కంఠస్థ పద్యాలు-భావాలు
కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం
గలడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా!
భావం: దాతలలో గొప్పవాడా! ఓ బలి చక్రవర్తీ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ, నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడులోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని (వామనుడిని) పంపించు.
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా !
భావం: ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు ఉన్నాయి. వారు ఏంతో అహంకారంతో విర్రవీగారు . కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదూ. ప్రపంచంలో వారి పేర్లుకూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదా? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా.
నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ముపో;
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా! ధీవర్య! వేయేటికిన్?
భావం: ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా సరే. బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ! ఎందుకు ఇన్ని మాటలు. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా
సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడిన మాట తప్పను).
నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్!
ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వా
జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్
చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!
భావం: అమ్మా! కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్ర సమానమైన భుజ పరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాం రాజు తో తలపడ మన్నావు ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా!
తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా
జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము! భీ
తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్! దిశాం
చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్
భావం: ఈ తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తి బట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకునే వాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడి పోయింది. దిగంతాల నీ ఆకాశంలో ఇంద్రధనస్సుల వరుసలతో సయ్యాట లాడాయి.
తెలంగాణా! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలనమ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!
భావం: అమ్మా తెలంగాణా! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలమంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు యోధులే కాదు పరోపకారులు కూడా.
కవిపరిచయాలు
దానశీలము: దానశీలము అనే ఈ పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతన. ఇతను 15వ శతాబ్దానికి చెందిన వాడు. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతనకు సహజ పండితుడు అని బిరుదు గలదు. వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం మొదలగునవి రచించాడు.ఇతను రచించిన శ్రీమత్ భాగవతం అష్టమ స్కంధంలోని వామన చరిత్ర నుండి ఈ పాఠ్యభాగం స్వీకరించబడింది. భాగవతము పురాణ ప్రక్రియకు చెందినది.
పురాణాలు18. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. ‘సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశాను చరితం’ అనేవి పురాణ లక్షణాలు.
వీర తెలంగాణ: ఈ పాఠ్యభాగ రచయిత దాశరథి కృష్ణమాచార్య. డా. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి రుద్రవీణ నుండి గ్రహించబడింది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన ఉద్యమ వీరుడు దాశరథి. ‘ముసలి నక్కకు రాచరికంబు తగునే’ అంటూ నిజాంను వ్యతిరేకించి జైలు పాలైన ధీరుడు దాశరథి కృష్ణమాచార్య. జైలుకు వెళ్ళి జైలు గోడల మీద కుడా నిజాంకు వ్యతిరేకంగా పద్యాలు రాసాడు. తెలుగు సాహిత్యానికి ఇతడు చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థానకవి.
తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యుడు దాశరథి. గాలిబ్ గజళ్ళను తెలుగులోకి అనువదించాడు. ఎన్నో గ్రంథాలతో పాటు ఆణిముత్యాల వంటి సినిమా పాటలను రచించాడు. పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. ప్రాచీన పద్య రచనలు సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేవి కావు. కఠినమైన గ్రాంథిక భాషలో ఉండేవి. కాని ఆధునిక పద్యం అలాకాదు. అందరికి అర్థమయ్యే సులభ శైలిలో సరళంగా ఉండడం వీటి ప్రత్యేకత.
శతక మధురిమ: సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకాలలోని పద్యాలను ముక్తకాలు అంటారు ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది శతకాల్లో మకుటం సాధారణంగా పద్య పాదం చివర ఉంటుంది అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి ఈ పాఠ్య భాగంలో 8శతకాలకు చెందిన 8పద్యాలు ఉన్నాయి.
విశ్వనాథేశ్వర శతకం: రచయిత గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మ. 300కు పైగా అష్టావధానాలు చేసి ‘అవధాని. శశాంక ఆశుకవితా కేసరి’ అన్న బిరుదు పొందాడు.
జీవన భాష్యం: రచయిత ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ పాఠ్యభాగం “డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం” ఆరవ సంపుటిలోని “తెలుగు గజళ్ళ” లోనిది. ప్రక్రియ: గజల్. గజల్ లో పల్లవిని “మత్లా” అని, చివరి చరణాన్ని "మక్తా” అని, కవి నామముద్రను "తఖల్లుస్” అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖకవి. గొప్ప వక్త. సాహితీపరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి.70కి పైగా కావ్యాలు రాశాడు. సినిమా పాటలకు సాహితీ - గుబాళింపులను అద్దిన రసహృదయుడు సినారె.
