 ప్రశ్నలు) 10×1=10మార్కులు
ప్రశ్నలు 10. మార్కులు 10. వ్యాకరణాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు, కర్తరి కర్మణి వాక్యాలు, సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు మరియు ప్రాచీనం నుండి ఆధునిక వచనంలోకి మార్చడం లాంటి విభాగాల నుండి ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.
Note: చుక్క గుర్తు గల పద్యాలు అన్నీ కంఠస్టం చేసి పాదభంగం లేకుండా రాసి భావంతో పాటు ప్రతి పదార్థం రాయగలగాలి. పాఠ్యాంశ కవి, రచయిత పరిచయాలతో పాటు, అన్ని పాఠాల సారాంశాలపై పూర్తి అవగాహనను కలిగివుండాలి. సృజనాత్మక, పదజాల, వ్యాకరణాంశాలపై సమగ్రమైన అధ్యయనం అవసరం. విద్యార్థులు సొంతంగా రాయగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ప్రశ్నల సంఖ్య కుదించి మార్క్స్ పెంచిన దృష్ట్యా పార్ట్ బి పై ప్రత్యేక దృష్టి అవసరం.
*ప్రశ్నా పత్రంపై వివరణ
అవగాహన - ప్రతిస్పందన
1. పరిచిత గద్యం:-
ఉపవాచకం నుండి ఒకటి లేదా రెండు పేరాలుగా ఒక గద్యం ఇవ్వబడుతుంది. ఐదు ప్రశలు ఇస్తారు. ప్రశ్నల స్వభావాన్ని బట్టి జవాబులు రాయాలి. పేరాను చదివి అర్థం చేసుకుని ప్రశ్నలకు జవాబులు రాయాలి లేదా గుర్తించాలి. ఉపవాచకం లోని ఏ కాండంలో కథ ఎంత వరకు ఉందో గుర్తుంచుకోవాలి.
2. పరిచిత పద్యం:-
కంఠస్థ పద్యాలలో నుండి రెండు పద్యాలు ఇస్తారు. ఒకదానికి జవాబు రాయాలి.
రెండు పద్యాలలో ఒక పద్యానికి పాదభంగం లేకుండా రాసి భావం రాయాలి అని ఇస్తారు. లేదా
రెండు పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయమంటారు.
ఇందుకు గాను చుక్కగుర్తు గల అన్ని పద్యాలు పాదభంగం లేకుండా రాసి భావం రాయడంతో పాటు ప్రతిపదార్థం కూడా రాయగలగాలి. నా అభిప్రాయం ప్రకారం 1వ పాఠం దానశీలం, 3వ పాఠం వీర తెలంగాణ, 11వ భిక్ష ఈ మూడు పాఠాలలో గల 9పద్యాలు అభ్యాసం చేస్తే సరిపోతుంది.
3. అపరిచిత గద్యం/పద్యం:-
గద్యం: సామాజిక, శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక మొదలైన అంశాల గురించి గద్యం ఇవ్వబడుతుంది.
పద్యం: బాగా ప్రాచుర్యం పొందిన శతకాలనుండి ఒక పద్యం ఇస్తారు. గద్యం/పద్యం కింద ఐదు ప్రశ్నలు ఇస్తారు.
సొంతంగా చదివి అర్థం చేసుకుని సరియైన జవాబులు రాయాల్సి ఉంటుంది.
వ్యక్తీకరణ-సృజనాత్మకత
1. లఘు సమాధాన ప్రశ్నలు:-
నాలుగు ప్రశ్నలుంటాయి. రెండు ప్రశ్నలు పద్య భాగం నుండి రెండు ప్రశ్నలు గద్య భాగం నుండి వస్తాయి.
ఇందులో కవి/రచయిత పరిచయానికి సంబంధించి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది.
అన్ని పాఠాల సారాంశాలతో పాటు పాఠ్యభాగ వివరాలు, కవి/రచయిత పరిచయం మరియు పాఠ్యభాగ ఉద్దేశం/నేపథ్యాల పై కూడా అవగాన ఉండాలి.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:-
ఇందులో ఇంటర్నల్ ఛాయిస్ తో 3 ప్రశ్నలు వుంటాయి. 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
పద్య భాగం నుండి ఒక ప్రశ్న, గద్య భాగం నుండి ఒక ప్రశ్న, ఉప వాచకం నుండి ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది.
పద్య, గద్య పాఠ్యాంశాలతో పాటు ఉపవాచకాన్ని కూడా సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. పాఠ్యభాగ సారాంశాల్ని మరియు ఉపవాచకం రామాయణ కథను సొంత మాటల్లో రాయగలగాలి.
3. సృజనాత్మకత:-
ఇంటర్నల్ ఛాయిస్ తో 3 ప్రశ్నలు ఇస్తారు. ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి.
వివిధ సాహితీ ప్రక్రియలకు చెందిన అంశాల్ని సృజనాత్మకత విభాగంలో ప్రశ్నలుగా ఇస్తారు.
సంభాషణ/లేఖా రచన/ఇంటర్వ్యూ ప్రశ్నావళి/వ్యాసం/కరపత్రం/సన్మాన పత్రం/అభినందన పత్రం/
ఆహ్వాన పత్రం/నినాదాలు/సూక్తులు/గేయ రచన/కవిత/వర్ణన మొదలైనవాటి నుండి ప్రశ్నలు వస్తాయి.
విద్యార్థులు వీటిని రాయడంలో గల మెలకుల్ని అవగతం చేసుకుని సాధన చేయాలి.
భాషాంశాలు
1. పదజాలం:-
10 ప్రశ్నలు ఇస్తారు. 2 ప్రశ్నలకు జవాబులు రాయాలి, 8 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి.
సొంత వాక్యాలు, అర్థాలు, పర్యాయాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్యర్థాలు మొదలైన వాటినుండి పది ప్రశ్నలు వస్తాయి. సొంత వాక్యాలు కాక మిగతా అన్ని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో వుంటాయి.
పాఠ్యభాగాంతర్గత అన్ని పదజాలాంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
2. వ్యాకరణాంశాలు:-
10 ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ జవాబులు గుర్తించాలి.
సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, కర్తరి కర్మణి వాక్యాలు, సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు, మరియు ప్రాచీనం నుండి ఆధునిక వచనంలోకి మార్చడం లాంటి విభాగాల నుండి ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. ఇందులో పది ప్రశ్నలుంటాయి.
10వ తరగతి వరకు గల అన్ని వ్యాకరణ సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి.
Note: భాషాంశాలులో పదజాల, వ్యాకరణాంశాలలో పది మార్కుల చొప్పున 20ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానం రాస్తే ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు కోల్పోతాం. కాబట్టి పార్టీ బి ఆన్సర్స్ జాగ్రత్తగా రాయాలి. పఠన మరియు లేఖన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. టెన్త్ క్లాస్ లో 10/10 రావాలంటే తెలుగులో కూడా 10పాయింట్స్ రావాల్సిందే.
కవిపరిచయాలు
1. దానశీలము - పోతన
దానశీలము పోతన రచించిన శ్రీమహాభాగవతం అష్టమ స్కంధంలోని 'వామన చరిత్ర' లోనిది.
ప్రక్రియ: పురాణం. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. పురాణాలు 18. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు.
2. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు - డా॥ సామల సదాశివ
సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన 'యాది' అనే వ్యాస సంపుటిలోనిది.
ప్రక్రియ: వ్యాసం. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసం లక్షణం.
3. వీర తెలంగాణ - డా॥ దాశరథి కృష్ణమాచార్య
దాశరథి రచించిన “దాశరథి సాహిత్యం ” ఒకటవ సంపుటి 'రుద్రవీణ' లోనిది.
ప్రక్రియ: పద్యం. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలివి.
4. కొత్తబాట - డా॥ పి.యశోదారెడ్డి
తను రచించి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 'యశోదారెడ్డి ఉత్తమ కథలు' గ్రంథం లోనిది ఈ పాఠ్యభాగం.
ప్రక్రియ: కథానిక. రెండు తరాలకు సంబంధించిన వివరాలు, తరాలమధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను తెలియజేసారు.
5. నగరగీతం - అలిశెట్టి ప్రభాకర్
'అలిశెట్టి ప్రభాకర్ కవిత' అనే గ్రంథంలోని 'సిటీలైఫ్' అనే మినీ కవితలలో కొన్నిటిని 'నగరగీతం'గా కూర్చడమైనది.
ప్రక్రియ: మినీ కవిత. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత.
6. భాగ్యోదయం - కృష్ణస్వామి ముదిరాజ్
భాగ్యరెడ్డివర్మ కుమారుడైన ఎం.బి. గౌతమ్ రచించిన 'భాగ్యరెడ్డివర్మ జీవితచరిత్ర' గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈపాఠ్యభాగం.
ప్రక్రియ: జీవిత చరిత్ర. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజంమీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే 'జీవిత చరిత్ర'.
7. శతక మధురిమ - వివిధ కవులు
ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంక రామేశ్వర, వేణుగోపాల శతకాల పద్యాలు ఉన్నాయి.
ప్రక్రియ: శతకం. శతకాలలోని పద్యాలను 'ముక్తకాలు' అంటారు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది. అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి.
సర్వేశ్వర శతకం - యథావాక్కుల అన్నమయ్య
శ్రీకాళహస్తీశ్వర శతకం - ధూర్జటి
మల్లభూపాలీయ - ఎలకూచి బాలసరస్వాతి
దాశరథి శతకం - కంచర్ల గోపన్న (రామదాసు)
నరసింహ శతకం - కాకుత్సం శేషప్ప కవి
విశ్వనాథేశ్వర శతకం - గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
లొంక రామేశ్వర శతకం - నంబి శ్రీధరరావు
వేణుగోపాల శతకం - గడిగె భీమకవి
8. లక్ష్య సిద్ధి - సంపాదకీయం
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2వ జూన్, 2014 నాడు "నమస్తే తెలంగాణ” దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం ఇది.
ప్రక్రియ: సంపాదకీయ వ్యాసం. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింపజేసుకోవచ్చు.
9. జీవన భాష్యం - డాక్టర్ సి. నారాయణరెడ్డి.
“డాక్టర్ సి. నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం ” ఆరవ సంపుటిలోని “తెలుగు గజళ్ళు” లోనిది.
ప్రక్రియ: గజల్. గజల్ లో పల్లవిని "మత్తా” అని, చివరి చరణాన్ని "మక్తా” అని, కవి నామముద్రను "తఖల్లుస్” అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు.
10. గోలకొండ పట్టణము - ఆదిరాజు వీరభద్రరావు
తను రాసిన మన తెలంగాణము' అనే వ్యాససంపుటి లోనిది గోలకొండ పట్టణము అనే పాఠ్యభాగం.
ప్రక్రియ: వ్యాసం. వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు.
11. భిక్ష - శ్రీనాథుడు.
శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన 'కాశీఖండము' సప్తమాశ్వాసం లోనిది.
ప్రక్రియ: కావ్యం. కావ్యం వర్ణనా ప్రధానమైనది.
12. భూమిక - గూడూరి సీతారాం
నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 'నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు' సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం.
ప్రక్రియ: పీఠిక. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయప్రయాసలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయితగాని, మరొకరుగాని, విమర్శకుడుగాని రాసే విశ్లేషణాత్మక పరిచయవాక్యాలను పీఠిక అంటారు. దీనికి ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి.
కంఠస్థ పద్యాలు - భావం
*మ.
కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం
గలడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా !
భావం:
దాతలలో గొప్పవాడా ! ఓ బలి చక్రవర్తీ ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ, నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడులోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని (వామనుడిని) పంపించు.
*శా.
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా !
భావం:
ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు ఉన్నాయి. వారు ఏంతో అహంకారంతో విర్రవీగారు . కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదూ. ప్రపంచంలో వారి పేర్లుకూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదా? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా.
*మ.
నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ముపో ;
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా! ధీవర్య! వేయేటికిన్?
భావం:
ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా సరే. బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ! ఎందుకు ఇన్ని మాటలు. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడిన మాట తప్పను)
10/10 ను నిర్ణయించే పదజాల, వ్యాకరణాంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి
కంఠస్థ పద్యాలను, కవిపరిచయాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయండి.
*ఉ.
నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్!
ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వా
జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్
చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!
భావం:
అమ్మా! కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్ర సమానమైన భుజ పరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాం రాజు తో తలపడ మన్నావు ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా!
*మ.
తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా
జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము! భీ
తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్! దిశాం
చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్
భావం:
ఈ తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తి బట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకునే వాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడి పోయింది. దిగంతాల నీ ఆకాశంలో ఇంద్రధనస్సుల వరుసలతో సయ్యాట లాడాయి.
*మ
తెలంగాణా! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలనమ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!
భావం:
అమ్మా తెలంగాణా! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలమంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు యోధులే కాదు పరోపకారులు కూడా.
స్వీయరచన, సృజనాత్మక అంశాలను వేటినీ నిర్లక్ష్యం చేయకండి.
పరీక్ష హాలులో ప్రశాంతంగా వుండండి. జవాబులు గుర్తు చేసుకోండి.
సమయం వృధా చేయకుండా, రాయాల్సిన అన్ని ప్రశ్నలకు జవాబులు రాయండి.
*ఉ.
వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన పెద్దము
త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదిమ శక్తి, సంయమివరా! యిటు రమ్మని పిల్చె హస్తసం
జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్
భావం: వేదపురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి ఆ ముత్తైదువ. కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆదిశక్తి - చేతికి ధరించిన రత్నకంకణాలు ఘల్లు ఘల్లుమనేట్లు ఆదరంతో చెయ్యి ఊపుతూ “ఓ సంయమీంద్రా! ఇటురా” అని పిలిచింది.
