ఛందస్సు
పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజెప్పేది ఛందస్సు. పాదాది నియమాలు కలిగిన పద్య లక్షణాలను తెలుపునది చందస్సు. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందింది. పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే ఛాందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు.
ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది.
ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు, లఘువు.
గురువుని U తోటి, లఘువుని I తోటి సూచిస్తున్నారు.
ఏకమాత్ర(రెప్పపాటు) కాలంలో పలుకబడేది లఘువు.
ద్విమాత్రాకాలంలో పలుకబడేది గురువు.
రెండుకంటే ఎక్కువ మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలను ప్లుతం అంటారు.
ఈ గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ"ఇందులో మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలూ ఒక్కొక్కటి ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ"ఇందులో మొదటి అక్షరము ఒక లిప్త కాలము ఆ తరువాతి మ్మ అక్షరము రెండు లిప్తల కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్త కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.
కొన్ని నియమాలు
- దీర్ఘాలన్నీ గురువులు. (ఉదా: పాట = UI)
- "ఐ", "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ"గురువు, "సైనిక్"లో "సై"గురువు)
- ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే. (ఉదా: “అంగడి”లో సం గురువు, “దుఃఖము”లో దుః అనునది గురువు)
- సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం ముందున్న అక్షరం గురువు. (ఉదా: “అమ్మ”లో అ గురువు, “సంధ్య”లో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది.
- ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క"గురువు కాదు) అయితే రెండు పదాలు ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది.
- ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న"గురువు అవుతుంది
- ఋ అచ్చుతో ఉన్న అక్షరాలు, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
- ర వత్తు దాని ప్రత్యక్ష ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమంలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకోవచ్చు.
- పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూచెన్ గలవులు"లో "చెన్"గురువు.)
*లఘువులు
- హ్రస్వాలు
- హ్రస్వద్విత్వాలు
- హ్రస్వసంయుక్తాలు
*గురువులు
- దీర్ఘాలు
- ఐ, ఔలతో కూడిన హల్లులు
- సున్నతో కూడిన అక్షరాలు
- విసర్గతో కూడిన అక్షరాలు
- పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు
- ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు
- సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు
గణ విభజన
అక్షరాల గుంపును గణము అని అంటారు.
గణము అంటే మాత్రల సముదాయము. గురు లఘువుల సమూహం.
గణాలలో ఏక అక్షరం (ఒకే అక్షరం) గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి.
ఏకాక్షర గణాలు
అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు ఏదైనా కావచ్చు.
ఉదా: శ్రీ, సాయి, లం
యు, యు, యు
రెండక్షరాల గణాలు
రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు
- లలము - II ఉద: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
- లగము (వ గణం) - IU ఉదా: రమా
- గలము (హ గణం) - UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
- గగము - UU ఉదా: రంరం, సంతాన్
మూడక్షరాల గణాలు
ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి. కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు.
య మా తా రా జ భా న స ల గం
ఐ యు యు యు ఐ యు ఐ ఐ ఐ యు
య మ తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు
ఉపగణాలు
- రెండక్షరాలవి - 4 : గగ, గల, లగ, లల;
- నాలుగక్షరాలవి - 10 : తగము, తలము, నగము, నలము, భగురు, భలము, రగము, రలము, మలఘు, సలము;
- ఐదక్షరాలవి - 7 : నగలము, నగగము, నలలము, నలగము, సలలము, సలగము, సగలము.
ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు
- సూర్య గణములు
- ఇంద్ర గణములు
- చంద్ర గణములు
సూర్య గణములు
- న = న = III
- హ = గల = UI
ఇంద్ర గణములు
- భ = UII
- ర = UIU
- త = UUI
- న గము = IIIU
- స లము = IIUI
- న లము = III
చంద్ర గణములు
- భల = UIII
- భగరు = UIIU
- తల = UUII
- తగ = UUIU
- మలఘ = UUUI
- నలల = IIIII
- నగగ = IIIUU
- నవ = IIIIU
- సహ = IIUUI
- సవ = IIUIU
- సగగ = IIUUU
- నః = IIIUI
- రగురు = UIUU
- నల = IIII
వృత్తాలు
వృత్తము: నియత గణములును యతిప్రాసములుగల పద్యము.
గణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు ఉన్నాయి.
- చంపకమాల
- ఉత్పలమాల
- శార్థూలం
- మత్తేభం
జాతులు
జాతులు మాత్రాగణములతో, ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమాలు ఉన్నాయి.
- కందం
- ద్విపద
ఉప జాతులు
- తేటగీతి
- ఆటవెలది
పాదం: పద్యమునందలి యొక చరణము. పద్యములో నాలుగవభాగము.
యతి: పద్యవిశ్రమస్థానము. ఛందస్సులో విరామ స్థానము.
ప్రాస: పద్యపాదమున రెండవ యక్షరము.
ప్రాస యతి: ప్రాసస్థాన అక్షరానికి యతిని పాటించడం.
పద్య పాదంలో రెండవ అక్షరానికి సాధారణ యతిమైత్రి స్థానంలో తరువాతి అక్షరానికి యతిని పాటించడం ప్రాసయతి అంటారు.
ప్రాస నియమములు
- ప్రధమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లె ఉండవలయును.
- ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.
- ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.
- ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.
- ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురును.
యతి నియమములు
ఈ క్రింది వర్ణసమూహములలో ప్రతి వర్ణమునకు మిగిలిన వాటితో యతి చెల్లును
- అ, ఆ, ఐ, ఔ, హ, య, అం
- ఇ, ఈ, ఎ, ఏ, రు
- ఉ, ఊ, ఓ, ఓ
- క, ఖ, గ, ఘ, క్ష
- చ, చ, జ, ఝ, శ, ష, స
- ట, ఠ, డ, ఢ
- త, థ, ద, ధ
- ప, ఫ, బ, భ, వ
- న, ణ
- ర, ఱ, ల, ళ
- పు, ఫు, బు, భు, ము
కఖగఘ్గ్, చచజఝఞ్, టఠడఢణ, తథదధన, పఫబభమ లను వర్గములందురు. ప్రతివర్గములోను చివర ఉన్న అనునాసికమునకు,ముందు ఉన్న నాక్షరాలతో అవి పూర్ణ బిందు పూర్వకములైతే యతి చెల్లును. ఉదాహరణకు, తథదధన వర్గములోని అనునాసికమైన “న” కు “కంద” లోని “ద” కు యతి చెల్లును. ఉచ్చరణ పరంగా “కంద” ని “కంద” లా పలుకవచ్చు. అందువలన “న్ద”లోని “న”తో యతి కుదురును.
అటులనే, “మ” కు పూర్ణబిందుపూర్వకమైన య, ర, ల, వ, శ, ష, స, హ లతో యతి కుదురును.
యతి స్థానమున గాని యతి మైత్రి స్థానమున గాని సంయుక్తా క్షరమున్నచో అందులో ఏ ఒక్క అక్షరానికి యతి చెల్లినా సరిపోతుంది. ఉదాహరణకు, యతి స్థానములో “క్ష్మ” ఉన్న, అందులోని, “క”, “ష”, “మ” లలో ఏ అక్షరమునకైనా యతి కుదర్చ వచ్చును.
ఋకారముతో నున్న హల్లులకు యతి కుదురును. ఉదాహరణకు, “ద” కు “గ” యతిమైత్రి లేకున్ననూ, “దృ” కు “గృ” కు యతి కుదురును.
హల్లులకు యతి కుదుర్చునపుడు, హల్లుకి దానిపైనున్న అచ్చుకి కూడా యతి మైత్రి పాటించవలెను. ఉదాహరణకు, “తు” కు “ఒ” కు యతి చెల్లదు. “తు”(త+ఉ) లో ఉన్న “త” కు కూడా యతి కుదర్చవలెను.
ప్రాసయతి నియమములు
పాదమందలి మొదటి అక్షరమునకు, యతి మైత్రి స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుటకు బదులు, పాదమందలి రెండవ అక్షరమునకును, యతి మైత్రి స్థానము తరువాతి అక్షరమునకు ప్రాస కుదుర్చుటను “ప్రాసయతి” అందురు. తేటగీతి, ఆటవెలది, సీసము మొదలగు పద్యములలో “ప్రాసయతి” వాడవచ్చు. ఉదాహరణకు, “వేడి గిన్నె చురక వాడిగా తగలగా” అన్నపాదంలో, “వే”కి “వా”కు యతి కుదరదు. కానీ, “వేడి”కి “వాడి”కి “ప్రాసయతి” కుదురుతుంది.
