మహిళా చైతన్యం - అమరవేణి రమణ

మహిళా చైతన్యం - అమరవేణి రమణ

మహిళా చైతన్యం
మనువాదాన్ని మోసినంతకాలం 
మహిళల బతుకున మార్పు రాదు నేస్తం
మూలమెరుగనీ జ్ఞానమైనది
ముప్పు దెలియనీ మార్గమైనది
పరిశీలించుట పక్కకు వెట్టిరి
పబ్బతివట్టగ ముందుగా నిల్చిరి.
                              !!మనువాదాన్ని!!

అధికార వేధింపు నడతలు
ఆకతాయిల వెకిలి చేష్టలు
పూట పూటకో అత్యాచారము
బ్లాక్ మేయిల్లు గృహహింసలు-2
వరకట్నాల చావులు వెరిగే
యాసిడ్ దాడుల గోసలు చేయగలవు 
పిల్లలు వృద్ధుల తేడనే లేదు
పీకలు గొరికే మృగాలు బలిసే
                              !!మనువాదాన్ని!!

మతం బెట్టిన కట్టుబాట్లతో
మగువల గడపన గట్టేసిండ్రు
ఆచారాలు సాంప్రదాయమని
అతివల జంపుకు తినేస్తుండ్రు-2
పూజలు నోములు వ్రతాలంటూ
పుర్రెలు పాడు జేసేస్తుండ్రు
ఆదిశక్తుల రూపమంటూనే
అతివల అడుగున దొక్కేస్తుండ్రు -2
                              !!మనువాదాన్ని!!

ఆడవాళ్ళనీ చులకన జేసి
అబలగా పేరు మార్చేసిండ్రు
పతియే ప్రత్యక్ష దైవమని
పడతికి సుద్దులు నేర్పించిండ్రు-2
స్త్రీలకు స్వాతంత్ర్య మొద్దని
చేతికి సంకెళ్ళేసిండ్రు
సతిసహగమనం సాంప్రదాయమని
చచ్చిన పతితో గాల్చేసిండ్రు-2
                             !!మనువాదాన్ని!!

రొమ్ము పన్నును గట్టాలంటూ
పైటకు పైకం లాగేసిండ్రు
దేవుని భార్యగా వుండాలంటూ
వూరికి వేశ్యగా వుంచేసిండ్రు
కంటి కాని పడతుల జెరచి
ఇనుప కచ్చడ లద్దేసిండ్రు
మగడు లేనిదే మనుగడ లేదు
మహిళ మెదడును గూల్చేసిండ్రు
                            !!మనువాదాన్ని!!

బాల్యంలోనే పెళ్ళిళ్ళంటు
భవితను బూడిద జేసేసిండ్రు
మొగుడు జచ్చిన మగువలనంతా
మొండమోపి ముద్రేసేసిండ్రు-2
బొట్టు చెరిపేసి గాజులు దీసి
బోడిగుండు గొరిగేసేసిండ్రు
శుభకార్యాలకు రావొద్దంటూ
శూన్యం బతుకులు జూపెడుతుండ్రు-2
                            !!మనువాదాన్ని!!

చదువు సంధ్యలకు దూరం జేసి
చెప్పుచేత లల్లుంచేసిండ్రు
మూఢత్వంలో మునిగేటట్లుగ
మొసరీగై మరి జుట్టేసిండ్రు-2
వంటింటి కుందేళ్ళను జేసి
వొంటిని పరుపుగ మార్చేసిండ్రు
అంగడి సరుకై ఆటబొమ్మలుగ
అంతట చులకన జేసేసిండ్రు-2
                            !!మనువాదాన్ని!!

మనువాదానికి దూరముంటేనే
మహిళ బతుకులు మణిదీపాలు
శాస్త్రీయతకు చేరువౌతేనే
సకల దోపిడీ సమాధి పాలు-2
మూఢ భావనను తొలగిస్తేనే
ధైర్యము గుండెల నిండుకొంటుంది
సమానత్వపు స్వేచ్ఛా వాయువు
సుగంధ పరిమళ వీచికౌతది.
                            !!మనువాదాన్ని!!
                
                          - అమరవేణి రమణ

0/Post a Comment/Comments