భారత ప్రభుత్వం వారిచే "పద్మభూషణ్' పురస్కారంతో సత్కరించబడ్డాడు. 'విశ్వంభర' కావ్యానికిజాతీయస్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన "జ్ఞానపీఠ అవార్డు'ను అందుకున్నాడు. శబ్దశక్తి, అర్థయుక్తి సినారె కలానికీ, గళానికి ఉన్న ప్రత్యేకత.
Note: ఈ రెండు పేజీలలో వున్న కవిపరిచయాలు, పద్యాల్ని మరియు భావాల్ని చదివి కంఠస్థం చేసి, సారాంశాల్ని అవగాహన చేసుకుని, రామాయణాన్ని మననం చేసుకుని రాయగలిగితే 43 మార్కులు మీ సొంతం. పేరాగ్రాఫ్ ల ద్వారా ఓ 10మార్కులు. మొత్తం 53మార్కుల ప్రశ్నలకు జవాబులు రాయొచ్చు. ప్రశ్నలు పాఠాన్ని ఆధారం చేసుకుని వస్తాయి. జవాబులు సమర్థిస్తూ విశ్లేషిస్తూ సొంతమాటల్లో రాయగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. (లేఖ , సంభాషణా రచన , వ్యాసం, నినాదాలు , కరపత్రం మొదలైనవాటిలో ఒకటి రాయడం ద్వారా ఇంకో 7మార్కులు)
పాఠ్యభాగ సారాంశాలు
దానశీలము
బలిచక్రవర్తి తన ప్రాణం పోతుందని తెలిసినా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువైన శుక్రాచార్యుడు ఎంత వారించినా, హెచ్చరించినా గురువు మాటలు వినకుండా వామనునికి దానం చేస్తాడు. బలిచక్రవర్తి తన శక్తిసామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు. ఈ విషయాన్ని దేవతలు విష్ణువుతో చెప్పగా కొంత కాలానికి విష్ణువు వామన అవతారం ఎత్తి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వెళ్లి మూడడుగుల నేల కావాలని అడగగా ఇస్తానని మాటయిస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించిన అసుర గురువు శుక్రాచార్యుడు బలిని దానం ఇవ్వవద్దంటాడు.
శుక్రాచార్యుడు - దాతలలో గొప్పవాడవైన ఓ బలిచక్రవర్తీ! వచ్చినటువంటి వామనుడు ఆ పొట్టివాడు సామాన్యుడుకాడు. మూడు అడుగులతో ముల్లోకాల్ని కొలవగలడు. అతడిని ఎవరూ ఆపలేరు. నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఆ బ్రహ్మచారియైన వామనుని పంపించు. అని బలిచక్రవర్తి తో అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి.... ఓ మహాత్మా! ఇచ్చినమాటతప్పడంకన్నా పాపం లేదు. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి పంపించలేను. మాటకు కట్టువడి సత్యంతో బ్రతకడమే మానధనులకు మేలైన మార్గం. పూర్వం రాజులులేరా? రాజ్యాలు లేవా? వారేమైనా మూటగట్టుకొని పోయారా? అడిగిన వారికి లేదనకుండా దానం చేసిన శిబిలాంటి కొందరిని మాత్రమే ఈలోకం గుర్తుంచుకుంది.
ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా, బంధనం ప్రాప్తమైనా, ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా, నా వంశం నశించినా ఏది ఏమైనా కానీ! ఇన్ని మాటలు ఎందుకు వచ్చినవాడు విష్ణువు, శివుడు,బ్రహ్మ ఎవరైనా సరే ఆడినమాట తప్పను. ఎన్ని కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, మరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పలేరు. అని బలిచక్రవర్తిఅంటుండగా భర్త సైగను గ్రహించిన అతని భార్య వింధ్యావళి ఆ వామనుడి కాళ్ళు కడగడానికి బంగారు కలశంలో నీళ్ళు తీసుకుని వన్తుంది. అప్పుడు బలిచక్రవర్తి వామనున్ని పిలిచి లేవయ్యా! ఇటురా! నీవు అడిగింది లేదనకుండా ఇస్తాఅంటూ అతడి పాదాల్ని కడిగి పూజించి నీకు మూడు అడుగుల నేలను దానం చేస్తున్నానంటూ చేతిలో నీటిని ధారవోసాడు. అదిచూసి లోకం ఆశ్చర్యపడింది. పది దిక్కులూ, పంచభూతాలు “బళి బళి” అని పొగడాయి.
