పల్లెటూరి పిల్లగాడా!

పల్లెటూరి పిల్లగాడా!

పల్లెటూరి పిల్లగాడా!
                                   - సుద్దాల హనుమంతు

పల్లెటూరి పిల్లగాడ
పసులగాచే మొనగాడ
పాలుమరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ
కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో

చాలి చాలని చింపులంగి
సగము ఖాళీ చల్లగాలి
గోనెచింపు కొప్పెర పెట్టావా ఓ పాలబుగ్గల జీతగాడ
దానికి చిల్లులెన్నో లెక్కపెట్టావా

తాటిజెగ్గలా కాలిజోడు
తప్పటడుగుల నడకతీరు
బాటతో పని లేకుంటయ్యిందా ఓ పాలబుగ్గల జీతగాడ 
చేతికర్రే తోడైపోయిందా

గుంపు తరలే వొంపులోకి
కూరుచున్నవు గుండుమీద 
దొడ్డికీవే దొరవై పోయావా ఓ పాలబుగ్గల జీతగాడ 
దొంగ గొడ్ల నడ్డగించేవా

కాలువై కన్నీరుగార
కండ్లపై రెండు చేతులాడు
వెక్కి వెక్కి ఏడ్చుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ
ఎవ్వ రేమన్నారో చెప్పేవా

పెందలాడ అమ్మనీకు
పెట్టలేదా సద్దికూడు
ఆకలిగొని అడలుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ 
అడవి తిరిగి అలిసి పోయావా

ఆకుతేల్లు కందిరీగలు 
అడవిలో గల కీటకాదులు
నీకేమైన కాటువేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ 
నిజము దాచక నాతో చెప్పేవా

మాయదారి ఆవుదూడలు 
మాటిమాటికి కంచె దుంకీ
పంటచేలు పాడుచేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ 
పాలికాపు నిన్నే కొట్టాడా

నీకు జీతం నెలకు కుంచం
తాలు వరిపిడి కల్తిగాసం 
కొలువగా సేరు తక్కువ వచ్చిందా ఓ పాలబుగ్గల జీతగాడ 
తలుచుకుంటే దుఃఖ మొచ్చిందా 

పాఠశాల ముందుచేరి
తోటి బాలుర తొంగి చూసి
ఏటికోయీ వెలవెల బోతావు ఓ పాలబుగ్గల జీతగాడ
వెలుగులేని జీవితమంటావా  


Play Audio 🔊

0/Post a Comment/Comments