*శా.
ఆకంఠంబుగ నిఫు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు నంగలార్చెదవు మేలే లెస్స! శాంతుండవే!
నీకంటెన్ మతిహీనులే కటకటా! నీవార ముష్టింపచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛ ప్రక్రముల్ తాపసుల్
భావం: “గొంతుదాకా తినడానికి మాధుకర భిక్షదొరకలేదని ఇంతగా చిందులువేస్తున్నావు కదా! ఇది నీకు మంచిదా? బాగున్నది. నిజంగా నీవు శాంతస్వభావుడవా? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు, శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకొనేవాళ్ళు, రోళ్ళవద్ద చెదిరిపడ్డ బియ్యం ఏరుకొని జీవనం సాగించే మునులు నీకంటే తెలివితక్కువవాళ్ళా?
*చ.
అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను లెస్సగాక, యో
మునివర! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనా
ధుని కృపపేర్మి నెంద అతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం
బరిగొనునట్లు పెట్టుడు నహరములైన యభీప్సితాన్నముల్
భావం: అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో మునివర! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనా థుని కృపపేర్మి నెందఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం బనిగొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్.
ఈ 9 పద్యాలను కంఠస్థం చేసి,
పాదభంగం లేకుండా రాయడం ప్రాక్టీస్ చేయండి.
దీనితో పాటు భావాలు కూడా రాయాలి.
ఈ పద్యాల ప్రతిపదార్థాలు సొంతంగా రాయాలి.
పాఠ్యాంశాలపై సూక్ష్మ వివరణ
దానశీలము - రచయిత బమ్మెర పోతన - దానం యొక్క గొప్పతనం తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం - బలిచక్రవర్తి యొక్క దానగుణాన్ని బలి మరియు శుక్రాచార్యుని సంవాదం ద్వారా ఈ పాఠంలో తెలియజేయడం జరిగింది.
ఎవరి భాష వాళ్లకు వినసొంపు - రచయిత డాక్టర్ సామల సదాశివ - మాతృభాష మరియు ప్రజల వాడుక భాష యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం - తెలుగు మరియు ఉర్దూ భాషల గొప్పదనం ఈ పాఠం ద్వారా తెలుస్తుంది.
వీర తెలంగాణ - రచయిత డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య - తెలంగాణ ప్రజల ముఖ్యంగా యువకుల పోరాట పటిమ - నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటం లో యువతను ఉత్తేజ పరిచే విధంగా ఉంది ఈ పాఠం.
కొత్తబాట - రచయిత డాక్టర్ పాకాల యశోదా రెడ్డి - సమాజంలో వచ్చిన మార్పును ప్రజల జీవితాలలో వచ్చిన మార్పును పాత తరం నుండి కొత్త తరానికి ప్రజల జీవితాలతో కొరకు వేయబడ్డ కొత్తబాట - ఈ పాఠం తరాల అంతరాలు ఎలా చెదిరిపోయాయి అనేది వివరించడం జరిగింది.
నగరగీతం - రచయిత అలిశెట్టి ప్రభాకర్ - పట్టణంలోని ప్రజల జీవన విధానం - పేద మధ్యతరగతి ప్రజల జీవన విధానంలోని అంతరాలను తీరుతెన్నులను ఇందులో చెప్పడం జరిగింది.
భాగ్యోదయం - రచయిత కృష్ణస్వామి ముదిరాజ్ - భాగ్యరెడ్డి వర్మ అంటరాని వర్గాల కోసం చేసిన కృషి - సాధించిన విజయాలు ఇందులో చర్చించడం జరిగింది.
శతక మధురిమ - రచయితలు వివిధ కవులు - నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుట కొరకు ఎనిమిది పద్యాల్లో బోధించడం జరిగింది.
లక్ష్య సిద్ధి - నమస్తే తెలంగాణ దినపత్రికలోని సంపాదకీయ వ్యాసం - తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ అ సంబరాలు - జ్ఞాపకాలు లక్ష్యాలు మొదలైనవి ఇందులో వివరించబడ్డాయి.
జీవనభాష్యం - రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డి - అనేక అవరోధాలను ఎదుర్కునే ఆటుపోట్లను దాటుతూ - జీవితంలో విజయం సాధించడం లోనే ఆనందం సంతృప్తి నిజమైన గుర్తింపు లభిస్తుందనే మానవ వికాస భాష్యాన్ని చెబుతుంది ఈ పాఠం.
గోలకొండ పట్టణము - రచయిత ఆదిరాజు వీరభద్రరావు - గోలకొండ పట్టణ నిర్మాణం - ఆనాటి ప్రజల జీవన విధానం - గోల్కొండ పట్టణ అభివృద్ధి మొదలైన అంశాల గురించి ఇందులో వివరించడం జరిగింది.
భిక్ష - రచయిత శ్రీనాథుడు భిక్షా ధర్మంతో చరించిన వ్యాసుడు కాశీ నగరంలో పొందిన అనుభవాన్ని చెబుతూ - ఆకలి ఎంతటి వారినైనా సరే ఎలా విచక్షణా రాహిత్యుల్ని చేస్తుందో ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు.
భూమిక - రచయిత గూడూరి సీతారాం - నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు కథా సంపుటికి సీతారాం రాసిన పీఠిక ఈ పాఠ్య భాగం - తెలంగాణ ప్రజల జీవితాన్ని ముఖ్యంగా హైదరాబాద్ స్థానిక పరిస్థితులు కళ్లకు కట్టినట్టుగా వివరించడం జరిగింది - కేశవ స్వామి గారి మొదటి కథల సంపుటి 'పసిడి బొమ్మ' - రెండవ కథల సంపుటి 'చార్మినార్ కథలు' గురించి వివరించడం జరిగింది - 'యుగాంతం' మరియు 'రూహీ ఆపా' కథల గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది.
ఈ స్టడీ మెటీరియల్ మీ సబ్జెక్ట్ ను రివిజన్ చేస్తుంది.
ఈ మెటీరియల్ తో పాటు ……
మీ సబ్జెక్ట్ టీచర్ సలహాలు సూచనలతో పూర్తిస్థాయిలో ప్రిపేర్ అవ్వండి.
ఉపవాచకం రామాయణం
ఉపవాచకం రామాయణం నుండి పేరా ఇచ్చి కింద 5 ప్రశ్నలు ఇస్తారు. పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 5మార్కులు. రామయాణములో గల ఆరు కాండములలోని కథ ఏ కాండంలో ఎంతవరకు ఉందో గుర్తుంచుకోవాలి.
వాల్మీకి రామాయణం మూల భాష సంస్కృతం. రామాయణం ప్రపంచ సాహిత్యంలో మొదటి కావ్యం. వాల్మీకి ఆది కవి రామాయణానికి పౌలస్త్య వధ, సీతాయాశ్చరితం మహత్ అనే పేర్లున్నాయి. రామాయణంలో ఆరు కాండంలు కలవు. అవి బాల కాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కిందకాండం, సుందరకాండం, యుద్ధకాండం. వాల్మీకి రామాయణంలో 24 వేల శ్లోకాలు కలవు. తెలుగులో మొదటి రామాయణం రంగనాథ రామాయణం. రచయిత గోనబుద్ధారెడ్డి. ఇది ద్విపద రచన. తెలుగులో ఇంకా భాస్కర, మొల్ల, ఉషశ్రీ రామాయణాలు సుప్రసిద్ధం.
బాలకాండం: బ్రహ్మ ఆదేశానుసారం రామాయణం రచనకు శ్రీకారం చుట్టాడు. వాల్మీకి అయోధ్య నగరం వర్ణనతో శ్రీ రాముని జననం నుండి మొదలుకొని స్వయం వరం తర్వాత పరశురాముని గర్వభంగం - అయోధ్యకు చేరుకోవడం - భరత శత్రుఘ్నులు మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళడం.
అయోధ్యకాండం: దశరథుడు మిత్రుల మీద ప్రేమతో శ్రీ రాముని పట్టాభిషేకం చేయాలని నిర్ణయం - కైకేయి దశరథున్ని వరాలు కోరుకోవడం - రాముడు వనవాసం వెళ్లడం - భరతునికి పాదుకలు ఇవ్వడం - రాముడు సీత లక్ష్మణుడు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దండకారణ్యం లోకి ప్రవేశించడం.
అరణ్యకాండం: దండకారణ్య ప్రవేశం తర్వాత అందులో లో పర్ణశాల ఏర్పాటు - విరాధుని శాపవిమోచనం - సీతాపహరణం సుగ్రీవుని మైత్రి కొరకు ఋష్యమూక పర్వతాన్ని కి ప్రయాణం - దారిలో పంపా సరోవరాన్ని దర్శించడం.
కిష్కిందకాండం: రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు భయంతో హనుమంతుని పంపడం - వీరికి మైత్రి కుదరడం - వాలిని వధించడం - సీత జాడ వెతుకుతూ వానర సైన్యం నలుదిక్కుల పయనం - హనుమంతున్ని జాంబవంతుడు ప్రేరేపించడం - సముద్రలంఘనం కొరకు మహేంద్రగిరి చేరుకోవడం.
సుందరకాండం: హనుమ సముద్ర లంఘనం - లంకలో ఒక వనంలో సీతను చూడడం - సీతతో హనుమ మాట్లాడటం - హనుమంతుని తోకకు నిప్పు పెట్టడం - తిరిగి మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకోవడం - శ్రీరాముని దగ్గరకు చేరుకొని సీత వృత్తాంతాన్ని చెప్పడం.
యుద్ధకాండం: శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించడం - వానర సైన్యం తో లంక కు ప్రయాణం - లంకలో రామ రావణ యుద్ధం - సీత వానర సైన్యం సమేతంగా అయోధ్యకు చేరుకోవడం - అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం.
ప్రశ్నాపత్ర సమయ విభజన
SSC Public Examinations - March, 2025
Subject: TELUGU
Time: 3 hrs @ Marks: 80
3 hrs = 180 Minutes
Part A - 60 Marks - 2 ½ hrs (150 Min)
Part B - 20 Marks - ½ hr (30 Min)
60 Marks => 150 Min @ 1 Mark => 2.5 Min
Part A - 60 Marks - 150 Minutes
అవగాన - ప్రతిస్పందన - 20 మార్కులు - 50 నిమిషాలు
పరిచిత గద్యం - 5 మా. - 12.5 ని. (5×1=5)
పరిచిత పద్యం. - 5 మా. - 12.5 ని. (1×5=5)
అపరిచిత గద్యం/పద్యం - 10 మా. - 25 ని. (5×2=10)
వ్యక్తీకరణ - సృజనాత్మకత - 40 మార్కులు - 100 నిమిషాలు
లఘు ప్రశ్నలు - 12 మా. - 30 ని. (4×3=12)
వ్యాసారుప ప్రశ్నలు - 21 మా. - 52.5 ని (3×7=21)
సృజనాత్మకత - 7 మా. - 17.5 ని. (1×7=7)
Part B - 20 Marks - 30Minutes
భాషాంశాలు
పదజాలం - 10 మార్కులు - 15 ని. - (10×1=10)
వ్యాకరణాంశాలు - 10 మార్కులు - 15 ని. - (10×1=10)
Note :
మీ రాత విధానాన్ని/వేగాన్ని బట్టి ఏ ప్రశ్నకు ఎన్ని పంక్తుల జవాబు రాయాలో నిర్ణయించుకోవాలి.
నిర్ణీత సమయంలో అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఎన్ని మార్కులకు ఎంత సమాధానం రాయాలో అంతే రాయాలి.
సృజనాత్మకత
ఇందులో వర్ణన, లేఖ, వ్యాసం, సంభాషణా రచన, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, నినాదాలు, కథ, కరపత్రం, సన్మాన పత్రం, కవితా రచన, గేయ రచన మొదలైన సృజనాత్మక అంశాలనుండి 3ప్రశ్నలు అడుగుతారు. ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ఇందుకుగాను 7మార్కులు.
వాక్యాలు అర్థవంతంగా, చక్కటి పదజాలంతో కూడిన వాక్యాలు, వాక్యనిర్మాణం మరియు అక్షరదోషాలు లేకుండా రాయాలి.
ఈ విభాగంలోని ప్రశ్నలకు జవాబు మొత్తంగా ఒక పేజీ నిండే విధంగా రాయాలి.
వర్ణన:
వర్ణన అంటే వర్ణించడం. వర్ణనల వల్ల చెప్పే విషయానికి అందం, ఆకర్షణ వస్తాయి. 'కార్మికుడి శరీరం నుండి చెమట కారుతుంది' అనడం మామూలు భాష శ్రమించిన కార్మికుడు సేదదీరుతూంటే అతని నుదుటిపై చెమట చుక్క మంచి ముత్యంలా మెరిసిపోతుంది' అవడం వర్ణన. వర్ణనవల్ల చెప్పే విషయం హృదయానికి హత్తుకుంటుంది. పోలికలను, ఉపమానాలను, జాతీయాలను, సామెతలను, పదబంధాలను వాడడం వల్ల వర్ణనకు ఇంపు, సొంపు వస్తాయి. మీ పరిసరాలలో ఉన్న అంశాలను, వ్యక్తులను వర్ణించడం అలవాటు చేసుకుంటే ఈ ప్రశ్న చేయడం సులువే!
లేఖ:
లిఖించడం అంటే రాయండం. లిఖించడం ద్వారా విషయాన్ని, అనుభూతుల్ని పంచుకోవడమే లేఖ. ఇంగ్లిష్లో Email format, letter format లు రెండూ ఉన్నా, తెలుగులో Email format ఇంకా రాలేదు. లేఖలో ఉండే ముఖ్యభాగాలు రెండు. అవి. 1. విషయం, 2. లేఖ భాగాలు, రెండూ సందర్భోచితంగా ఉండాలి. లేఖలోని మొత్తం భాగాలు రాసినా, విషయం లేకుంటే ప్రయోజనం లేదని గుర్తుంచుకోండి.
వ్యాసం (Essay):
విషయాన్ని విస్తరించి లేదా వివరించి చెప్పడమే వ్యాసం. ఎంచుకున్న ఏ విషయాన్నైనా చదువరులకు అర్ధమయ్యేలా వివిధ ఉదాహరణలతో, జాతీయాలు పదబంధాలతో రాసే వ్యాసాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. విషయాన్ని ఏదో ఒక అంశంతో ప్రారంభించాలి. ఇది రాబోయే వ్యాసంలోని విషయాన్ని పరిచయం చేయాలి. దీనినే 'ఉపోద్ఘాతం' అంటారు. ఉపోద్ఘాతంలో చెప్పిన విషయాలను వ్యాసంలో విస్తరించాలి. దీనినే విషయ విస్తరణ అంటారు. రాసే విషయాలన్నీ రాసి, దానిపై మన సొంత అభిప్రాయాన్ని జోడించాలి. అదే ముగింపు లేదా ఉపసంహారం.
వ్యాస నిర్మాణ క్రమం: ఉపోద్ఘాతం, విషయ వివరణ, ముగింపులు
చక్కగా ఉంటే వ్యాసం చక్కగా కుదిరినట్లు లెక్క
సంభాషణా రచన:
సంభాషణ అంటే ఎదుటి వ్యక్తితో నోటి ద్వారా చేసే భావ వినిమయం. ఒకే వ్యక్తి మాట్లాడుతూ పోతే దీనిని ఉపన్యాసం అంటారు. ఇద్దరు వ్యక్తులు విషయాన్ని పంచుకుంటే సంభాషణ అంటారు. సన్నివేశాన్ని బట్టి సంభాషణ తీరుతెన్నులుంటాయి. అతిథులతో సంభాషించేటప్పుడు మర్యాదగా, పెద్దవారితో సంభాషించే టప్పుడు గౌరవంగా, ఆత్మీయులతో సంభాషించేటప్పుడు చనువుగా అధికారులతో మాట్లాడేటప్పుడు విషయ ప్రాధాన్యం ఉండేలా మాట్లాడాలి. విషయపరమైన సంభాషణ రాయమని అడిగితే, సంభాషణలో ఎక్కువ భాగం ఆ విషయాన్ని గురించే ఉండాలి.
కనీసం రెండు పాత్రలలో సంభాషణ నిర్వహించాలి. అవసరమైతే పాత్రల సంఖ్య పెరగవచ్చు.ఒక్కో పాత్రకు కనీసం 5 సంభాషణ వాక్యాలతో, అంటే మొత్తం 10 వాక్యాలకు తగ్గకుండా సంభాషణ రాయాలి. నిడివి కొంచెం పెరిగినా ఫరవాలేదు.
ఇంటర్వ్యూ ప్రశ్నావళి:
నోటి మాటల ద్వారా ప్రశ్నలను అడుగుతూ సమాధానాల్ని రాబడితే అది ఇంటర్వ్యూ అలా కాకుండా లిఖిత పూర్వకంగా ప్రశ్నల్ని రాసి అడిగితే అది ప్రశ్నావళి. ఐతే పరీక్షల్లో, ఇంటర్వ్యూ ఐనా, ప్రశ్నావళి ఐనా రాయాల్సిందే! ఇంటర్వ్యూ ప్రశ్నావళిని సిద్ధం చేసుకొనేటప్పుడు మనం ఏ విషయాన్ని రాబడుతున్నామో, ప్రధానంగా ఆ విషయానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలి. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయమన్నప్పుడు కొన్ని ప్రశ్నలు వారి వ్యక్తిగత అంశాలపైన కూడా అడగవచ్చు. 10-15 ప్రశ్నలు రాస్తే సరిపోతుంది.
నినాదాలు, సూక్తులు:
నినాదం (Slogan) ఇది సూటిగా, గుర్తుండిపోయేలా ఉండాలి. పది వాక్యాలు చెప్పలేని అంశాన్ని ఒక నినాదం బలంగా చెప్పగలుగుతుంది. ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి, హృదయానికి హత్తుకునేలా చిరకాలం గుర్తుండేలా రూపొందేవి నినాదాలు. సమాజంలో వివిధ సందర్భాలలో నినాదాలను ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిని పరిశీలించండి. అలాగే, ప్రాస కలిసేటట్టుగా, భావం బలంగా వ్యక్తమయ్యేలా వివిధ అంశాలకు సంబంధించిన సూక్తులను సేకరించండి. సొంతంగా కొన్నింటిని రాసే ప్రయత్నం చేయండి.
కథ (Story):
జరిగింది జరిగినట్లుగా చెప్పడం వార్త, 'ఇలా జరిగితే బాగుండు' అన్నట్లుగా చెప్పగలిగితే అది కధ. వివిధ సందర్భాలలో 'పంచతంత్రం', 'జాతక కథలు', 'తెనాలి రామకృష్ణుని కథలు', 'మర్యాద రామన్న కథలు' లాంటి కథలను చదివే ఉంటారు. వాటిని గమనించండి. కథ సూటిగా, స్పష్టంగా, చక్కటి ముగింపుతో ఉండాలి. మీ ఊహాశక్తికి, భాషా నైపుణ్యానికి గీటు రాయి కథ.
కథా సోపానాలు: ప్రారంభం, ఎత్తుగడ, కథ (మూడు పేరాలుండాలి),
కథనం, సంఘటన క్రమం, ముగింపు.
కరపత్రం (Pamphlet):
ఏదైనా ఒక అంశంపై చేసే వాదనను కానీ, ఆ అంశానికి సంబంధించిన విషయ వివరణను కానీ కరపత్రం అంటారు.
ఉదా॥ గ్రామాభివృద్ధికి యువకులే ముందుకు రావాలని కోరుతూ కరపత్రం (వాదన)
స్వచ్ఛ భారత్ ఆవశ్యకత గురించి తెలుపుతూ కరపత్రం. (విషయ వివరణ)
శీర్షిక మరియు ప్రచురణకర్తల వివరాలు వుండాలి.
సన్మాన పత్రం (అభినందన పత్రం):
ఎవరైనా గొప్ప వ్యక్తులను సన్మానించాలనుకున్నప్పుడు సన్మాన పత్రాలు రాస్తారు. ఉద్యోగ విరమణ సందర్భంలోనో, షష్టి పూర్తి లాంటి సందర్భాలలోనో కూడా సన్మాన పత్రాలు రాయవచ్చు. ఏదైనా బహుమానాన్ని, పురస్కారాన్ని పొందినపుడు కూడా ఆయా వ్యక్తులు, సంస్థలు చేసిన కృషిని గుర్తిస్తూ సన్మానపత్రం రాయవచ్చు. ఎవరైనా మంచిపని చేసినపుడు అభినందన పత్రం రాయవచ్చు. సాధారణంగా సన్మాన పత్రం పెద్దవారికి, అభినందన పత్రం సమవయస్కులకు లేదా పిన్నలకు రాయడం సరైనదిగా ల్ ఉంటుంది. ఆయా వ్యక్తులు, సంస్థల గొప్పతనాన్ని, ప్రతిభను ఆవిష్కరించేలా సన్మాన, అభినందన పత్రాలు ఉండాలి.
సన్మావగ్రహీత వివరాలు పొందుపర్చడం, సందర్భం ప్రశంసాత్మకంగా, సరైన పదజాలంతో,
చక్కని రచనా విధానం కలిగి, మంచి వాక్యనిర్మాణం వుండాలి. అక్షరదోషాలు ఉండకూడదు.
గేయం/కవిత:
గేయం, కవిత రెండూ ఒకటే. లయబద్ధంగా ఉంటే గేయం అంటాం. ఇది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. కవితకు లయ అవసరం లేదు. కవితలను నిర్వచించడం కష్టం. ఐనా, చెప్పవలసిన విషయాన్ని హృదయానికి హత్తుకునేలా, చక్కగా, అందంగా, సరైన చోట సరైన పదాల్ని ప్రయోగిస్తూ చెప్పడాన్ని కవిత్వంగా చెప్పవచ్చు. కవితను రాయమన్నప్పుడు, వీలున్నన్ని వర్ణనలను, పోలికలను అంటే ఉపమాలంకారం, రూపకాలంకారం లాంటి అలంకారాలను, ప్రాసలను వాడే ప్రయత్నం చేయండి. దీని ద్వారా వ్యక్తీకరణకు ఒక అందం వస్తుంది. మీ స్థాయిలో ఈ ప్రయత్నం సరిపోతుంది.
పదజాలం
సొంతవాక్యాలు
పలికి లేదనుట = నేను ఎప్పుడూ పలికి లేదని అనను.
కుఱుచగుట = మా మామ కుఱుచగా ఉంటాడు.
చేతులొగ్గు = ఎవరి దగ్గరా చేతులొగ్గి అడగను.
యాదిచేసుకొను = నేను, నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాదిచేసుకొని బాగా నవ్వుకున్నాం.
పసందు = నా స్నేహితుని మాటలు పసందుగా ఉంటాయి.
రమ్యం = పువ్వులు రమ్యంగా ఉంటాయి.
క్షేత్రం = వేములవాడ క్షేత్రం చాలా గొప్పది.
సయ్యాటలాడు =గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి.
పరిహాసాలాడు = తాతా మనుమలు పరిహాసాలాడుకుంటారు
కల్లోలం = స్వాతంత్ర్యోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది.
ఆందోళన = రైతుల పోరాటం ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది.
వెనుకాడరు = వీరులెప్పుడూ ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు.
వెనుకంజ వేయరు = తెలంగాణ ఉద్యమంలో యువకులు ఎప్పుడూ వెనుకంజ వేయలేదు.
దిక్కు తోచనప్పుడు = దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడుతాం.
దారి తోచనప్పుడు = దారి తోచనప్పుడు ప్రశాంతంగా ఆలోచించాలి.
చెవివారిచ్చి = ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి.
మా తాత చెప్పే కథలను చెవివారిచ్చి వింటాను.
గవిన్లు = చిరుతపులులు గవిన్లలో నివసిస్తాయి.
సింహం ఆహారంకోసం గవిన్ల నుండి బయటికి వస్తుంది.
కుటిలవాజితనం = కుటిలవాజితనం పనికిరాదు.
కొందరు కుటిలవాజితనంతో ఇతరులను బాధపెడుతారు.
పొలిమేర = మా ఊరి పొలిమేర లో పంటపొలాలున్నాయి.
మా ఊరి పొలిమేరలో పచ్చని చెట్లు ఉంటాయి.
ఏకతాటిపై = ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఏకతాటిపై ఉండాలి.
మచ్చుతునక = తెలంగాణ వైభవానికి రామప్ప ఆలయం మచ్చుతునక.
మహమ్మారి = నేటికీ వరకట్న మహమ్మారికి ఎందరో బలవుతున్నారు.
నిరంతరం = విద్యార్థులు నిరంతరం చదువులపై దృష్టిపెట్టాలి.
భాసిల్లు = మన తెలంగాణ సకలసంపదలతో భాసిల్లాలని కోరుకుందాం.
ఉద్బోధించు = అంబేద్కర్ కులమత భేదాలను రూపుమాపాలని ఉద్భోదించాడు.
దైన్యస్థితి = ప్రజల దైన్యస్థితి ని తొలగించడానికి ప్రయత్నించేవారే నాయకులు.
నరరూపరాక్షసుడు = ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవాడు నరరూపరాక్షసుడు.
ముసురుకొను = కష్టాలు ముసురుకున్నా ధైర్యం విడిచిపెట్టకూడదు.
ప్రాణంపోయు = ప్రాణంపోసే వైద్యుడు ఎంతో గొప్పవాడు.
గొంతు వినిపించు = నీ అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించక పోయినా నీ గొంతు వినిపించడం మనకు.
యజ్ఞం = ఈ రోజులలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం ఒక మహాయజ్ఞం
వ్యాప్తి = సువాసనలు ఆ ప్రాంతమంతా వ్యాప్తి చెందాయి.
జంకని అడుగులు = జంకని అడుగులు వేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాము.
ఎడారి దిబ్బలు = ఒంటెలు ఎడారి దిబ్బలు దాటుకుంటూ వేగంగా నడుస్తాయి.
చెరగని త్యాగం = చెరగని త్యాగం వల్లనే గొప్పపేరు వస్తుంది.
పుట్టినిల్లు = వరంగల్లు కాకతీయుల వైభవానికి పుట్టినిల్లు.
పాటుపడడం = ప్రతి వ్యక్తీ సమాజ అభివృధ్ధికోసం పాటుపడాలి.
పీడవదలడం = దేశం బాగుపడాలంటే అవినీతి పీడవదలడం చాలా ముఖ్యం.
తలదాచుకోవడం = ఎండా వాన చలి నుండి తలదాచుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇల్లు వుండాలి.
అర్థాలు
నగారా = పెద్ద ఢంకా (భేరి)
ఘోష = ఉరుము, పెద్ద శబ్దం
సందడి = జన సమూహం
పఠనీయ గ్రంథం = చదువదగిన పుస్తకం
ద్వాఃకవాటము = ద్వారము తలుపు
వీక్షించు = చూచు
అంగన = స్త్రీ
మచ్చెకంటి = చేపల వంటి కన్నులు కలది (స్త్రీ)
భుక్తిశాల = భోజనశాల
ధ్యాస = దృష్టి
సఖ్యత = స్నేహము
హస్తవాసి = చేతి చలువ
ప్రఖ్యాతి = ప్రసిద్ధి
దేవిడీ = పెద్ద భవంతి
పర్యాయ పదాలు
జలము = నీరు, ఉదకము, సలిలము, తోయము,
యశము(యశస్సు) = కీర్తి, ఖ్యాతి, పేరు.
ఇల్లు, గృహం = సదనం, గేహం
పొగడ్త, స్తోత్రం = ప్రశంస
రవము = ధ్వని, రొద, చప్పుడు, శబ్దము
కృపాణము = ఖడ్గం, కత్తి, అసి, కరవాలం
జలధి = సముద్రం, సాగరం, పయోధి, లబ్ధి, కడలి
జెండా = పతాకం, దాఢ
లంఘించు = దాటు, దుముకు, తరించు
పెయి = మేను, దేహం
తావు = చోటు, ప్రదేశం
నరుడు = మానవుడు, మనిషి
అరణ్యం = అడవి, విపినం
రైతు = కర్షకుడు, కృషీవలుడు
పువ్వు = కుసుమం, పుష్పం
మరణం = చావు, మృత్యువు
వాంఛ = కోరిక, అభిలాష
వృక్షం = చెట్టు, తరువు
పల్లె = గ్రామం, జనపదం
అండ = ఆధారం, ఆదరువు, ఆలంబనం, ఆసరా, ఆశ్రయం
ఉన్నతి = గొప్ప, ఘనత, పెంపు, దొడ్డతనం, మేటి
స్వేచ్ఛ = స్వచ్ఛందము, అలవోక, స్వతంత్రత, స్వాతంత్య్రం
వికాసం = వికసనం, ప్రఫల్లం, వికసించడం
ఏనుగు = గజము, కరి
స్నేహితులు = మిత్రులు, నెచ్చెలులు
కృపాణం = కత్తి, అసి
బంగారం = కనకం, స్వర్ణం, పసిడి
తారలు = చుక్కలు, నక్షత్రాలు
జ్ఞాపకం = జ్ఞప్తి, గుర్తు
పోరాటం = యుద్ధం, రణం
విషాదం = దుఃఖము, వ్యధ
సంస్కరణ = సంస్కారము, సత్కర్మము
మబ్బు = మేఘము, మొయిలు, అంబుదము, ఘనము
గుండె = హృదయము, హృత్తు, డెందము
శిరసు = తల, శీర్షము, మస్తకము, మూర్ధము
వనిత = స్త్రీ, నారి, అంగన, పడతి, పురంధ్రి
పసిడి = బంగారము, సువర్ణము, కనకము, హిరణ్యము, పైడి
పారాశర్యుండు = వ్యాసుడు, బాదరాయణుడు, సాత్యవతేయుడు, కృష్ణ ద్వైపాయనుడు
ఆగ్రహము = కోపము, క్రోధము, రోషము, కినుక
అహిమకరుడు = సూర్యుడు, రవి, ఆదిత్యుడు, భాస్కరుడు
నానార్థాలు
కులము = వంశము, శరీరము, దేశము, జాతి, ఇల్లు
క్షేత్రము = పుణ్యస్థలము, శరీరము, భార్య, భూమి, వరిమడి
హరి = విష్ణువు, కోతి, ఇంద్రుడు, సూర్యుడు, సింహము, పాము
చిత్రము = ఆశ్చర్యం, బొమ్మ (చిత్తరువు), అద్భుత రసం
కవి = కావ్యము రాసినవాడు, శుక్రుడు, నీటికాకి
క్షేత్రం = పుణ్యస్థలము, శరీరము, భార్య
ఉదయము = ఉదయించడం, తూర్పుకొండ, పుట్టుక, సృష్టి
ఆశ = కోరిక, దిక్కు
అభ్రము = మబ్బు, ఆకాశం, బంగారము, కర్పూరం, స్వర్గము
వీడు = ఇతడు, పట్టణము, వదలుట
రాజు = క్షత్రియుడు, చంద్రుడు, ప్రభువు
ప్రకృతి వికృతులు
సిరి - శ్రీ
విష్ణువు - వెన్నుడు
ధర్మము - దమ్మము
బ్రహ్మ - బమ్మ, బొమ్మ
భాష - బాస
కవిత - కైత
కత - కథ
ఇంతి - స్త్రీ
సముద్రం - సంద్రం
అదెరువు - ఆధారం
శిఖ - సిగ
విద్య - విద్దె
పైనం - ప్రయాణం
దెస - దిశ
రాయుడు - రాజు
భిక్ష - బిచ్చము
యాత్ర - జాతర
మత్స్యము - మచ్చెము
రత్నము - రతనము
పంక్తి - బంతి
వ్యుత్పత్త్యర్థాలు
నీరజభవుడు = నీటి నుండి పుట్టిన, తామరపద్మము నుండి పుట్టినవాడు (బ్రహ్మ).
త్రివిక్రముడు = మూడు అడుగులచే మూడులోకాలనూ కప్పినవాడు (విష్ణుమూర్తి).
గురువు = అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు
భాష = భాషింపబడునది
పదవిజ్ఞానం
అర్థాలు
అంగన = స్త్రీ
అంబరం = వస్త్రం, ఆకాశం
అంతరాళం = లోపలి భాగం
అపూటం = పూర్తిగా
అభీప్సితము = కోరిక
అభ్రము = మేఘము
అర్థి = యాచకుడు, అడుగువాడు
అలతి = కొద్ది
ఆకర్ణించు = విను
ఆచరణ = నడత
ఆర్థ్ర = తడిసిన
ఆశ = దిక్కు
ఆసరా = తోడు, సహాయం, అండ
ఇందుబింబం = చంద్రబింబం
ఇడుట = ఇచ్చుట
ఈవి = త్యాగం
ఉడుగు = నశించు
ఉద్దండ = గొప్ప, పొడవైన, ఎక్కువైన
ఉదాసీనత = నిర్లిప్తత
ఏరుతారు = భేదాలు
ఔదల = నడినెత్తి
కయ్య = కాలువ
కర్దమం = బురద, అడుసు
కల్లోలం = పెద్ద అల
కుబ్జ = మరుగుజ్జు
కృపాణం =కత్తి, ఖడ్గం
కేళాకూళులు = క్రీడాసరస్సులు
కైవారము = చుట్టూరా, వంది స్తోత్రము
కొటారి = ఎత్తైన, చివరి
క్రతువు = యజ్ఞము
క్షోభ = కలత
గంభీరం = లోతైన
గర్జాట్టహాసం = గంభీరమైన ధ్వని
గవిన్లు = గుహలు
చతురంతయానం = పల్లకి
చిత్తం = మనస్సు
చీరానీకం = వస్త్రముల సముదాయం
ఛత్రము = చత్రి, గొడుగు
ఛాత్రులు = విద్యార్థులు
జలజం = తామరపువ్వు
జలధి = సముద్రము
జాబు = ఉత్తరం
జిగి = కాంతి
జోదులు = యోధులు
తటాకం = చెరువు
తప్పెట = డప్పు
తరళ = చంచలమైన
తావు = చోటు, జాగ
తెఱవ = స్త్రీ
తేజము = ప్రకాశం
దంష్ట్రలు = కోరలు, కోరపండ్లు
దపురం = నమోదు పుస్తకం
దయిత = భార్య
దవీయసి = దూరమైనది
దానవేంద్రుడు = రాక్షసరాజు
దేవనది= ఆకాశగంగ
దోయిలి = దోసిలి
ధృతి = ధైర్యం
నిరయం = దుర్గతి, నరకం
పణం = పందెం
పథం = తొవ్వ, మార్గం
పనుపు = నియోగించు
పరివేష్టించి = చుట్టుకొని
పసందు = ఇష్టం
పసిడి చట్టువము = బంగారు గరిటె
పాలి పెర = గుర్తు, చిహ్నం, జాడ
ప్రాయం = వయసు
పురంధ్రులు = ఇల్లాండ్రు
పేర్మి = ప్రేమ, గౌరవం
పొటాపతి = ఆకలిబాధ
పోషాకులు = (పెళ్ళి) బట్టలు
ఫుల్లము = విచ్చుకున్నది
బండజింకలు = గబ్బిలాలు
బండారు = పసుపు
బాకా = వాద్యవిశేషం
బుగులు = భయం
భరణం = జీతం
భాగీరథి = గంగ
భాసిల్లు = ప్రకాశించు
భూతము = ప్రాణి
మక్దూరు = నియమం
మట్టసము = నిండైనది
మరాళము = హంస
మహారవము = పెద్ద చప్పుడు
మాను = చెట్టు
మాణవకుడు = బాలుడు, పిల్లవాడు
మిత్తి = మృత్యువు (చావు), వడ్డీ
ముచ్చెలు = చెప్పులు
ముష్టి = పిడికిలి
మెండు = ఎక్కువ, అధికం
మెరిమెణ = ఊరేగింపు (మెరిచ్చు)
మేనా = పల్లకి (మ్యాన)
మోతెబరి = ధనిక రైతు
యశము = కీర్తి
రివాజు = సంప్రదాయం
రేగడి = బంకమన్ను
రొద = చప్పుడు
రొంపి = బురద
లంఘించు = దూకు
లగెత్తు = పరుగెత్తు
వక్ర్తము = ముఖం
వదాన్యుడు = దాత
వర్షం = ఏడాది, సంవత్సరం
వర్ణి = బ్రహ్మచారి
వసుధ = భూమి
వాంఛితము = కోరిక
వాఃపూరము = జలప్రవాహం
వారి = నీళ్ళు
వార్ధి = సముద్రం
విక్రమము = పరాక్రమము
విద్వత్తు = పాండిత్యం
విద్వాంసుడు = పండితుడు
విప్రగృహం = బ్రాహ్మణుల ఇల్లు
విభావళి = కాంతుల వరుస
వీడు = పట్టణం
వేడు = ఎవడు
శక్రధనుస్సు = సింగిడి, ఇంద్రధనుస్సు
శౌరి = విష్ణువు
సంరంభం = వేగిరపాటు
సచివులు = మంత్రులు
సన్న = హస్తాదులచే చేసే సంజ్ఞ
సన్నిధానం = సమీపం, ఆశ్రయం
సవారి = వాహనం
సాళ్ళు = వరుసలు
సింపులు = పేలికలు (చింపులు)
సిత = తెల్లని
సూడిగములు = గాజులు, కడియములు
సొంపు = అందం
సౌదామని = మెరుపు
స్కంధం = కొమ్మ, భాగం
హర్మ్యము = ఎత్తైన మేడ
పర్యాయపదాలు
అండ - ఆసరా, తోడు
అపూటం - పూర్తిగా, సాంతం
ఆలయం - ఇల్లు, గృహం
ఆశ - ఇచ్ఛ, ఈప్స, కాంక్ష
ఉన్నతి - వికాసం, అభివృద్ధి, ప్రగతి
కనకం - బంగారం, హేమ
కుత్తుక - గొంతు, మెడ
కోవెల - గుడి, దేవళం
కృపాణము - ఖడ్గము, కత్తి
చిత్తము - మనసు, హృదయం
జలధి - వార్ధి, సముద్రము
జలజము - పద్మము, కమలం
తారలు - నక్షత్రాలు, చుక్కలు
తొలి - మొదటి, ఆది
త్యాగం - ఈవి, ఈ
దిశ - దిక్కు కాష్ఠ
దేవాలయం - గుడి, కోవెల
పానుపు - పరుపు, పడక
పురాగ - మొత్తం, అంతా
పొంకంగ - సొంపుగా, అందంగా
పొలిమేర - సరిహద్దు, ఎల్ల
పోరాటం - యుద్ధం, సంగ్రామం, సమరం
ప్రశంస - పొగడ్త, స్తోత్రం
బంగారం - పసిడి, పైడి, పుత్తడి
బాట - దారి, మార్గం
భండనము - యుద్ధము, రణము
భర్త - ధవుడు, నాథుడు, పతి, మగడు
భార్య - పత్ని, అర్ధాంగి, దయిత, దార, జాయ
మిత్రుడు - స్నేహితుడు, చెలికాడు
వటువు - బ్రహ్మచారి, వడుగు, వర్ణి, ఉపనీతుడు
వర్షము - సంవత్సరము, ఏడాది
విప్రుడు - బ్రాహ్మణుడు, భూసురుడు
విషాదం - బాధ, దుఃఖం
విష్ణువు - నారాయణుడు, కేశవుడు, దామోదరుడు
వెచ్చించు - ఖర్చుచేయు, వినియోగించు
వెన్నెల - జ్యోత్స్న, కౌముది, చంద్రిక
వేదండము - ఏనుగు, కరి, గజము
సంబురం - సంతోషం, ఆనందం
సొంపు - సోయగం, అందం
సంస్కరణ - బాగుచేయడం, చెడును రూపుమాపడం
హాటకం - బంగారం, హొన్ను, కాంచనం, సువర్ణం, హేమం, కనకం
నానార్థాలు
అంబరం = వస్త్రం, ఆకాశం
ఆశ = కోరిక, దిక్కు
కనకం = బంగారం, ఉమ్మెత్త, సంపెంగ
కవి = కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి
కులము = వంశం, జాతి, శరీరం, ఇల్లు
గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న, రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది
ఘనము = మేఘము, ఏనుగు, కఠినం, గొప్పది, గట్టి
చిత్రము = అద్భుతరసం, ఆశ్చర్యం, చిత్తరువు (బొమ్మ), పదచమత్కారం
జీవనము = బ్రతుకు, నీళ్ళు, గాలి, ప్రాణం
పణం = పందెం, కూలి, వెల, ధనం
పేరు = నామధేయం, కీర్తి, అధికం, హారం
బాష్పము = కన్నీరు, ఆవిరి, ఇనుము
బుధుడు = పండితుడు, బుధ గ్రహం, బుద్ధిమంతుడు
భీముడు = ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు, శివుడు
మిత్రుడు = సూర్యుడు, స్నేహితుడు
రాజు = ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు
వర్షము = వాన, సంవత్సరం, దేశం
సాహిత్యము = కలయిక, వాజ్మయం
సిరి = సంపద, లక్ష్మి
స్కంధము = కొమ్మ, ప్రకరణం, సమూహం, శరీరం
హరి = విష్ణువు, ఇంద్రుడు, గుఱ్ఱం, దొంగ, సింహం, కోతి
క్షేత్రము = చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం
వ్యుత్పత్త్యర్థములు
కృపాణం = దయను పోగొట్టునది - కత్తి
గురువు = అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు - ఉపాధ్యాయుడు
జలధి = జలములు దీనిచే ధరింపబడును - సముద్రము
త్రివిక్రముడు = ముల్లోకములను ఆక్రమించినవాడు - విష్ణువు
దాశరథి = దశరథుని పుత్రుడు - శ్రీరాముడు
నగరం = కొండలవలే ఉండే పెద్ద పెద్ద భవనములు కలది - పట్టణం
నీరజ భవుడు = (విష్ణువు నాభి) కమలమునందు పుట్టినవాడు - బ్రహ్మ
పారాశర్యుడు = రాశరమహర్షి కుమారుడు - వ్యాసుడు
భవాని = భవుని భార్య - పార్వతి
భాగీరథి = భగీరథునిచే తీసుకొనిరాబడినది - గంగ
భానువు = ప్రకాశించువాడు - సూర్యుడు
భాష = భాషింపబడునది - మాట
ముని = మౌనంగా ఉండేవాడే - ఋషి
వసుధ = బంగారమును గర్భమందు కలది - భూమి
విష్ణువు = విశ్వమంతటా వ్యాపించి యుండువాడు - విష్ణుమూర్తి
హరుడు = ప్రళయకాలమున సర్వమును హరించువాడు - శివుడు
ప్రకృతి వికృతులు
ఆధారం - ఆదరువు
ఆజ్ఞ - ఆన
ఆశ్చర్యం - అచ్చెరువు
కథ - కత
కవిత - కైత
కార్యం - కర్జం
కావ్యం - కబ్బం
దిశ - దెస
ప్రయాణం - పయనం
భాష - బాస
మృత్యువు - మిత్తి
యోధులు - జోదులు
యజ్ఞం - జన్నం
విద్య - విద్దె
శిఖ - సిగ
శక్తి - సత్తి
సముద్రము - సంద్రము
సహజం - సాజం
స్తంభము - కంబము
హృదయం - ఎద
వ్యాకరణాంశాలు
సంధులు
సంధి: ముందరి పదము యొక్క చివరి అక్షరము, తరువాత పదము యొక్క మొదటి అక్షరము ఒకదానితో నొకటి కూడుకొనుట.
“సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక”.
“తెలుగులోసంధి అనగా రెండు పదముల కలయిక”.
సవర్ణదీర్ఘ సంధి
“అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు (సవర్ణములు) పరమైనప్పుడు వాని దీర్ఘం ఎకాదేశామవుతుంది”. సవర్ణాలు: ఒకేరకమైన అచ్చులను సవర్ణాలు అంటారు. అ, ఇ, ఉ, ఋ లు సవర్ణములు. ఏకాదేశం: ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటారు.
విద్య+ఆలయము = విద్యాలయము
సచివాలయం = సచివ+ఆలయం (అ+ఆ=ఆ)
దిశాంచలము = దిశ+అంచలములు (అ+అ=ఆ)
శ్రావణాభ్రము = శ్రావణ+అభ్రము (అ+అ=ఆ)
దేవాలయాలు=దేవ+ఆలయాలు (అ+ఆ=ఆ)
అశ్వారూఢుడు=అశ్వ+ఆరూఢుడు (అ+ఆ=ఆ)
రాజాజ్ఞ=రాజ+ఆజ్ఞ (అ+ఆ=ఆ)
పుణ్యాంగన=పుణ్య+అంగన (అ+అ=ఆ)
మునీశ్వర = ముని+ఈశ్వర (ఇ+ఈ=ఈ)
గుణసంధి
“ ‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే వరసగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశామవుతాయి.” ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు. కావున ఇది గుణ సంధి.(అకారము అంటే అ లేదా ఆ)
నవ+ఉదయం=నవోదయం (అ+ఉ=ఓ)
దేవ+ఋషి=దేవర్షి (అ+ఋ=అర్)
గర్వోన్నతి = గర్వ+ఉన్నతి (అ+ఉ=ఓ)
వదాన్యోత్తముడు = వదాన్య+ఉత్తముడు (అ+ఉ=ఓ)
రామ్యోద్యానములు = రమ్య+ఉద్యానములు (అ+ఉ=ఓ)
యణాదేశ సంధి
“ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే వరసగా య, వ, ర లు ఆదేశమవుతాయి.” ఇ, ఉ, ఋ లను ఇక్కులని, య, వ, ర లను యణ్ణులు అంటారు. యన్ణులు ఆదేశంగా వస్తాయి. కావున ఇది యణాదేశ సంధి.
అత్యంతము = అతి+అంతము (ఇ+అ=య)
అత్యద్భుతం = అతి + అద్భుతం (ఇ+అ=య)
అభ్యాగతులు = అభి+ఆగతులు (ఇ+ఆ=య)
అణ్వాయుధాలు = అణు+ఆయుధాలు(ఉ+ఆ=వ)
వృద్ధి సంధి
‘అ’ కారానికి - ఏ, ఐ లు పరమైతే ‘ఐ’ - ఓ, ఔలు పరమైతే ‘ఔ ’- ఋ, ౠలు పరమైతే ‘ఆర్’లు ఏకాదేశమవుతాయి”. ఐ, ఔ, ఆర్ లను వృద్ధులు అంటారు. వృద్ధుల వల్ల ఏర్పడిన సంధి కనుక వృద్ధి సంధి.
రసైక = రస + ఏక (అ + ఏ = ఐ)
ఏకైక = ఏక+ఏక(అ + ఏ = ఐ)
వసుధైక = వసుధ+ఏక (అ + ఏ = ఐ)
దివ్యైరావతం = దివ్య + ఐరావతం (అ + ఐ = ఐ)
దేశైశ్వర్యం = దేశ+ఐశ్వర్యం (అ + ఐ = ఐ)
అష్టైశ్వర్యాలు = అష్ట+ఐశ్వర్యాలు (అ + ఐ = ఐ)
ఘనౌషధి = ఘన + ఓషధి (అ + ఓ = ఔ)
వనౌషధి = వన+ఔషధి (అ + ఓ = ఔ)
మహౌషధి = మహా+ఔషధి (అ + ఓ = ఔ)
రసౌచిత్యం = రస + ఔచిత్యం (అ + ఔ = ఔ)
దివ్యౌషధం = దివ్య+ఔషధం (అ + ఔ = ఔ)
నాటకౌచిత్యం = నాటక+ఔచిత్యం (అ + ఔ = ఔ)
దివ్యౌషధం = దివ్య+ఔషధం (అ + ఔ = ఔ)
సమైక్యత = సమ+ఐక్యత (అ + ఐ = ఐ)
ఉత్త్వ/ఉకార సంధి
సూత్రం: “ఉత్తునకు సంధి నిత్యం”. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది.
ఉత్తు: హ్రస్వమైన ఉ. నిత్యం: ఎల్లప్పుడూ తప్పక జరుగును
మనము+ఉంటిమి=మనముంటిమి.
జగమెల్ల = జగము+ఎల్ల
సయ్యాటలాడెన్ = సయ్యాటలు+ఆడెన్
ధరాతలమెల్ల = ధరాతలము+ఎల్ల
ప్రపంచమంతా = ప్రపంచము+అంతా
నీరవుతుంది = నీరు + అవుతుంది
ఎత్తులకెదిగిన = ఎత్తులకు + ఎదిగిన
పేరవుతుంది = పేరు + అవుతుంది
ఇత్త్వ/ఇకార సంధి
“ఇత్తునకు సంధి వైకల్పికముగానగు”. ఏమ్యాదులందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.
ఇత్తు: హ్రస్వమైన ఇ. వైకల్పికము: ఒకసారి సంధి (నిత్యము) జరిగి, మరొకసారి సంధి జరగక (నిషేధము) పోవడాన్ని
వ్యాకరణ పరిభాషలో ‘వికల్పము’ వైకల్పికము అంటారు.
వచ్చితిమి+ఇప్పుడు = వచ్చితిమిప్పుడు .
దారినిచ్చిరి = దారిని+ఇచ్చిరి
అత్త్వ/అకార సంధి
“అత్తునకు సంధి బహుళముగానగు”. అత్తు నకు అచ్చు పరమైనపుడు సంధి బహుళము. అత్తు: హ్రస్వమైన అ. బహుళము: సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని బహుళం అంటారు. (అన్య అనగా ఇతర, కార్యము అనగా పని, హేతువు)
మేన+అల్లుడు=మేనల్లుడు.
మేనత్త = మేన+అత్త
సరళాదేశ సంధి/ద్రుత ప్రకృతిక సంధి
“ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే పరుషాలు సరళాలుగా మారును”.
కచటతపలు వరుసగా గజడదబలు గా మారుతాయి.
ద్రుతము: నకారాన్ని ద్రుతం అంటారు. (ను, న్)
దృతప్రకృతికాలు: నకారం చివరన వుండే పదాలను దృతప్రకృతికాలు అంటారు. (పదం చివరన ను లేదా న్ వుండడం)
పరుషాలు: కచటతప సరళాలు: గజడదబ
పూచెను+కలువలు=పూచెనుగలువలు
మూటఁగట్టు = మూటన్+కట్టు
పూచెనుగలువలు = పూచెను+కలువలు
గసడదవాదేశ సంధి
ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళముగానగు. (ప్రథమ అనగా ప్రథమా విభక్తిప్రత్యాలు)
కచటతప లకు వరసగా గసడదవలు ఆదేశంగా వస్తాయి
వాడు+కొట్టె=వాడుగొట్టె
నాల్కలుసాచు = నాల్కలు+చాచు
ప్రాణాలు గోల్పోవు = ప్రాణాలు+కోల్పోవు
ఆసువోయుట = ఆసు+పోయుట
కాలుసేతులు = కాలు+చేతులు
త్రిక సంధి
“ఆ ఈ ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.
త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విరుక్తంబు పరంబుగనగు.
ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్ఛికంబబబైన దీర్ఘంనకు హ్రస్వంబగు”.
ద్విరుక్తం: ద్విరుక్తము అనగా ద్విత్వాక్షరం
ఆచ్చికం: అచ్చ తెలుగు పదం
అచ్చోట = ఆ+చోట - త్రికసంధి
ఎక్కాలం=ఏ+కాలం - త్రికసంధి
ఇవ్వీటి = ఈ+వీటి- త్రికసంధి
రుగాగమ సంధి
“పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు”.
కర్మధారయమునందు పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే రుగాగమమవుతుంది.
కర్మదారయము: విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయం అంటారు.
ఒక వర్ణం మిత్రుడిలా అదనంగా చేరడమే ఆగమం.
పేదాది శబ్దములు: పేద, బీద, బాలింత మొదలైన పదాలు పేదాదులు.
పేదరాలు = పేద + ఆలు
బీదరాలు = బీద + ఆలు
బాలింతరాలు = బాలింత + ఆలు
గుణవంతురాలు = గుణవంత + ఆలు
శ్రీమంతురాలు = శ్రీమంత + ఆలు
బుద్ధిమంతురాలు = బుద్ధిమంత + ఆలు
సాహసవంతురాలు = సాహసవంత+ఆలు
సమాసాలు
సమాసము: రెండుమూడు శబ్దములను ఏకపదముగా చేర్చడము. విభక్తి లోపము చేసిన పదము.
“సమర్థములగు పదముల యేకీభావము”, సమాసములు వేరు వేరు అర్థములు గల పదములు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదమూ ఉత్తరపదమనియు అంటారు.
వేరువేరు అర్థాలుగల రెండు పదాలు ఒకే పదం అగుటద్వారా సమాసం ఏర్పడుతుంది.
విగ్రహవాక్యం: సమాసానికి అర్థ వివరణాన్నే విగ్రహవాక్యం అంటారు.
ద్వంద్వ సమాసము
“ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము”. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును. రెండుకాని అంతకన్న ఎక్కువగాని సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు.
రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.
ఆలుమగలు - ఆలును, మగడును
తల్లిదండ్రులు - తల్లియును, తండ్రియును
జీవధనములు - జీవమును, ధనమును
భూతప్రేతములు - భూతమును, ప్రేతమును
శక్తియుక్తులు - శక్తియును, యుక్తియును
అందచందములు - అందమును, చందమును
ద్విగు సమాసము
“సంఖ్యాప్రధానం ద్విగువు”. సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును.
ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.
పూర్వ పదం సంఖ్యా వాచకమైతే అది ద్విగువు. పూర్వపదం సంఖ్య అయితే తర్వాత పదం ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయి ఉంటుంది.
మూడు లోకములు - మూడు అయిన లోకములు.
