*బాల కార్మికులు*
(తేటగీతి పద్యములు )
పాల బుగ్గల పసివారు బాధ పడుచు
కూలి పనులను జేయుచు కుములు చుండి
తిండి దొరకని సమయాన దీనులగుచు
తిరుగు చుందురీ భారత దేశమందు.
చదువు సంధ్యలు నేర్పించి సమధికముగ
సాకు చుండెడి వారేరి జాతి యందు?
ప్రాత కాగితంబుల నేరి బ్రతుకు చుండి
పేదరికముతో బిడ్డలు బెంగపడిరి
భరత మాతకు బిడ్డలై బావురనుచు
బ్రతుకు బండిని లాగుచు భయము తోడ
క్రుంగి పోయిన వారికి గొప్ప చదువు
నేర్చుకొను వాంఛ తీరునా నేడు రేపు?
బాల కార్మికులన్ గాంచి ప్రజలు కూడి
యుద్యమించుచు బిడ్డల నుద్ధరించి
మంచి చదువులు నేర్పించి మానితముగ
వెలుగు నిచ్చిన చాలును వెతలు తీరు.
ఛిద్రమైనట్టి బ్రతుకున జీవ మిడుచు
పసిడి మొగ్గలన్ బోషించి భయము బాపి
వెన్నుతట్టుచు నిల్వగ విబుధవరులు
శక్తివంతమై మనజాతి సాగుచుండు.
- టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.