అచ్చ తెలుగు భాష - మన తెలంగాణ భాష

అచ్చ తెలుగు భాష - మన తెలంగాణ భాష

 "అచ్చ తెలుగు భాష - మన తెలంగాణ భాష"

  అలవోకగా అర్థమయ్యే రీతిలో పద్య గద్య రచనలు చేసిన సహజ కవులు పూర్వకాలం నుండి అనేకమంది వ్యవహారికానికి చాలా దగ్గరగా, జన సామాన్యంలోని పదాల వాడుకతో రచనలు చేసారు.

అనాది నుండి ప్రజల భాష
  దేశీ ఛందస్సులో రచనలు చేసి ప్రజల పలుకుబళ్లను గ్రంథస్థం చేసిన పాల్కురికి సోమన  ఈ ప్రాంతం వాడు. ప్రజల నాలుకలపై తేలియాడే పదాలతో పద్యాలు రాసిన బమ్మెర పోతన ఈ ప్రాంతం వాడు. తొలి అచ్చ తెలుగు కావ్యం రచించిన పొన్నగంటి తెలగన్న ఈ ప్రాంతం వాడు. ఒకరిద్దరేమిటి తెలుగు విలసిల్లిన నేల ఈ తెలంగాణ. 
  ఈ సందర్భంగా సురవరం గారిని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. తెలంగాణలో కవులే లేరనే అపవాదును 'గోలకొండ కవుల సంచిక'తో చెరిపివేసిన సురవరం ప్రతాపరెడ్డి గారిని స్మరించుకోవడం మన కర్తవ్యం.

భాషోద్యమం
  వ్యవహారిక భాషా ఉద్యమం ఒక అవసరం ఆధునిక భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం, ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లి వచ్చిన విద్యావంతులు చేపట్టిన సంఘ సంస్కరణ ఉద్యమం సమాంతరంగా కొనసాగుతున్న రోజులలో ప్రజా చైతన్యం అవసరమయ్యింది. ప్రజలను పెద్ద మొత్తంలో కూడ గొట్టాల్సిన పరిస్థితులు దాపురించాయి. బ్రిటిష్ వారు మరియు కొంతమంది సంఘసంస్కర్తల పుణ్యమా అని, అప్పుడప్పుడే చదువుకు దగ్గరవుతున్న వారిని చైతన్యపరిచేందుకు, వారు మాట్లాడుకునే భాషలోనే వారికి సులభంగా అర్థమయ్యే విధంగా రచనలు చేయడం అనివార్యమైంది. 
  ఈ కోవలోనిదే వ్యవహారిక భాషా వాదం.. వ్యవహారిక భాష ఉద్యమం. అసంఖ్యాక నిమ్న వర్గాల ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీలుగా చెప్పబడుతున్న అణగారిన వర్గాల ప్రజల మీద ప్రేమతో గాని ఈ వ్యవహారిక భాషా ఉద్యమం పుట్టలేదు. కానీ ఏదేమైనా నేడు ప్రజామోదంతో వ్యవహారిక భాష నిర్విఘ్నంగా వాడబడుతూ, కొందరిచే ఈసడించబడుతూ విజయపథంలో ముందుకు సాగుతుంది. సామాన్య ప్రజలెందరినో విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు తన వంతు పాత్ర సమగ్రంగా పోషిస్తూనే ఉంది.

తెలంగాణ భాష
  "తెలుంగు ఆణే మే" అనే వ్యవహారమే తెలంగాణ అయ్యిందని, సుప్రసిద్ధ పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ తను రచించిన 'ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము' అనే చరిత్ర పరిశోధక గ్రంథములో నిరూపణ చేసాడు. తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే ప్రాంతమే తెలంగాణగా చరిత్రకారులచే చెప్పబడింది అందుకే నిస్సంకోచంగా తెలుగు భాష తెలంగాణ భాష.

ఉద్యమ గొంతుక
  ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ రథాన్ని ముందుండి నడిపింది కవులు, కళాకారులే. ఉద్యమంలో ప్రజలను నిత్యం తమ ఆటపాటలతో, చైతన్యపర్చిన వారి ఋణం ఏమిచ్చినా తీరదు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రజల గొంతుకై నినదించిన కాళోజి నారాయణరావు జన్మదినాన్ని "తెలంగాణ భాషా దినోత్సవం"గా జరుపుకోవాలని నిర్ణయించడం తెలుగు కళామతల్లి ఋణం తీర్చుకోవడమే. 
  తన రచనలతో ప్రభుత్వాలకు మార్గ నిర్దేశం చేసాడు కాళోజీ. ఉద్యమకారులకు ఊతమయ్యాడు. నిత్యం ప్రజల పక్షాన నిలబడి ప్రజాకవి అయ్యాడు. ప్రజల గోడు "తన గొడవ"గా  ప్రజ్వరిల్లింది. కాళోజీ కవనం ప్రజాక్షేత్రం. పుట్టుకనీది చావు నీది బతుకంతా దేశానిది అని దేశభక్తిని చాటిన విశ్వకవి కాళోజీ. 
  మరణానంతరం తన దేహాన్ని వరంగల్ లోని ప్రభుత్వ కాకతీయ వైద్య కళాశాలకు అంకిత మిచ్చిన మహనీయుడు కాళోజీ. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం గల కాళోజీ నారాయణరావు గారి పుట్టినరోజున తెలంగాణ భాషా దినోత్సవం జరపడం తెలంగాణా కవులు కళాకారులతో పాటుగా, తెలంగాణ ఉద్యమకారులందరినీ గౌరవించినట్టే. 
జై తెలంగాణ! - జై జై తెలంగాణ!!
తెలంగాణ భాషా దినోత్సవం - వర్ధిల్లాలి!!!

- రాజేంద్ర
9010137504
(తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా 07.09.2022)

0/Post a Comment/Comments