వీర తెలంగాణ
తెలంగాణ ప్రజలు పూరించిన ఉద్యమ శంఖారావం భూమండలం అంతా ప్రతిధ్వనించాయి. అన్ని దిక్కులు మేల్కొల్పేటట్లు చేసాయి. దుర్మార్గుల చేతిలో చిక్కుకున్న తెలంగాణ గొప్పతనం విశేషాలకు ఇప్పుడు అడ్డులు తొలగిపోయాయి. తెలంగాణ తల్లి తన ఒడిలో కోటి మంది తెలుగు పిల్లల్ని పెంచి వారికి యుక్తవయస్సు రాగానే చేతులకు కత్తులనిచ్చి నిజాం రాజు తో తలపడమని చెప్పింది.
తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. తానే గొప్ప రాజును అనుకునే నిజాం గర్వాన్ని అణచివేసేట్లుగా యుద్ధం సాగించింది. తెలంగాణలో ఏమి జరుగుతుందో తెలియక ప్రపంచమంతా భయపడిపోయింది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తులు కావడం కోసం తెలంగాణ ప్రజలు చేసిన స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగింది. తెలంగాణ పిల్లల్లో వచ్చిన విప్లవాత్మకమైన కదలిక భూమండలం అంతా ఆవరించింది. తెలంగాణ బిడ్డలంతా వీరులు, యోధులు, పరోపకారులు.
మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో తెలంగాణను ఆక్రమించి, ప్రజల గొంతులు కోస్తున్నప్పుడు తెలుగుదనాన్ని కోల్పోకుండా యుద్ధ రంగంలో దిగి విజయాన్ని సాధించారు. కాకతీయుల నుండి నేటిదాకా శత్రువుల దొంగదెబ్బలకు తెలంగాణ ఓడిపోలేదు. విజయం సాధిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నది.
శతక మధురిమ
సర్వేశ్వరా! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ. మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తియోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవుకదా!
శ్రీకాళహస్తీశ్వరా! తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలున్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపసులను కాపాడడానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు.
నీతిలో బృహస్పతి అంతటి వాడవైన ఓ సురభిమల్లా! తలవంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగిన వాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనసు నిండా మంచితనం కలవాడైన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.
దశరథుని కుమారా! దయాసముద్రునివైన శ్రీరామా! నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరుడవు, దుఃఖాలు పొందే వారి పాలిట బంధువువు, కాంతివంతమైన బాణాలు, అమ్ములపొది, కోదండము కలిగి, ప్రచండ భుజ తాండవ ధనుర్విద్యాకళలో కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరులేరని మదించిన ఏనుగునెక్కి ఢంకా మోగిస్తూ భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను!
అలంకారాలచేత శోభిల్లేవాడా! ధర్మపురిక్షేత్రంలో వెలసిన వాడా! దుష్టులను సంహరించేవాడా! పాపాలను దూరంచేసేవాడా! నరసింహా! విష్ణుభక్తులను నిందించకుండా ఉంటేచాలు, అనేక గ్రంథాలను చదివినట్లే, బిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటేచాలు. గొప్ప బహుమతిని ఇచ్చినట్లే, దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటేచాలు, బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడికట్టించినట్లే, ఇంకొకరి 'వర్షాశనాన్ని' (ఒక ఏడాదికి సరిపడా భోజనాన్ని) ముంచకుంటేచాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.
విశ్వనాథేశ్వరా! త్యాగం తో కూడిన దీక్షను పోనీ జనులందరి దీనస్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైన ఆనందకరమైన జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు.
ఓ లొంక రామేశ్వరా! మిత్రుడైన వాడు పుస్తకంమాదిరిగా మిక్కిలినేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్య సఫలతలో విలువైన ధనంవలె ఉపకరిస్తాడు. శత్రునాశనంనాశనంలో స్వాధీనమైన కత్తివలె సహాయపడుతాడు. నిండు మనస్సై సుఖాన్నిస్తాడు.