ఉత్పలమాల
భండన|భీముఁ డా|ర్తజన| బాంధవుఁ| దుజ్జ్వల| బాణతూ|ణ కో
UII UI U III U II UI I UIU IU
భ ర న భ భ ర వ
లక్షణాలు:
1. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదం భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలను కలిగిఉంటుంది.
3. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి.
4. యతిస్థానం 10వ అక్షరం.
5. ప్రాస నియమం ఉంటుంది.
చంపక మాల
అనయ|ము దోష|మే పరు|లయందు|కనుంగొ|ని పల్కు|నట్టి యా
III IUI UII IUI IUI IUI UIU
న జ భ జ జ జ ర
లక్షణాలు:
1. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదం న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలను కలిగిఉంటుంది.
3. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి.
4. యతిస్థానం 11వ అక్షరం.
5. ప్రాస నియమం ఉంటుంది.
శార్దూలం
కారే రా|జులు? రా|జ్యముల్ గ|లుగవే?| గర్వోన్న|తిం బొంద|రే?
UUU II U IUI IIU UUI UUI U
మ స జ స త త గ
లక్షణాలు:
1. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదం న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలను కలిగిఉంటుంది.
3. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి.
4. యతిస్థానం 13వ అక్షరం.
5. ప్రాస నియమం ఉంటుంది.
మత్తేభము
తెలగా|ణమ్మున| గడ్డిపో|చయును| సంధించెన్| కృపాణ|మ్ము! రా
IIU U II UIU I II UU U IUU IU
స భ ర న మ య వ
లక్షణాలు:
1. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదం స, భ, ర, న, మ, య, వ అనే గణాలను కలిగిఉంటుంది.
3. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి.
4. యతిస్థానం 14వ అక్షరం
5. ప్రాస నియమం ఉంటుంది.
పై నాలుగు పద్యాల లక్షణాలు
ఉ - భ - 20 - 10
చ - న - 21 - 11
శా - మ - 19 - 13
మ - స - 20 - 14
పై నాలుగు పద్యాలలో అన్నింటిలోనూ నాలుగు పాదాలుంటాయి.
అలాగే ప్రాస నియమం ఉంటుంది. ప్రాస యతి వుండదు.
కందం
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కనిపించింది. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులో గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుకుంటుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.
క. కందము త్రిశర గణంబుల,
నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట,
నొందుఁ దుద గురువు జగణ ముండదు బేసిన్
లక్షణములు
కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవి ఆ గణాలు
- 1,3 పాదాలలో గణాల సంఖ్య 3
- 2,4 పాదాలలో గణాల సంఖ్య 5
- 1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు.
- 2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు.
- 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి.
- 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి.
- పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి.
- 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
- ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
గణముల వివరణ
గగ గణము = UU { గురువు, గురువు }
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }
జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }
స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}
నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }
ద్విపద
ద్విపద: రెండు పాదములు గల పద్యము
లక్షణములు
- ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
- ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి.అందుకే దీనిని ద్విపద అంటారు.
- ప్రతిపాదములోనీ మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.
- మూడవ గణం యొక్క మొదటి అక్షరం.
- ప్రాస ఉన్న ద్విపదను సామాన్య ద్విపద, ప్రాస లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు.
తేటగీతి
తేటగీతి తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
తేటగీతి ఉపజాతికి చెందినది.
తేటగీతి పద్యం సూర్య, ఇంద్రగణాలతో ఏర్పడుతుంది.
ఒకరి| వర్షాస|నము ముంచ|కున్నఁ |జాలుఁ
III UUI IIU I UI UI
న త సల హ హ
సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
పద్య లక్షణాలు:
- తేటగీతిలో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతిపాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
- ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం యతి మైత్రి.
- ప్రాసయతి ఉన్న పద్యాన్ని అంతరాక్కరగా పిలుస్తారు.కాని అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.
- ప్రాస నియమం లేదు.
