అమ్మ నుండి అంతరిక్షం వరకు
నా తెలుగెప్పుడూ
వెలుగుతూనే ఉండాలి
నా తెలుగు ప్రజలెప్పుడు
తేజోమూర్తులై
ప్రకాశిస్తూనే ఉండాలి
ఆదికవి నన్నయ నుండి
నేటి ఎలనాగ వరకు
ప్రస్థానం సాగిస్తున్న
నా తెలుగు సాహితీ గమనం
ఎన్నో ఒడిదుడుకులు
ఎదుర్కొంటున్నా అన్యభాషల
ప్రభావం అణగదొక్కుతున్నా
నా తెలుగెప్పుడు
వసంతఋతువులో
వేసే చిగురులా
జీవం పోసుకుంటూ
దేదీప్యమానంగా
వెలుగుతూనే ఉండాలి
రాజులు మారిన
రాజ్యాలు మారినా
తెలుగు ప్రజలే
మన సంస్కృతిని
కాపాడే కర్తవ్యదీక్షులవ్వాలి
తెలుగు మహిళ గా
గర్వపడుతూ
నా తెలుగు నేలతల్లి
ఋణం తీర్చుకోవడానికి
కంకణ బద్దురాలినై
తెలుగు ఉపాధ్యాయురాలినై
తెలుగు ప్రేమికురాలినై
నా జీవితాన్ని తెలుగు భాషకు
అంకితమిస్తూ....
తెలుగును భాషిస్తూ...
పోషిస్తూ... సేవిస్తూ..
అమ్మఒడి నుండి అంతరిక్షం దాకా
వెలుగు నింపుటకు శ్రీకారం చుట్టినాను
- కల్పన దేవసాని
తెలుగు ఉపాధ్యాయురాలు