తెలంగాణాలో తెలుగు భాషా దినోత్సవం - రాజేంద్ర

తెలంగాణాలో తెలుగు భాషా దినోత్సవం - రాజేంద్ర

 తెలంగాణాలో తెలుగు భాషా దినోత్సవం


మాసు రాజేందర్ ,
టీచర్, జి.ప.ఉ.పా. రాయపర్తి (పరకాల),
 మం: నడికూడ, జి: హనుమకొండ. 


ఆగస్టు 29న వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం సందర్భంగా   తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవాల్సి వస్తుంది. గిడుగు వెంకట రామ్మూర్తి 1848 ఆగస్టు 29న ఆంధ్ర ప్రదేశ్‌లోని గిద్దలూరులో జన్మించారు. గిడుగు వెంకట రామ్మూర్తి 118వ జయంతి సందర్భంగా 1966లో తొలిసారిగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు.

తెలుగు భాషా సంస్కృతుల విధ్వసం 

తెలుగు భాషా దినోత్సవం 


చారిత్రిక నేపథ్యం చూసినట్టైతే తెలుగు భాష, ఆంధ్ర భాష వేరువేరు అని ప్రస్ఫుటమవుతుంది. క్రీ.పూ. సుమారు ఆరు ఏడు వందల సంవత్సరాలనాడే తెలుగు వుంది అనడానికి శాసనాధారాలు, క్రీ.శ. ఒకటవ శతాబ్దం శాతవాహనుల నాడు రచించిన గాధాసప్తశతి తెలుగు విలసిల్లింది అనడానికి తార్కాణాలు.  ఆంధ్ర ప్రాతం వారు మాట్లాడే భాషను ఆంధ్రము అని, అలాగే తెలంగాణ వారు మాట్లాడే భాష తెలుగు అని అంటారు. తెలుగు అనే పదం, తెలుగు భాష తెలంగాణ వాళ్ళది. తెలంగాణా దురాక్రమణ తర్వాత ఆంధ్ర వాళ్ళు తెలుగు అనే పదాన్ని దొంగిలించారు. ఆంధ్ర భాషా దినోత్సవం అని జరుపుకోవాల్సిన ఆంధ్రులు, తెలంగాణ ప్రాతాన్ని విలీనం చేసుకుని రెండు ప్రాంతాలకు కలిపి ఆంద్రప్రదేశ్ అని పేరు పెట్టారు మరియు వారు మాట్లాడే ఆంధ్ర భాషని తెలుగు అని చెప్పుకున్నారు. ఆంధ్ర భాషకు తెలుగు అని తెలంగాణాను కలిపి ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టి తెలంగాణాను తెలుగు భాష మాట్లాడే ప్రజలను మోసం చేశారు. ఈ విధంగా తెలంగాణ ప్రాంతంపై, భాషపై ఆంధ్ర వాళ్ళు దురాక్రమణకు పాల్పడ్డారు. లేదంటే ఎప్పటినుండో తెలంగాణగా పిలువబడుతున్న ఈ ప్రాతం తెలంగాణగా, ఈ ప్రాంత భాష మాత్రమే తెలుగు భాషగా కొనియాడ బడేది. అప్పుడు కాళోజి నారాయణరావు జన్మదినం నాడు తెలంగాణా భాషా దినోత్సవం అని తెలుగు భాషా దినోత్సవం అని జరుపుకోబడేది.

వలసవాదులైన ఆంధ్రవారు కుయుక్తులతో తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించి ఇక్కడి భూముల్ని, నీళ్లను, నిధుల్ని, విద్యా వైద్య రంగాల్ని చేతుల్లోకి తీసుకుని తెలంగాణ ప్రజల జీవితాల్ని కొల్లగొట్టారు. సినిమా రంగాన్ని హస్తగతం చేసుకుని, తెలంగాణ ప్రజల భాషను సామాన్య ప్రజలకు మరియు విలన్స్ కు వాడి తెలంగాణా ప్రాంతీయుల భాషను కించపరుస్తూ వారిలో ఆత్మ న్యూనతను పెంచారు. సినిమాల్లో సంక్రాంతి పండగకు వున్న ప్రాముఖ్యత బతుకమ్మ పండక్కి ఉండేది కాదు. తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమైన తెలంగాణా సంస్కృతికి నిలువుటద్దమైన ప్రకృతి వరప్రసాదమైన పూల పండుగ బతుకమ్మ పండగ గొప్పదనం ఎక్కడా ప్రదర్శించబడలేదు. ఈ విధంగా తెలంగాణా ప్రాంతం మీద మరియు తెలుగు భాషా సంస్కృతుల మీద దాడికి పాల్పడి విధ్వంసాన్ని సృష్టించారు. 

వ్యావహారిక భాషా ఉద్యమం 

ఉత్తర కోస్తా జిల్లాలకు 1906లో స్కూళ్ళ ఇన్స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయ అధికారికి, కింది తరగతుల్లో తెలుగు పాఠాలు చెప్పే పద్ధతి అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఎందుకు తేడాలున్నాయి అన్నది అతనిని వేధించింది. ఈ ఆలోచన నుండి జనించినదే వ్యావహారిక భాషా ఉద్యమం. ఇందులో ప్రధాన భూమిక పోషించిన వారు గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు, శ్రీనివాస అయ్యం గారు, కందుకూరి వీరేశలింగం మొదలైన వారు తోడై వ్యవహారిక భాషలో రచనలు చేసేదిశగా ప్రయాణం ప్రారంభమై సఫలీ కృతులయ్యారు. సుమారు 20వ శతాబ్దం మొదటి భాగమంతా ఈ వ్యావహారిక భాషోద్యమం నడిచింది. ఉద్యమంలో విశిష్ట సేవలందించిన గిడుగు రామ్మూర్తి గారి జన్మదినంను తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 

సాహితీ సేవలో తెలుగుదనం 

ఏ ప్రాంత ప్రజలు మాట్లాడే భాష అయినా వికసించాలి, సజీవంగా ఉండాలి అంటే ఆ భాష లో ఎంతో విలువైన సాహితీ కృషి జరగాల్సిందే. అక్షరం భాషకు ప్రాణంపోసి భాషను శాశ్వతత్వాన్ని చేకూరుస్తుంది. సుమారు 2400 సంవత్సరాలకు పైబడి చరిత్రగల తెలుగు భాషకు శాతవాహనుల తొలిరాజధాని అయిన తెలంగాణ ఆలవాలమైది. 

తెలంగాణా కవులు పూర్వకాలంనుండి పద్య గద్య సాహిత్యాల్లో తెలుగు వాడుక భాషా పదాల ప్రయోగం చేసేవారు. అచ్చతెలుగు పదాల్ని వాడడం, సరళమైన ప్రజలభాషలోనే పద్యరచనలు చేయడం, సామాన్య ప్రజానీకానికి కూడా సులభ బోధకంగా రచనలు చేయడం పరిపాటి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణా సాహిత్యం ప్రజా సాహిత్యమని చెప్పాలి. ఒకదశలో తెలంగాణలో కవులే లేరనే అపవాదు మోపారు. దానికి సమాధానంగా సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ కవుల సంచిక ను అచ్చువేసి తెలంగాణా సాహితీ వేత్తల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. 

సంస్కృత రచనలను తెలుగులోకి యథాతథానువాదం చేయకుండా స్వేచ్చానువాదం చేసిన వారు తెలంగాణా కవులు. తెలుగులో దేశీ ఛందస్సును సృష్టించి, అచ్చతెలుగు కావ్యాలు రాసి వేల ఏళ్ళనాడే తెలంగాణా ప్రాతంలో వ్యావహారిక భాషను గ్రంథస్థం చేసిన గొప్పవుద్యమ కారులు తెలంగాణా కవులు. తెలుగు ప్రజల్లో అనునిత్యం నానే శతక పద్య ప్రక్రియకు ప్రాణం పోసింది తెలంగాణా వారే. తెలుగు భాషకు తెలంగాణా కవులు చేసిన సాహితీ సేవ వెలలేనిది. 

తెలంగాణా ప్రాతంలో వచ్చిన అనేక ఉద్యమాల్లో ప్రజల తెలుగు భాషలో గేయాలు, పద్యాలు, కథలు, నాటికలు మొదలైన ఎన్నో రచనలు చేసిన వారు తెలంగాణా కవులు. వారి స్పూర్తితో నేటికీ తెలంగాణ ప్రజలు ముందుకు కదులుతూనే వున్నారు. 

ఆంధ్ర వలస పాలకుల రక్కసి కోరల్లో చిక్కున్న తెలంగాణా ప్రాంతపు అస్తిత్వాన్ని నిలబెట్టి గొంతెత్తి గొడవను విడవకుండా నినదించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జన్మదినమే మన తెలుగు భాషా దినోత్సవం. అదే మన తెలంగాణా భాషా దినోత్సవం. 

29-08-2024,
మాసు రాజేందర్, హనుమకొండ,
9010137504. 

0/Post a Comment/Comments