ఆటవెలది
ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
ఆటవెలది ఉపజాతికి చెందినది.
"ఇనగణత్రయంబు-నింద్రద్వయంబును, హంసపంచకంబు- నాటవెలఁది" -అప్పకవీయము.
న హ హ సల సల
III UI UI IIUI IIUI
అ) బ్రతుక l వచ్చుఁ l గాక l బహుబంధ l నములైన
హ హ హ హ హ
UI UI UI UI UI
ఆ) వచ్చుఁ l గాక l లేమి l వచ్చుఁ l గాఁ క
హ న హ సల సల
UI III UI IIUI IIUI
ఇ) జీవ l ధనము l లైనఁ l జెడుగాక l పడుఁగాక
హ న హ హ న
UI III UI UI III
ఈ) మాట l దిరుగ l లేరు l మాన l ధనులు
పై పద్యంలో 4 పాదాలున్నాయి.
- ప్రతి పాదానికి ఐదు గణాలు ఉన్నాయి.
- 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉన్నాయి.
- 2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
- ప్రతి పాదంలో 4వ గణంలో మొదటి అక్షరం యతి చెల్లింది.
- ప్రాస నిమయం లేదు.
- ప్రాసయతి చెల్లును.
★ ఇట్లాంటి లక్షణాలున్న పద్యాన్ని 'ఆటవెలది' పద్యం అని అంటారు.
'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
సీసపద్యం
ర సల ర సల
UIU I IU I UIU IIUI
కాకతీ l యులకంచు l గంట మ్రో l గిననాడు
ఇంద్ర ఇంద్ర ఇంద్ర ఇంద్ర
నగ నగ న హ
IIIU III U II I UI
కరకు రా l జులకు త l త్తరలు l పుట్టె
ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
త ర ర సల
UU I UIU UIU IIUI
కాపయ్య | నాయకుఁ | డేఫుసూ | పిననాడు
సల సల హ న
IIUI II UI UI III
పరరాజు l లకు గుండె l పట్టు l కొనియె
సీసపద్య లక్షణం :
◆ ఇందులో నాలుగు పాదాలుంటాయి.
◆ ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
◆ పద్యపాదం రెండు సమభాగాలుగా ఉంటుంది.
◆ రెండు భాగాల్లోను మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతో, 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతో మైత్రి కుదరాలి.
◆ప్రాస నియమం లేదు. ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో జత అక్షరాలు ప్రాసలో ఉండవచ్చు. ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే)
◆ తేటగీతి లేదా ఆటవెలది దీనికి చివరగా ఉంటుంది.
సీస పద్యాన్ని ఒకేలాగా ఉంటే నాలుగు పెద్ద పాదాలుగా కానీ (1,1,1,1),
ఈ ఒక్కో పెద్ద పాదాన్ని రెండు చిన్న పాదాలుగా (1,2,1,2,1,2,1,2) మొత్తం ఎనిమిది పాదాలుగా వివరించవచ్చు.
సీస పద్యంలో భాగం కాకపోయినా, సీస పద్యం తరువాత ఒక గీత పద్యం ("ఆటవెలది"లేదా "తేటగీతి") వస్తుంది.
పై పద్యపాదాల్లో -
◆ ఒక్కొక్కటి రెండు భాగాలుగా ఉన్నాయి.
◆ రెండు భాగాల్లో కలిపి ఎనిమిది గణాలున్నాయి. (ఆరు ఇంద్రగణాలు + రెండు సూర్యగణాలు)
◆ యతి, ప్రాస యతులు (కా-గ, ర-ర) (ప-పు; ప-ప) ఉన్నాయి.
◆ ప్రాసనియమం లేదు. వీటిని బట్టి ఇది సీసపద్యం అని గుర్తించవచ్చు.
ఈ అచ్చ తెనుగు పద్యరీతులలో కచ్చితమైన గణాలు చెప్పకపోవటం వల్ల అన్ని పద్యాలు (అంటే ఒక పద్యంలోని అన్ని పాదాలు) ఒకే లయలో ఉండనవసరం లేదు. కానీ వీటి లయను గుర్తించడం అంత కష్టం కాదు. పద్యాలు పైకి చదువుతుంటే లయ దానంతటదే అవగతం అవుతుంది.