దయకు నిధివంటివాడా! నాగరకుంట పురమునందు కొలువైనవాడా! వేణుగోపాలకృష్ణా! నా దైవమా! శౌరీ! కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావివరుసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడుగాని వేరొకడుగాడు కదా!
జీవన భాష్యం
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులుమబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కాని ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలూ చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.
ఎంత సామర్థ్యమున్నా, అధికారం, సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలూ బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూఊహించలేరు. దాని శక్తిముందు ఎవరైనా తలవంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వతశిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే! అలాగే ఎంతటి మనిషి గర్వమైనా నీరుకారిపోవలసిందే. మనపేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైనవిలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికివచ్చే గొప్పపని, చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషిపేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
ఉపవాచకం - రామాయణం
వాల్మీకి రామాయణం మూల భాష సంస్కృతం. రామాయణం ప్రపంచ సాహిత్యంలో మొదటి కావ్యం. వాల్మీకి ఆది కవి రామాయణానికి పౌలస్త్య వధ, సీతాయాశ్చరితం మహత్ అనే పేర్లున్నాయి. రామాయణంలో ఆరు కాండంలు కలవు. అవి బాల కాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కిందకాండం, సుందరకాండం, యుద్ధకాండం. వాల్మీకి రామాయణంలో 24 వేల శ్లోకాలు కలవు. తెలుగులో మొదటి రామాయణం రంగనాథ రామాయణం. రచయిత గోనబుద్ధారెడ్డి. ఇది ద్విపద రచన. తెలుగులో ఇంకా భాస్కర, మొల్ల, ఉషశ్రీ రామాయణాలు సుప్రసిద్ధం.
బాలకాండం: బ్రహ్మ ఆదేశానుసారం రామాయణం రచనకు శ్రీకారం చుట్టాడు. వాల్మీకి అయోధ్య నగరం వర్ణనతో శ్రీ రాముని జననం నుండి మొదలుకొని స్వయం వరం తర్వాత పరశురాముని గర్వభంగం - అయోధ్యకు చేరుకోవడం - భరత శత్రుఘ్నులు మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళడం.
అయోధ్యకాండం: దశరథుడు మిత్రుల మీద ప్రేమతో శ్రీ రాముని పట్టాభిషేకం చేయాలని నిర్ణయం - కైకేయి దశరథున్ని వరాలు కోరుకోవడం - రాముడు వనవాసం వెళ్లడం - భరతునికి పాదుకలు ఇవ్వడం - రాముడు సీత లక్ష్మణుడు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దండకారణ్యం లోకి ప్రవేశించడం.
అరణ్యకాండం: దండకారణ్య ప్రవేశం తర్వాత అందులో లో పర్ణశాల ఏర్పాటు - విరాధుని శాపవిమోచనం - సీతాపహరణం సుగ్రీవుని మైత్రి కొరకు ఋష్యమూక పర్వతాన్ని కి ప్రయాణం - దారిలో పంపా సరోవరాన్ని దర్శించడం.
కిష్కిందకాండం: రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు భయంతో హనుమంతుని పంపడం - వీరికి మైత్రి కుదరడం - వాలిని వధించడం - సీత జాడ వెతుకుతూ వానర సైన్యం నలుదిక్కుల పయనం - హనుమంతున్ని జాంబవంతుడు ప్రేరేపించడం - సముద్రలంఘనం కొరకు మహేంద్రగిరి చేరుకోవడం.
సుందరకాండం: హనుమ సముద్ర లంఘనం - లంకలో ఒక వనంలో సీతను చూడడం - సీతతో హనుమ మాట్లాడటం - హనుమంతుని తోకకు నిప్పు పెట్టడం - తిరిగి మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకోవడం - శ్రీరాముని దగ్గరకు చేరుకొని సీత వృత్తాంతాన్ని చెప్పడం.
యుద్ధకాండం: శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించడం - వానర సైన్యం తో లంక కు ప్రయాణం - లంకలో రామ రావణ యుద్ధం - సీత వానర సైన్యం సమేతంగా అయోధ్యకు చేరుకోవడం - అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం.