ఉగ నక్షత్రాగమనంతో
జగమంతా చైతన్యమలముకొనగా
నూతనాశయాలకై...
అంకురార్పణ చేసే
శుభదినమిది...
చైత్రశుద్ధ పాడ్యమి
తెలుగువారి తొలిపండగవ్వగా
మెరిసిన వాకిళ్ళలో
ముగ్గుల హరివిల్లులే
రంగు రంగుల వెలుగులు పూయించగా
అనురాగ ఆప్యాయతల నడుమ
ఆనందాలకు స్వాగతం పలికే
శుభతరుణమిది...
వసంత ఋతురాకతో
ఆమని సొగసులను అద్దుకొనగా
సింగారించుకున్న తెలుగు లోగిళ్లన్నీ
ఆనందసాగరాన పరవశించి
ప్రకృతి ఒడిలో
పరమానందభరితమై తేలియాడే సమయమిది...
లేలేత చిగుళ్లనారగించిన
మత్తకోయిలలన్నీ
స్వరమాధుర్యమెంతో పంచగా....
వేపపూల గాలితో
మేనియంత పులకరించి
సకలానుభుతికి లోనయ్యే మధుర ఘడియది ...
తేట తెలుగు పలుకులతో
తీయ్యదనమంతా వొలికిస్తూ
పంచాంగశ్రవణంతో పరవశింపజేసి
షడ్రుచుల కలయిక
నవ జీవననానికి ప్రతీకగా...
గతకాలానికి స్వస్తి చెప్పుతూ
నూతనానికి స్వాగతం పలికేదే
యుగ యుగాల ఉగాది...
శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.