1. దానశీలము - పోతన
దానశీలము పోతన రచించిన శ్రీమహాభాగవతం అష్టమ స్కంధంలోని 'వామన చరిత్ర' లోనిది.
ప్రక్రియ: పురాణం. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. పురాణాలు 18. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు.
2. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు - డా॥ సామల సదాశివ
సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన 'యాది' అనే వ్యాస సంపుటిలోనిది.
ప్రక్రియ: వ్యాసం. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసం లక్షణం.
3. వీర తెలంగాణ - డా॥ దాశరథి కృష్ణమాచార్య
దాశరథి రచించిన “దాశరథి సాహిత్యం ” ఒకటవ సంపుటి 'రుద్రవీణ' లోనిది.
ప్రక్రియ: పద్యం. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలివి.
4. కొత్తబాట - డా॥ పి.యశోదారెడ్డి
తను రచించి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 'యశోదారెడ్డి ఉత్తమ కథలు' గ్రంథం లోనిది ఈ పాఠ్యభాగం.
ప్రక్రియ: కథానిక. రెండు తరాలకు సంబంధించిన వివరాలు, తరాలమధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను తెలియజేసారు.
5. నగరగీతం - అలిశెట్టి ప్రభాకర్
'అలిశెట్టి ప్రభాకర్ కవిత' అనే గ్రంథంలోని 'సిటీలైఫ్' అనే మినీ కవితలలో కొన్నిటిని 'నగరగీతం'గా కూర్చడమైనది.
ప్రక్రియ: మినీ కవిత. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత.
6. భాగ్యోదయం - కృష్ణస్వామి ముదిరాజ్
భాగ్యరెడ్డివర్మ కుమారుడైన ఎం.బి. గౌతమ్ రచించిన 'భాగ్యరెడ్డివర్మ జీవితచరిత్ర' గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈపాఠ్యభాగం.
ప్రక్రియ: జీవిత చరిత్ర. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజంమీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే 'జీవిత చరిత్ర'.
7. శతక మధురిమ - వివిధ కవులు
ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంక రామేశ్వర, వేణుగోపాల శతకాల పద్యాలు ఉన్నాయి.
ప్రక్రియ: శతకం. శతకాలలోని పద్యాలను 'ముక్తకాలు' అంటారు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది. అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి.
సర్వేశ్వర శతకం - యథావాక్కుల అన్నమయ్య
శ్రీకాళహస్తీశ్వర శతకం - ధూర్జటి
మల్లభూపాలీయ - ఎలకూచి బాలసరస్వాతి
దాశరథి శతకం - కంచర్ల గోపన్న (రామదాసు)
నరసింహ శతకం - కాకుత్సం శేషప్ప కవి
విశ్వనాథేశ్వర శతకం - గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
లొంక రామేశ్వర శతకం - నంబి శ్రీధరరావు
వేణుగోపాల శతకం - గడిగె భీమకవి
8. లక్ష్య సిద్ధి - సంపాదకీయం
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2వ జూన్, 2014 నాడు "నమస్తే తెలంగాణ” దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం ఇది.
ప్రక్రియ: సంపాదకీయ వ్యాసం. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింపజేసుకోవచ్చు.
9. జీవన భాష్యం - డాక్టర్ సి. నారాయణరెడ్డి.
“డాక్టర్ సి. నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం ” ఆరవ సంపుటిలోని “తెలుగు గజళ్ళు” లోనిది.
ప్రక్రియ: గజల్. గజల్ లో పల్లవిని "మత్తా” అని, చివరి చరణాన్ని "మక్తా” అని, కవి నామముద్రను "తఖల్లుస్” అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు.
10. గోలకొండ పట్టణము - ఆదిరాజు వీరభద్రరావు
తను రాసిన మన తెలంగాణము' అనే వ్యాససంపుటి లోనిది గోలకొండ పట్టణము అనే పాఠ్యభాగం.
ప్రక్రియ: వ్యాసం. వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు.
11. భిక్ష - శ్రీనాథుడు.
శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన 'కాశీఖండము' సప్తమాశ్వాసం లోనిది.
ప్రక్రియ: కావ్యం. కావ్యం వర్ణనా ప్రధానమైనది.
12. భూమిక - గూడూరి సీతారాం
నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 'నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు' సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం.
ప్రక్రియ: పీఠిక. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయప్రయాసలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయితగాని, మరొకరుగాని, విమర్శకుడుగాని రాసే విశ్లేషణాత్మక పరిచయవాక్యాలను పీఠిక అంటారు. దీనికి ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి.