తాను చెక్కిన శిల్పాలు
గుడిలోన కొలువై
పూజలందుకుంటుంటే
ఆ పూజా ఫలంబు
దేవుడికి రూపమిచ్చిన
తనకు కాకుండ మరొకరికి
దక్కునా యటంచు
శిల్పి తన కష్టాన్ని మరచి
తన్మయత్వంలో ఒలలాడకుండునా...
ఆ శిల్పాలే నా శిష్యులైతే
ఆ శిల్పినే నేనైతే
ఈ గురువు జన్మంబు
సార్థకమవ్వదా
ధన్యుడను దేవా ! ధన్యుడనూ
ఇక నిన్ను కోరుటకు
మిగిలి ఏమున్నది నాకు
ఈశ్వరా ..పరమేశ్వరా...
తాను పెంచిన తోటపూలు
నిత్యం దైవ పూజకు
నోచుకుంటుంటే
ఆ పూజా ఫలంబు
పూలు పండించిన
తనకు కాకుండ మరొకరికి
దక్కునా యటంచు
తోటమాలి తన కష్టాన్ని మరచి
తన్మయత్వంలో
ఒలాడ కుండునా...
ఆ పూలే నా శిష్యులైతే
అ తోటమాలినే నేనైతే
ఈ గురువు జన్మంబు
సార్థక మవ్వదా...
ధన్యుడను దేవా!ధన్యుడనూ
ఇక నిన్ను కోరుటకు
మిగిలి ఏమున్నది నాకు
ఈశ్వరా....పరమేశ్వరా...
చందుపట్ల రామమూర్తి
ప్రభుత్వ ఉపాధ్యాయులు
హుజురాబాద్.