త్రికరణాలు - త్రి (మూడు) సంఖ్యగల కరణాలు
నవరసాలు - నవ (తొమ్మిది) సంఖ్యగల రసాలు`
మూడడుగులు - మూడు సంఖ్య గల అడుగులు
దశదిక్కులు - దశ సంఖ్య గల దిక్కులు
రూపక సమాసం
రూపక సమాసాన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అనికూడా అంటారు.
అవధారణ: నిశ్చయించుట, నిశ్చయము, హద్దులో వుంచుట, ప్రతిబంధకము.
సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. “ఉపమానము యొక్క ధర్మాన్ని ఉపమేయముపై ఆరోపించడాన్ని రూపక సమాసం లేదా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు”.
“ఉపమాన ఉపమేయములకు అభేదం తెలపడం రూపకం.”
అభేదం: భేదమున్నను భేదమున్ననూ భేదం లేనట్లు చెప్పడం. “ఉపమాన ఉపమేయములకు భేదమున్ననూ భేదం లేనట్లు చెప్పడం రూపకం”.
విద్యా ధనము - విద్య అనెడి ధనము
కాంతివార్ధులు = కాంతులు అనే వార్ధులు
మతపిశాచి = మతము అనే పిశాచి
బహువ్రీహి సమాసము
“అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి”. అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము లోని రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.
అన్యము: ఇతరము, వేరొక. సమాసములోని పదాల ద్వారా వచ్చే మరో పదము యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్నట్టయితే దానిని బహువ్రీహి సమాసం అంటారు.
చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు
చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు
చతుర్ముఖుడు - నాలుగు ముఖములు కలవాడు
నీలవేణి - నీలమైన వేణి గలది
గరళకంఠుడు - గరళము కంఠమున గలవాడు
దయాంతరంగుడు - దయతో కూడిన అంతరంగము కలవాడు
ఆజానుబాహుడు ౼ జానువుల వరకు బాహువులు కలవాడు.
ముక్కంటి ౼ మూడు కన్నులు కలవాడు.
గరుడ వాహనుడు ౼ గరుడుడు వాహనముగా కలవాడు.
చతుర్ముఖుడు ౼ నాలుగు ముఖాలు కలవాడు.
పద్మాక్షి - పద్మం వంటి కన్నులు కలది.
దశకంఠుడు = దశ సంఖ్య గల కంఠములు గలవాడు
పీతాంబరుడు = పసుపు పచ్చిని అంబరము కలవాడు
అరవిందానన = అరవిందము వంటి ఆననము కలది
మృగనేత్ర = మృగము వంటి నేత్రములు కలది చంచలాక్షి
మానధనులు = అభిమానమే ధనముగా గలవారు
రాజవదన = రాజు అనగా చంద్రుని వంటి వదనము గలది
నీరజభవుడు = నీరాజము అనగా పద్మము పుట్టుకగా గలవాడు
చక్రపాణి = చక్రము పాణి యందు గలవాడు.
తత్పురుష సమాసాలు
“ఉత్తర పదార్థ ప్రధానం తత్పురుషం”. సమాసంలోని రెండో పదం యొక్క అర్థం ప్రధానంగా గల సమాసం తత్పురుషం. తత్పురుష సమాసాలను వ్యవధికరణ సమాసాలంటారు.
వ్యవధికరణం: విభక్తులతో కూడిన పదాలకు మీదిపదం పదంతోడి సమాసాన్ని వ్యవధికరణం అంటారు. విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలను చేర్చవలసి వస్తే మొదటి పదం చివర ఏ విభక్తి అనుకూలిస్తుందో ఆ విభక్తి పేరుతో ఈ సమాసాన్ని పిలుస్తారు. పూర్వపదం చివరవుండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తిస్తారు.
విభక్తులు
విభక్తులను కారకాలని కూడా అంటారు. అంటే క్రియతో అన్వయం పొందేవి లేదా అన్వయం కలిగించేవి అని అర్థం. తెలుగులోని విభక్తులన్నింటికీ క్రియతో సంబంధం ఉంటుంది. ఇవి పొడి అక్షరాల రూపంలోను, పదాల రూపంలోనూ ఉంటాయి. వీటికి చాలా వరకు ప్రత్యేకంగా అర్థముండదు. వీనిని నామ విభక్తులని కూడా అంటారు. ప్రత్యయాలని మరోపేరు.
ప్రత్యాలు - విభక్తులు
డు, ము, వులు - ప్రథమా విభక్తి
నిన్, నున్, లన్, గూర్చి, గురించి - ద్వితీయా విభక్తి
చేతన్, చేన్, తోడన్, తోన్ - తృతీయా విభక్తి
కొఱకున్ (కొరకు), కై - చతుర్ధీ విభక్తి
వలనన్, కంటెన్, పట్టి - పంచమీ విభక్తి
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ - షష్ఠీ విభక్తి
అందున్, నన్ - సప్తమీ విభక్తి
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ - సంబోధనా ప్రథమా విభక్తి
ప్రథమా తత్పురుష సమాసం
అర్ధరాత్రి - రాత్రి యొక్క అర్ధభాగము
మధ్యాహ్నం - అహ్నం మధ్యభాగం
ద్వితీయా తత్పురుష సమాసం
నెలతాల్పు - నెలను తాల్చినవాడు
జలధరము - జలమును ధరించునది
తృతీయా తత్పురుష సమాసం
వయోవృద్ధులు - వయస్సు చేత వృద్ధులు
కనకాభిషేకము - కనకముతో అభిషేకము
చతుర్థీ తత్పురుష సమాసం
ఊతపదాలు - ఊతం కొరకు పదాలు
బ్రతుకు త్రోవ - బ్రతుకు కొరకు త్రోవ
సంక్షేమపథకాలు - సంక్షేమము కొరకు పథకాలు
పంచమీ తత్పురుష సమాసం
దొంగభయము - దొంగ వలన భయము
స్వర్గపతితుడు - స్వర్గము నుండి పతితుడు
షష్ఠీ తత్పురుష సమాసము
కాకతీయుల కంచుగంట - కాకతీయుల యొక్క కంచుగంట
ఎడారి దిబ్బలు - ఎడారిలో దిబ్బలు
ఇసుక గుండెలు - ఇసుక యొక్క గుండెలు
యయాతిచరిత్ర - యయాతి యొక్క చరిత్ర
పుష్పగుచ్ఛము - పుష్పముల యొక్క గుచ్ఛము
వేదాంగాలు - వేదాల యొక్క అంగాలు
సముద్రతీరము - సముద్రము యొక్క తీరము
సప్తమీ తత్పురుష సమాసము
బ్రాహ్మణభక్తి - బ్రాహ్మణుల యందు భక్తి
కుటీరపరిశ్రమ - కుటీరము లోని పరిశ్రమ
కంటినీరు - కంటి యందలి నీరు
నఞ్ తత్పురుష సమాసము
నఞ్ అంటే వ్యతిరేకార్థం.
అబావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు 'న' వర్ణము వచ్చును. ఈ 'న' వర్ణమునకు హల్లు పరమగునపుడు న-'అ' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
వ్యతిరేకార్థాన్ని బోధించు న ప్రత్యయం మొదలుగాగల సమాసాలకు నఞ్ తత్పురుష సమాసాలని పేరు.
అనుచితము - ఉచితము కానిది
అనంతం - అంతం లేనిది
అసాధ్యము - సాధ్యము కానిది
కర్మధారయ సమాసాలు
కర్మధారయము: శేషణమునకు విశేష్యము తోడి సమాసము. విశేషణ విశేష్యాలతో ఎపడిన పదాలను కర్మధారయాలు అంటారు.
కర్మధారయ సమాసాలను సమానాధికరణ సమాసాలు అనికూడా అంటారు.
సమానాధికరణం: విశేషణానికి విషేశ్యం తోడి సమాసమైతే సమాసమైతే దానిని సమానాధికరణం అంటారు. విషేశ్యం: విషేశ్యం అనగా నామవాచకం.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
“సమాసము లోని పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉంటే దానిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అంటారు”.
మధుర వచనము - మధురమైన వచనము
చిరునవ్వు - చిన్నదైన నవ్వు
నల్లకలువ - నల్లనయిన కలువ
పుట్టినిల్లు - పుట్టినట్టి ఇల్లు
పెనుతుఫాను - పెద్దదైన తుఫాను
కల్యాణ ఘంటలు - కళ్యాణ ప్రదమైన ఘంటలు
మహారవము - గొప్పదైన రవము
వికారదంష్ట్రలు - వికారమైన దంష్ట్రలు
బృహత్కార్యం - బృహత్తు అయిన కార్యం
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము
“సమాసము లోని పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము ఉంటే దానిని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము అంటారు”.
వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
సంభావనము: సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి.
“సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో దానిని సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము అంటారు”. సంజ్ఞనే సంభావన అంటారు. సమాసములోని పుర్వపదంలో సంభావన ఉన్నట్లయితే ఆ సమాసాన్ని సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము అంటారు.
ద్వారకా నగరము - ద్వారక అను పేరుగల నగరము.
తెలుగుభాష - తెలుగు అను పేరుగల భాష
గంగానది - గంగ అను పేరుగల నది.
తెలంగాణ రాష్ట్రం - తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం
గోలకొండ పట్టణము - గోలకొండ అనే పేరుగల పట్టణం
ఛందస్సు - గణవిభజన
పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజెప్పేది ఛందస్సు. పాదాది నియమాలు కలిగిన పద్య లక్షణాలను తెలుపునది చందస్సు. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందింది. పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు
ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది.
ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు, లఘువు.
గురువుని U తోటీ, లఘువుని I తోటీ సూచిస్తారు.
ఏకమాత్ర(రెప్పపాటు) కాలంలో పలుకబడేది లఘువు.
ద్విమాత్రాకాలంలో పలుకబడేది గురువు.
రెండుకంటే ఎక్కువ మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలను ప్లుతం అంటారు.
ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.
కొన్ని నియమాలు
దీర్ఘాలన్నీ గురువులు. (ఉదా: పాట = U I)
"ఐ", "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ"గురువు, "సైనిక్"లో "సై"గురువు)
ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే. (ఉదా: “అంగడి”లో సం గురువు, “దుఃఖము”లో దుః అనునది గురువు)
సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం ముందున్న అక్షరం గురువు. (ఉదా: “అమ్మ”లో అ గురువు, “సంధ్య”లో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది.
ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క"గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న"గురువు అవుతుంది
ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూచెన్ గలువలు"లో "చెన్"గురువు.)
లఘువులు
హ్రస్వాలు
హ్రస్వద్విత్వాలు
హ్రస్వసంయుక్తాలు
గురువులు
దీర్ఘాలు
ఐ, ఔ లతో కూడిన హల్లులు
సున్నతో కూడిన అక్షరాలు
విసర్గతో కూడిన అక్షరాలు
పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు
ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు
సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు
గణ విభజన
అక్షరాల గుంపును గణము అని అంటారు.
గణము అంటే మాత్రల సముదాయము. గురు లఘువుల సమూహం.
గణాలలో ఏక అక్షర (ఒకే అక్షరం) గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి.
ఏకాక్షర గణాలు
ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు ఏదైనా కావచ్చు.
ఉదా: శ్రీ, సై, లం
U, U, U
రెండక్షరాల గణాలు
రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు
లలము - II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగము (వ గణం) - IU ఉదా: రమా
గలము (హ గణం) - UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగము - UU ఉదా: రంరం, సంతాన్
మూడక్షరాల గణాలు
ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి. కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు.
య మా తా రా జ భా న స ల గం
I U U U I U I I I U
య మా తా రా జ భా న స ల గం - యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది.
ఆది గురువు-భ గణము-UII
ఆది లఘువు-య గణము-IUU
మధ్య గురువు-జ గణము-IUI
మధ్య లఘువు-ర గణము-UIU
అంత్య గురువు-స గణము-IIU
అంత్య లఘువు-త గణము-UUI
అన్నీ లఘువులు-న గణము-III
అన్నీ గురువులు-మ గణము-UUU
ఉపగణాలు
రెండక్షరాలవి - 4: గగ, గల, లగ, లల;
నాలుగక్షరాలవి - 10: తగము, తలము, నగము, నలము, భగురు, భలము, రగము, రలము, మలఘు, సలము;
ఐదక్షరాలవి - 7: నగలము, నగగము, నలలము, నలగము, సలలము, సలగము, సగలము.
ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు.
సూర్య గణములు ఇంద్ర, గణములు, చంద్ర గణములు
సూర్య గణములు
న = న = III
హ = గల = UI
ఇంద్ర గణములు
భ = UII
ర = UIU
త = UUI
న గము = IIIU
స లము = IIUI
న లము = III
చంద్ర గణములు
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII
వృత్తాలు
వృత్తము: నియత గణములును యతిప్రాసములుగల పద్యము. ఆవి: చంపకమాల, ఉత్పలమాల, శార్థూలం, మత్తేభం
జాతులు
జాతులు మాత్రాగణములతో, ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమాలు ఉన్నాయి. ఆవి: కందం, ద్విపద
ఉప జాతులు
తేటగీతి, ఆటవెలది
పాదం: పద్యమునందలి యొక చరణము. పద్యములో నాలుగవభాగము.
యతి: పద్యవిశ్రమస్థానము. ఛందస్సులో విరామ స్థానము.
ప్రాస: పద్యపాదమున రెండవ యక్షరము. పాదమందలి మొదటి అక్షరమునకు, య తిమై స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుట.
ప్రాస యతి: ప్రాసస్థాన అక్షరానికి యతిని పాటించడం. పద్య పాదంలో రెండవ అక్షరానికి సాధారణ యతిమైత్రి స్థానంలోని తరువాటి అక్షరానికి యతిని పాటించడం ప్రాసయతి అంటారు.
వృత్త పద్య లక్షణాలు
పద్యము-పాదాలు-గణములు-యతిస్థానం-అక్షరాలు-ప్రాసనియమం-ప్రాసయతి
ఉత్పలమాల-4-భ ర న భ భ ర వ-20-10-ఉంటుంది-లేదు
చంపకమాల-4-న జ భ జ జ జ ర-21-11-ఉంటుంది-లేదు
శార్థూలము-4-మ స జ స త త గ-19-13-ఉంటుంది-లేదు
మత్తేభము-4-స భ ర న మ య వ-20-14-ఉంటుంది-లేదు
పై నాలుగు పద్యాలలో అన్నింటిలోనూ నాలుగు పాదాలుంటాయి. అలాగే ప్రాస నియమం ఉంటుంది. ప్రాస యతి వుండదు.
కందం
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది.
సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే. పాదాలు నాలుగు కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు.
గగ గణము = UU { గురువు, గురువు }
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }
జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }
స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}
నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు}
ద్విపద
రెండు పాదములు గల పద్యము
లక్షణములు
ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి. అందుకే దీనిని ద్విపద అంటారు.
ప్రతిపాదములోనీ మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.
మూడవ గణం యొక్క మొదటి అక్షరం.
ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, ప్రాస లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు.
తేటగీతి
తేటగీతి తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. తేటగీతి ఉపజాతికి చెందినది. తేటగీతి పద్యం సూర్య, ఇంద్రగణాలతో ఏర్పడుతుంది.
పద్య లక్షణాలు:
తేటగీతిలో నాలుగు పాదాలుంటాయి.
ప్రతిపాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం యతి మైత్రి.
ప్రాసయతి ఉన్న పద్యాన్ని అంతరాక్కరగా పిలుస్తారు.కాని అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.
ప్రాస నియమం లేదు.
ఆటవెలది
ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. ఆటవెలది ఉపజాతికి చెందినది.
'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
ప్రతి పాదానికి ఐదు గణాలు ఉన్నాయి.
1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉన్నాయి.
2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి చెల్లింది.
ప్రాస నిమయం లేదు.
ప్రాసయతి చెల్లును.
సీసపద్యం
పద్య లక్షణం :
ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
పద్యపాదం రెండు సమభాగాలుగా ఉంటుంది.
రెండు భాగాల్లోను మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోను, 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోను మైత్రి కుదరాలి.
ప్రాస నియమం లేదు. ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో జత అక్షరాలు ప్రాసలో ఉండవచ్చు. ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే)
తేటగీతి లేదా ఆటవెలది దీనికి చివరగా ఉంటుంది.
ఇందులో నాలుగు పాదాలుంటాయి.
అలంకారాలు
ఇల్లు, మనిషి, పెళ్ళి మంటపం, ఫంక్షన్‌హాలు, వాహనం ఏదైనాసరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం.
అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు.
ఉపమాలంకారం
ఉపమాన, ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.
ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.
ఉపమేయం - దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం - ఉపమేయం)
ఉపమానం - దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం - ఉపమానం).
సమానధర్మం - ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం. (అందంగా ఉండడం -సమానధర్మం ),
ఉపమావాచకం - పోలికను తెలిపే పదం. (వలె - ఉపమావాచకం)
ఉత్ప్రేక్ష అలంకారం
పోలికను ఊహించి చెబితే అది 'ఉత్ప్రేక్ష' అలంకారం.
“ఈ మేఘాలు గున్న ఏనుగులా! అన్నట్టు ఉన్నాయి.”
ఉపమేయం : మేఘాలు ఉపమానం : గున్న ఏనుగులు
అంటే మేఘాలను ఏనుగు పిల్లలవలె ఊహిస్తున్నామన్నమాట.
అతిశయోక్తి అలంకారం
ఏదైనా ఒక వస్తువును గాని, విషయాన్ని గాని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం 'అతిశయోక్తి' అలంకారం.
హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. కాని అవి నిజంగా ఆకాశాన్ని తాకవు.
కాని వాటిని ఎక్కువచేసి చెప్పడంవల్ల 'ఆకాశాన్ని తాకుతున్నాయి' అని అంటున్నాము.
కం. చుక్కలు తల పూవులుగా
నక్కజముగ మేను పెంచి యంబరవీథిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందె నాత్మస్థితిలోన్.
మా ఊర్లో సముద్రమంత చెరువు ఉన్నది.
అభిరాం తాటి చెట్టంత పొడవు ఉన్నాడు..
స్వభావోక్తి అలంకారం
విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే 'స్వభావోక్తి అలంకారం'.
శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో ఘనహుంకారముతో కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ
"గౌరవించదగిన, పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా?" అని సోన్దేవుని మందలించాడు.
పై వాక్యంలో కన్నులు ఎర్రబడటం, పై పెదవి అదరడం, గట్టిగా హుంకరించడం, కనుబొమ్మ ముడి కదలాడటం
కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు. ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం కూడా ఒక అలంకారమే.
దీన్ని 'స్వభావోక్తి’ అలంకారం అంటారు.
యమకాలంకారం
పదాలు తిరిగి తిరిగివస్తూ అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. పదాల విరుపువల్ల అర్థభేదం సృష్టించడం దీని ప్రత్యేకత.
లేమా! దనుజుల గెలువగ
లేమా! నీవేల కడగి లేచితివిటురా
పాఱజూచిన పరసేన పాఱఁజూచు.
ఛేకానుప్రాసాలంకారము
హల్లుల జంట అర్థభేదంతో వెంటవెంటనే వాడబడితే దానిని 'ఛేకానుప్రాసాలంకారం' అంటారు.
“నీటిలో పడిన తేలు తేలుతదా!”
అరటితొక్క తొక్కరాదు.
నిప్పులో పడితే కాలు కాలుతుంది.
తమ్మునికి చెప్పు! చెప్పు తెగిపోకుండా నడువుమని.
నీకు వంద వందనాలు
అంత్యానుప్రాస అలంకారం
పాదం చివర లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు.
పదాల, పాదాల, వాక్యాల చరణాల పై పాదాల చివర అక్షరాలు పునరుక్తమవడాన్ని 'అంత్యాను ప్రాస' అంటారు.
నగారా మోగిందా
నయాగరా దుమికిందా
తెలుగు జాతికి అభ్యుదయం
నవ భారతికే నవోదయం
గొడ్ల డొక్కలు గుంజినా ......
వాన పాములు ఎండినా ......
గుడిసెకు విసిరి పోతివా ......
నడుం చుట్టుక పోతివా ......
ఎన్నడొస్తవు లేబరీ; పాలమూరి జాలరీ !
కొందరికి రెండు కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
రంగదరాతిభంగ; ఖగరాజతురంగ; విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ; పరితోషితరంగ; దయాంతరంగ; స
త్సంగ; ధరాత్మజా హృదయ సారస భృంగ; నిశాచరాబ్జ మా
తంగ; శుభాంగ! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
వృత్యానుప్రాస అలంకారం
ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు.
ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని ‘వృత్త్యను ప్రాస’ అలంకారం అంటారు.
అడిగెద నని కడువడిఁ జను
నడిగినదను మగుడ నుడుగఁడని నడ యుడుగున్
వెడవెడ డిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
రాజు రివాజులు బూజు పట్టగన్
గడ గడ వడకుచు తడబడి జారిపడెను.
రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
రూపకాలంకారము
ఉపమేయానికి, ఉపమానానికి భేదం (తేడా) ఉన్నా, లేనట్లు చెపితే అది రూపకాలంకారం.
ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు.
బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
వానజాణ చినుకుపూలను చల్లింది.
నవ్వులనావలో తుళ్ళుతూ పయనిస్తున్నాం.
అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది.
నగరారణ్య హోరు నరుడి జీవనఘోష.
శ్లేషాలంకారం
నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష.
ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలనందిస్తున్నది. (విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి.)
విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దానిని 'శ్లేషాలంకారం' అని అంటారు.
మిమ్ముమాధవుడు రక్షించుగాక!
మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక!
మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక!
మానవ జీవనం సుకుమారం.
మా నవ (ఆధునిక) జీవనం సుకుమారమైంది.
మానవ (మనిషి) జీవనం సుకుమారమైంది.
రాజు కువలయానందకరుడు.
నీవేల వచ్చెదవు.
మావిడాకులు తెచ్చివ్వండి.
వాడి కత్తి తీసుకోండి.
ఆమె లత పక్కన నిలుచున్నది.
వాక్యాలు:
సంశ్లిష్ట వాక్యం
రెండు లేక మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది. ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు, అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీనినే "సంశ్లిష్ట వాక్యం" అంటారు.
వ్యాసుడు కాశీనగరానికి వచ్చి, తపస్సు చేశాడు,
జ: వ్యాసుడు కాశీ నగరానికి వచ్చాడు. వ్యాసుడు తపస్సు చేశాడు.
మాధవ్ మైదానానికి పోయి, ఖోఖో ఆట ఆడాడు.
జ: మాధవ్ మైదానానికి పోయాడు. మాధవ్ ఖోఖో ఆట ఆడాడు.
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
జ: గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది.
విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జ: విమల వంట చేస్తూ, పాటలు వింటుంది.
అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జ: అమ్మ నిద్ర లేచి, ముఖం కడుక్కుంది.
రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడి పండ్లు తెచ్చాడు.
జ: రవి ఊరికి వెళ్ళి, మామిడి పండ్లు తెచ్చాడు.
అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటిపూడి వెంకటరత్నం అచ్చువేయించాడు.
జ: అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి, అచ్చువేయించాడు.
గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణశర్మ అనేక సన్మానాలు పొందాడు.
జ: గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించి, అనేక సన్మానాలు పొందాడు.
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు.
జ: కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.
సంయుక్త వాక్యం
రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి "సంయుక్త వాక్యాలు" అవుతాయి.
అనుసంధాన పదాలు అంటే కావున, కానీ, మరియు, అందువల్ల మొదలైనవి. రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం. రెండు నామపదాలు ఒకేచోట చేరి చివర బహువచనం చేరడం.
రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
జ: రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.
వర్షాలు కురిసాయి. పంటలు బాగా పండాయి.
జ: వర్షాలు కురిసాయి కావున పంటలు బాగా పండాయి.
అతనికి కనిపించదు. అతడు చదువలేడు.
జ: అతనికి కనిపించదు కావున అతడు చదువలేడు.
వనజ చురుకైనది. వనజ అందమైనది.
జ: వనజ చురుకైనది, అందమైనది.
దివ్య అక్క శైలజ చెల్లెలు.
జ: దివ్య, శైలజ అక్కాచెల్లెళ్ళు
రామయ్య వ్యవసాయదారుడా?
జ: రామయ్య ఉద్యోగస్తుడా? రామయ్య వ్యవసాయదారుడా? ఉద్యోగస్తుడా?
ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
జ: ఆయన డాక్టరా, ప్రొఫెసరా?
నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు.
నల్గొండ జిల్లాలో పత్రికా విలేఖరులు ఉన్నారు.
జ: నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులూ, పత్రికా విలేఖరులు ఉన్నారు.
నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు.
జ: నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు.
తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.
జ: తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కాని వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.
సామాన్య వాక్యాలుగా మార్చడం
తిరుమల రామచంద్రగారు సంస్కృత, ఆంధ్రభాషలలో పండితుడు.
జ: తిరుమల రామచంద్రగారు సంస్కృతభాషలో పండితుడు.
తిరుమల రామచంద్రగారు ఆంధ్రభాషలో పండితుడు.
నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
జ: నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరువేరు.
జ: ఇంట్లో మాట్లాడే భాష వేరు.
ఇంట్లో బడిలో చదివే భాష వేరు.
కర్తరి, కర్మణి వాక్యాలు
ఒక వాక్యంలో క్రియ, కర్తను సూచిస్తే అది కర్తరి వాక్యం, కర్మను సూచిస్తే కర్మణి వాక్యం.
ఆళ్వారుస్వామి 'చిన్నప్పుడే' అనే కథ రాశాడు. (కర్తరి)
జ: 'చిన్నప్పుడే' అనే కథ ఆళ్వారుస్వామిచే రచింపబడింది. (కర్మణి)
పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని 'తమస్' నవలలో చిత్రించాడు.
జ: పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని చేత 'తమస్' నవలలో చిత్రించబడ్డాయి.
హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు.
హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేయబడింది.
నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు.
నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించబడ్డారు.
ప్రత్యక్ష కథనం
ఒకరు చెప్పిన మాటలు / వాక్యాలను చెప్పింది చెప్పినట్లే రాయాలి. ఆ మాటలకు / వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు (“ “) ఉండాలి.
ప్రథమపురుషలో ఉన్న పదాలు (అనగా తమను, తమ, తాను, తాము వంటి పదాలు) ఉత్తమ పురుషలోనికి నేను, మేముగా మారుతాయి.
"అక్కా! ఆ చెరువు జూడు.”
"నేను రాన్రా తమ్ముడు. ".
"పిల్లలూ! రేపు బీర్పూరు జాతరకు వెళుతున్నాను.”
"మేమూ వస్తాం సర్.”
"మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువకాదు, ఎవరూ తక్కువ కాదు" అన్నాడు భాగ్యరెడ్డి వర్మ.
జ: మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువకాదు, ఎవరూ తక్కువ కాదని అన్నాడు భాగ్యరెడ్డి వర్మ.
రుద్రమదేవితో తల్లి నారాంబ “నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు. నువ్వు పట్టమహిషివి, నేను భావి చక్రవర్తిని, మనకు కండ్లు మటుకే ఉండాలి కాని కన్నీళ్ళు ఉండకూడదు" అన్నది.
జ: ఆమె తానూ, మామూలు స్త్రీలం కాదని, ఆమె పట్టమహిషివయని, తాను భావి చక్రవర్తినని, వాళ్ళకు కండ్లు మటుకే ఉండాలి కాని కన్నీళ్ళు ఉండకూడదని తల్లి నారాంబ రుద్రమదేవితో అన్నది.
రాజకీయపార్టీల వారు “జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర" అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.
జ: రాజకీయపార్టీల వారు తమ ఎన్నికల ప్రణాళికల్లో జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర అని ప్రకటించారు.
“సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది" అని నెహ్రూ అన్నాడు.
జ: సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు.
"హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది" అని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రకటించాడు.
జ: హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైందని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రకటించాడు.
"తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామి” అని గూడూరి సీతారాం అన్నాడు.
జ: తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామి అని గూడూరి సీతారాం అన్నాడు.
“చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది" అని డి. రామలింగం పేర్కొన్నాడు.
జ; చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి. రామలింగం పేర్కొన్నాడు.
పరోక్ష కథనం
ఇవి సూటిగా వాళ్లే చెప్తున్నట్లు కాకుండా! ఇంకొకళ్ళు చెప్తున్నట్లున్నాయి కదా!
ఇలాంటి వాక్యాలను "పరోక్ష కథనం"లో ఉన్న వాక్యాలు అంటారు.
వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరం లేదు.
పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు తొలగించి “అని” చేరుస్తారు.
ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటివి. ప్రథమ పురుష పదాలుగా తాను, తాము, తన తమ లుగా మారుతాయి.
హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు.
జ: “నేను రాను” అని హర్షవర్ధన్ హర్షిణితో అన్నాడు.
ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు.
జ: “మీరు చెప్పినట్లు చేస్తాము” అని ప్రధానోపాధ్యాయునితో పిల్లలు అన్నారు.
తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు.
జ: “నన్ను క్షమించు” అని రాజు తన మిత్రునితో అన్నాడు.
పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు.
జ: “పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం” అని ముఖ్యమంత్రి ప్రకటించాడు.
సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరని మేధావులు నిర్ణయించారు.
జ:“సమాజాన్ని సంక్షేమపథకాలరూపంలో ఆదుకోవడం తప్పనిసరి” అని మేధావులు నిర్ణయించారు.
తెలుగులోనే రాయండని, తెలుగే మాట్లాడండని టి.వి. ఛానల్లో ప్రసారం చేశారు.
జ: “తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి.” అని టి.వి. ఛానల్లో ప్రసారం చేశారు.
వ్యవహారభాషలోనికి మార్చడం
పట్టణము అలంకారముగా నుండుటకు అందరును ఉత్సాహముతో పాటుపడిరి.
జ: పట్టణం అలంకారంగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు.
ఈ మందిరము నందే పారశీకపు రాయబారికిని, అతని అనుచరవర్గమునకును బస ఏర్పాటు చేసిరి.
జ: ఈ మందిరంలోనే పారశీకపు రాయబారికీ, అతడి అనుచరవర్గానికీ బస ఏర్పాటు చేసారు.
నీటి కాలువలు, జలాశయములు, జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను.
జ: నీటి కాలువలూ, జలాశయాలూ, జలపాతాలూ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నియు లోపలి కోటలో నుండుచుండెను.
జ: పెద్ద అధికారుల మందిరాలన్నీ లోపలి కోటలో ఉంటాయి.
వజ్రములకు గోలకొండ పుట్టినిల్లే గదా!
జ: వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా!
పట్టణములోనికి సరుకంతయు బంజారాదర్వాజా ద్వారానే వచ్చుచుండును.
జ: పట్టణంలోకి సరుకంతా బంజారా దర్వాజా నుండే వస్తూంటుంది.
కవి పరిచయాలు
చుక్క గుర్తు గల పద్యాలు, భావాలు, ప్రతిపదార్థాలు
పాఠ్యభాగ సారాంశాలు, సృజనాత్మక అంశాలు
పదజాల, వ్యాకరణాంశాలు మొదలైన వాటిన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
*అదనపు అంశాలు
అపరిచిత గద్యాలు
ఈ కింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రపంచములోనే పేరెన్నిక గన్నది మన భారతదేశం యొక్క మిలిటరీ. మన మిలిటరీకి ఉన్న ప్రత్యేకతలు గొప్పతనము తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము. ప్రతి సంవత్సరము జనవరి 15 న మన ప్రభుత్వము “ఇండియన్ ఆర్మీ డే”గా జరుపుతారు. ఎందుకంటే 1949 జనవరి 15 న అప్పటి లెఫ్టినెంట్ జనరల్ కె.ఎమ్ కరియప్ప బ్రిటిష్ జనరల్ సర్ ప్రాన్సిస్ బుచర్ నుండి పదవి బాధ్యతలు స్వీకరించి స్వతంత్ర భారత దేశపు కమాండర్ ఇన్ చీఫ్ అయినాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము జనవరి 15 ను ఇండియన్ ఆర్మీ డే గా జరుపుకుంటున్నాము. ఈ సందర్భముగా మన ఆర్మీ ప్రత్యేకతలు, గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాము.
1776లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వారి ఏలుబడిలో భారతదేశములో ఇండియన్ ఆర్మీ ని స్థాపించారు. 1773లో నే ఇండియన్ ఆర్మీలోని రెజిమెంట్ “ప్రెసిడెంట్స్ బాడీ గార్డ్స్” రెజిమెంట్ ప్రారంభించబడింది. ఇది అతి పురాతన రెజిమెంట్. ఇందులోని సైనికులు శిక్షణ పొందిన పేరాట్రూపర్స్ ఇంకో ఆసక్తికరమైన విషయము ఏమిటి అంటే భారతీయ సైన్యములో అశ్విక దళము కూడా ఉంది. ప్రపంచములో ప్రస్తుతము ఉన్న 3 అశ్విక దళాలలో ఇది ఒకటి.
ప్రపంచములోనే పేరెన్నిక గన్న మిలిటరీ గన్నఎవరిది?
జ: ప్రపంచములోనే పేరెన్నిక గన్న మిలిటరీ భారతదేశానిది.
ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు జరుపుతారు?
జ: ఇండియన్ ఆర్మీ డే ను ప్రతి సంవత్సరము జనవరి 15 న జరుపుతారు.
స్వతంత్ర భారత దేశపు కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు?
జ: స్వతంత్ర భారత దేశపు కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ కె.ఎమ్ కరియప్ప.
భారతదేశములో ఇండియన్ ఆర్మీ ని ఎవరు స్థాపించారు?
జ: భారతదేశములో ఇండియన్ ఆర్మీ ని 1776లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్థాపించారు.
భారతదేశములో అతి పురాతన రెజిమెంట్ ఏమిటి?
జ: భారతదేశములో అతి పురాతన రెజిమెంట్ “ప్రెసిడెంట్స్ బాడీ గార్డ్స్” రెజిమెంట్.
ఈ కింది గద్యాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.
ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా కనిపిస్తున్నాయి. ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాల్ని “మూఢ నమ్మకాలు” అంటారు. ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా చదువుకోనివారిలో, గ్రామాలలోను, ఆదివాసీ గిరిజన సమూహాలలో కనిపిస్తాయి.
ఒత్తిడి కారణంగా మనలో మూఢ నమ్మకాలు ప్రబలుతాయని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ రుగ్మత వల్ల ఆచార వ్యవహారాలపై నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా అవాస్తవమైన అంశాలు కూడా నిజంగానే ఉన్నట్లుగానే భ్రమపడతారని పరిశోధకులు తెలిపారు. ఇటువంటివి మనకు చాలా ఉన్నాయి. విదేశీయులకు ఇలాంటివి ఉండవు. వాళ్ళు మనకన్నాగొప్ప నాగరికులు. ఆధునిక భావ జాలము కలవాళ్ళు అని మనము అనుకుంటాము కానీ ఈ మూఢనమ్మకాల విషయములో వాళ్ళు మనకు ఏమాత్రము తీసిపోరు. వాళ్లకు ఉండే మూఢనమ్మకాలు వాళ్ళవి టోటల్ గా ప్రపంచవ్యాప్తముగా ఏ దేశస్తులైన వీటికి అతీతము కారు అని నిరూపిస్తున్నాయి.
రెండవ తరగతికి చెందిన నమ్మకాల్ని ఏమంటారు?
మూఢ నమ్మకాలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి?
బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది ఏమిటి?
విదేశీయుల గురించి మన భావన ఏమిటి?
ప్రపంచవ్యాప్తముగా ఏ దేశస్తులైన వేటికి అతీతము కారు?
అపరిచిత పద్యాలు
శతకం పేరు - రచయిత - మకుటం
వేమన శతకం - వేమన - వినుర వేమా, విశ్వదాభిరామ వినుర వేమా మొI
సుమతీ శతకం - బద్దెన - సుమతీ
కుమార శతకం - పక్కి వేంకటనరసయ్య - కుమారా
శ్రీ కాళహస్తీశ్వర శతకం - ధూర్జటి - శ్రీ కాళహస్తీశ్వరా
దాశరథి శతకము - కంచెర్ల గోపన్న - దాశరథీ కరుణాపయోనిధీ
కృష్ణ శతకము - నృసింహ కవి - కృష్ణా
వృషాధిప శతకము - పాలకుర్కి సోమన - బసవా! బసవా! బసవా! వృషాధిపా!
నరసింహ శతకము - శేషప్ప కవి - భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
సద్గోష్ఠి సరియు నొసగును
సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! సజ్జనులతో సహవాసము, మాట్లాడుట సంపదలను కలిగించును. కీర్తిని వృద్ధికి తెచ్చును, తృప్తిని కలిగించును, పాపములను పోగొట్టును. కాబట్టి సజ్జనులతో స్నేహము అవశ్యము చేయతగినది.
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁజేయకు
మాచారము విడువఁబోకుమయ్య కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! ఉపాధ్యాయుని ఎదురింపవలదు. నిన్నుగాపాడిన వారిని తిట్టవద్దు. ఏదయినా ఆలోచనము చేయుటలో ఒంటరిగా జేయవద్దు. మంచి నడవడిని వదిలి పెట్టవద్దు.
అవయవహీనుని సౌంద
ర్యవిహీను దరిద్రుని విద్య రానియతని సం
స్తవనీయు, దేవశృతులన్
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! వికలాంగుని, కురూపిగా ఉండువానిని, దానము లేని దరిద్రుడిని, విద్యరాని వానిని, గొప్పగుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు.
చేయకుము కాని కార్యము;
పాయకుము మఱిన్ శుభం; బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబునఁ ;
గూయకు మొరుమనసు నొచ్చుఁ గూఁత కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! సాధ్యము కాని పనిని చేయుటకు ప్రయత్నించవద్దు, మంచిదానిని వదలవద్దు.
పగవాని యింట భుజించవద్దు. ఇతరులకు నొప్పికలుగునట్లు మాట్లాడవద్దు.
విద్యలేనివాడు విధ్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న నెంచ గుణపు ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! దేవుని పూజలకంటే నిశ్చలమైన బుద్ధి ఉండుట మంచిది. మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనస్సు కల్గియుండుట మంచిది. వంశము యొక్క గొప్పతనం కంటే వ్యక్తి యొక్క మంచితనం ముఖ్యము.
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! నిజమైన మంచి నీలమణి ఒక్కటైనా చాలును. అంతేగానీ ఊరక మెరిసే గాజురాళ్ళు తట్టెడు ఉన్ననూ వ్యర్థమే. చాటు పద్యము ఒక్క దానిని విన్ననూ చాలును గదా! అనేక రసహీన పద్యములను విన్ననూ నిరుపయోగమే కదా! అని భావం.
చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటఁగలిసె
బ్రాప్తిగల్గు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: స్వాతి కార్తె యందు వర్షపు బిందు చిప్పయందు పడినచో ముత్తెమగును. నీటియందు పడినచో నీటిలో కలిసిపోవును, కనుక ప్రాప్తి ఉన్నచో అదృష్టము ఎక్కడికీ పోదని భావం.
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!
తాత్పర్యం: ఓ సుమతీ భూమిలో చీమలు కష్టపడి పెట్టిన పుట్టలలో పాములు చేరును. అట్లే మూర్ఖుడు దాచి ఉంచిన బంగారం రాజులపాలై అతనికి ఉపయోగపడకపోవును.
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్
దలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
తాత్పర్యం: ఓ సుమతీ! పామునకు తలయందు విషముండును. తేలుకు విషము తోకలో ఉండును. కానీ దుర్మార్గుడైన మనిషికి తల, తోక యనక శరీరమంతయు విషము ఉండును
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జను లా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
తాత్పర్యం: ఓ సుమతీ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలగదు. కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నపుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలగును.
మాటకు బ్రాణము సత్యము
కోటకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికి బ్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
తాత్పర్యం: ఓ సుమతీ! మాటకు సత్యమే ప్రాణము. ఈ ప్రపంచమున కోటకు ప్రాణము వీరులైన సైనికులే అగుదురు. స్త్రీకి శీలమే ప్రాణము, అట్లే చీటీకి సంతకమే ప్రాణము. అనగా సంతకములేని చీటీ వ్యర్థమే కదా! అని భావం.
All the very best to All my Dear Students
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