ఆదర్శ గ్రామం (చిట్టి కథ)
---------&&&&&--------------
ఒక గ్రామంలో రామయ్య జానకమ్మ అను బీద దంపతులు ఉండేవారు. వారి అన్యోన్య దాంపత్యం వలన వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వారిని చదివించుటకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆ ఇద్దరు ఆడపిల్లలు శ్రద్ధతో చదువుకొని ఆ పాఠశాలకు అందులోని ఉపాధ్యాయులకు మంచి పేరును తెచ్చారు.
ఒకరోజు రామయ్య తో ఆ పాఠశాల ఉపాధ్యాయులు" చూడండి రామయ్య గారు మీ ఇద్దరు పిల్లలు చాలా తెలివైన వారు. పది 10 ర్యాంకుతో పాసై మాకు, మా పాఠశాలకు మంచి పేరు తెచ్చారు. తెలివైన మీ పిల్లల చదువు ఆపక పై చదువులు చెప్పించండి. అనగా "మాస్టార్లూ! నాకు చదివించాలని ఉంది. కానీ మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. 10 చదివించేటప్పటికే మాకు దేవుళ్ళు దిగి వచ్చినంత పని అయింది. ఇక వాళ్లని పట్నం తోలించి పై చదువులు చెప్పించాలంటే ఉన్న నా పొలం అమ్మితేనే అది సాధ్యమయ్యేలా ఉంది. అని అన్నాడు"
మాస్టార్లు వెంటనే రామయ్య! నీ పిల్లలు చాలా హుషారైన వారు. పై చదువులు చదివి నెగ్గుకోస్తారని మాకనిపిస్తుంది. అప్పుడు మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏదో ఒకటి చేసి వారిని పై చదువులకు పంపించండి అని చెప్పి వారు వెళ్ళిపోయారు.
గత్యంతరం లేక రామయ్య ఓ ఎకరం పొలం అమ్మి పిల్లలను పై చదువులకు పట్నం పంపించాడు. పట్నంలో పిల్లలు కష్టపడి చదివి ఒకరు డాక్టర్ పట్టాను, మరొకరు లాయర్ పట్టాను సాధించారు. మరొక ఎకరం పొలం అమ్మి ఆసుపత్రికి కావలసిన వసతి ఏర్పాట్లు చేసి డాక్టర్ అయిన చిన్నమ్మాయిలతో గ్రామంలో ప్రాక్టీస్ పెట్టించాడు. పెద్దమ్మాయితో లాయర్ ప్రాక్టీస్ పట్నంలో ఏర్పాటు చేశాడు. ఇటు గ్రామంలో, అటు పట్నంలో ఇద్దరమ్మాయిలు వారి వారి వృత్తిలో పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించారు.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గ్రామ జ్యోతి కార్యక్రమం ప్రకటించింది. ఆ గ్రామ జ్యోతి కార్యక్రమం వివరాలు తెలుసుకొని ఇద్దరమ్మాయిలు తమ స్వగ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పరుచుటకు తీర్మానించుకున్నారు. రామయ్య బిడ్డల నిర్ణయాన్ని విన్న ఆ ఊరి ప్రజలు ఎంతో సంతోషించారు. అంతేగాకుండా వారికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ప్రజల కోర్కెను తన బిడ్డల నిర్ణయాన్ని విని రామయ్య జానకమ్మలు ఎంతో సంతోషించారు.
పై చదువుల్లో తమ స్నేహితురాండ్లైన ఇంజనీర్లు, రమ, ఉమలను సంప్రదించి గ్రామంలో పాఠశాల భవనం, ఆస్పత్రి భవనం నిర్మించి చక్కని రోడ్లను వేయించారు. నీటి ఎద్దడిని నివారించేందుకు గ్రామంలోని చెరువు పూడికలు తీయించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదించి వీధిలైట్లను, ఇంటింటికి నల్ల కలెక్షన్లను, రహదారి వెంట పచ్చ పచ్చని చెట్లను నాటించారు గ్రామంలో పరిశుభ్రతను నెలకొల్పారు. ఇలా సకల సౌకర్యాలను ఆ గ్రామానికి కల్పించి ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు.
ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి గ్రామ ప్రజల సమక్షంలో వీరిని పట్టు శాలువలతో సన్మానించి, గోల్డ్ మెడల్స్ ఇచ్చి సత్కరించింది. గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఉడతా భక్తిగా ఆ ఇద్దరు అమ్మాయిలను బంగారు కిరీటంతో సన్మానించి తమ యొక్క భక్తి ప్రవృత్తుల సేవలను సమర్పించుకున్నారు సమర్పించుకున్నారు. ఆ అమ్మాయి లిద్దరూ తమ తల్లిదండ్రులతోను, ప్రజలతోనూ కలసి ఆనందాన్ని పంచుకొని ఆ సంబరాల సాగరంలో మునిగిపోయారు.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.