సంధులు
సంధి: ముందరి పదము యొక్క చివరి అక్షరము, తరువాత పదము యొక్క మొదటి అక్షరము ఒకదానితో నొకటి కూడుకొనుట.
భాషనిబట్టి సంధులు రెండు రకములు:
సంస్కృత సంధులు
తెలుగు సంధులు
“సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక”.
“తెలుగులోసంధి అనగా రెండు పదముల కలయిక”.
సంసృత సంధులు
సవర్ణదీర్ఘ సంధి
గుణసంధి
యణాదేశసంధి
వృద్ధి సంధి
సవర్ణదీర్ఘ సంధి:
సవర్ణాలు: ఒకేరకమైన అచ్చులను సవర్ణాలు అంటారు.
సూత్రం: “అ, ఇ, ఉ, రు లకు అవే అచ్చులు (సవర్ణములు) సంబంధితంగా వాని దీర్ఘం ఏకాదేశమవుతుంది”.
ఏకాదేశం: ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటారు.
అ, ఇ, ఉ, ఋ (దీర్ఘమైనా, హ్రస్వమైనా) లకు సవర్ణములైన అచ్చులు (అవే అచ్చులు) సంబంధించినపుడు ఆ తర్వాత వాటితో కలిపి వాని దీర్ఘం ఏకదేశమవుతుంది. అ, ఇ, ఉ, ఋ లను సవర్ణములు అంటారు. కావున ఇది సవర్ణదీర్ఘ సంధి.
ఉదా: విద్య+ఆలయము = విద్యాలయము
(విద్య మొదటి పదం విద్యలో చివర 'అ'కారం ఉంది. ఆలయంలో మొదట 'ఉ'కారం ఉంది. భానులో ఉన్న 'ఉ'కారం ఉదయం నుండి ఉన్న 'ఉ'కారం సవర్ణాచ్చులు కావడానికి దీర్ఘ 'ఊ'కారం వచ్చింది.)
సచివాలయం = సచివ+ఆలయం (అ+ఆ=ఆ)
దిశాంచలము = దిశ+అంచలములు (అ+అ=ఆ)
శ్రావణాభ్రము = శ్రావణ+అభ్రము (అ+అ=ఆ)
దేవాలయాలు=దేవ+ఆలయాలు (అ+ఆ=ఆ)
అశ్వారూఢుడు=అశ్వ+ఆరూఢుడు (అ+ఆ=ఆ)
రాజాజ్ఞ=రాజ+ఆజ్ఞ (అ+ఆ=ఆ)
పుణ్యాంగన=పుణ్య+అంగన (అ+అ=ఆ)
మునీశ్వర = ముని+ఈశ్వర (ఇ+ఈ=ఈ)
గుణసంధి :
సూత్రం: “ 'అ' కారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే వరసగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమవుతాయి.”
ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు. కావున ఇది గుణ సంధి.(అకారము అంటే అ లేదా ఆ)
మొదటి పదాంతమందు అకారం ఉండాలి.
రెండవ పదం మొదట విధిగా ఇ, ఉ, రులలో ఏదో ఒక అక్షరం ఉండాలి.
రెండు పదాలు సంస్కృత పదాలు అయి వుండాలి.
ఉదా:
నవ+ఉదయం=నవోదయం (అ+ఉ=ఓ)
దేవ+ఋషి=దేవర్షి (అ+ఋ=అర్)
గర్వోన్నతి = గర్వ+ఉన్నతి (అ+ఉ=ఓ)
వదాన్యోత్తముడు = వదాన్య+ఉత్తముడు (అ+ఉ=ఓ)
రామ్యోద్యానములు = రమ్య+ఉద్యానములు (అ+ఉ=ఓ)
యణాదేశ సంధి :
సూత్రం: “ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే వరసగా య, వ, ర లు ఆదేశమవుతాయి.”
ఇ, ఉ, ఋ లను ఇక్కులని, య, వ, ర లను యణ్ణులు అంటారు.
యన్నులు ఆదేశంగా వస్తాయి. కావున ఇది యణాదేశ సంధి.
అసవర్ణములు: సవర్ణములు కాని అచ్చులు
ఉదా:
అత్యంతము = అతి+అంతము (ఇ+అ=య)
అత్యద్భుతం = అతి + అద్భుతం (ఇ+అ=య)
అభ్యాగతులు = అభి+ఆగతులు (ఇ+ఆ=య)
అణ్వాయుధాలు = అణు+ఆయుధాలు(ఉ+ఆ=వ)
వృద్ధి సంధి:
సూత్రం: “'అ' కారానికి - ఏ, ఐ లు పరమైతే 'ఐ' - ఓ, ఔలు పరమైతే 'ఔ'- ఋ, ౮లు పరమైతే 'ఆర్'లు ఏకదేశమవుతాయి”. ఐ, ఔ, ఆర్ లను వృద్ధులు అంటారు. కావున ఇది వృద్ధి సంధి .
వృద్ధుల వల్ల ఏర్పడిన సంధి కనుక వృద్ధి సంధి.
ఉదా:
రసైక = రస + ఏక (అ + ఏ = ఐ)
ఏకైక = ఏక+ఏక(అ + ఏ = ఐ)
వసుధైక = వసుధ+ఏక (అ + ఏ = ఐ)
దివ్యైరావతం = దివ్య + ఐరావతం (అ + ఐ = ఐ)
దేశైశ్వర్యం = దేశ+ఐశ్వర్యం (అ + ఐ = ఐ)
అష్టైశ్వర్యాలు = అష్ట+ఐశ్వర్యాలు (అ + ఐ = ఐ)
ఘనౌషధి = ఘన + ఓషధి (అ + ఓ = ఔ)
వనౌషధి = వన+ఔషధి (అ + ఓ = ఔ)
మహౌషధి = మహా+ఔషధి (అ + ఓ = ఔ)
రసౌచిత్యం = రస + ఔచిత్యం (అ + ఔ = ఔ)
దివ్యౌషధం = దివ్య+ఔషధం (అ + ఔ = ఔ)
నాటకౌచిత్యం = నాటక+ఔచిత్యం (అ + ఔ = ఔ)
దివ్యౌషధం = దివ్య+ఔషధం (అ + ఔ = ఔ)
సమైక్యత = సమ+ఐక్యత (అ + ఐ = ఐ)
పైన ఇచ్చిన పదాలను విడదీసినప్పుడు
మీరు గమనించిన విషయాలు సరిచూడండి.
ఆ) పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔలున్నాయి.
ఇ) 'అ' కారానికి ఏ, ఐ లు కలిసినప్పుడు 'ఐ' వచ్చింది. ఐ
ఈ) 'అ' కారానికి ఓ, ఔలు కలిసినప్పుడు 'ఔ' వచ్చింది.
అంటే...
i) 'అ' కారానికి ఏ, ఐ లు పరమైతే 'ఐ' వస్తుంది.
ii) 'అ' కారానికి ఓ, ఔ లు పరమైతే 'ఔ' వస్తుంది.
ఐ, ఔలను 'వృద్ధులు' అంటారు.
'వృద్ధుల' వల్ల ఏర్పడిన సంధి కనుక ఇది వృద్ధి సంధి.
సూత్రం:
అకారానికి (అ, ఆ లకు) ఏ, ఐలు పరమైతే 'ఐ' కారం,
ఓ, ఔలు పరమైతే 'ఔ' కారం ఏకాదేశంగా వస్తాయి.
తెలుగు సంధులు
ఉత్వసంధి
ఇత్వసంధి
అత్వసంధి
సరళాదేశ సంధి
గసడదవాద సంధి
త్రికసంధి
రుగాగమ సంధి
ఉత్వ/ఉకార సంధి:
సూత్రం: “ఉత్తునకు సంధి నిత్యం”.
ఉత్తునకు అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది.
ఉత్తు: హ్రస్వమైన ఉ
నిత్యం: ఎల్లప్పుడూ తప్పక జరుగును
ఉదా:
మనము+ఉంటిమి=మనముంటిమి.
జగమెల్ల = జగము+ఎల్ల
సయ్యాటలాడెన్ = సయ్యాటలు+ఆడెన్
ధరాతలమెల్ల = ధరాతలము+ఎల్ల
ప్రపంచమంతా = ప్రపంచము+అంతా
నీరవుతుంది = నీరు + అవుతుంది
ఎత్తులకెదిగిన = ఎత్తులకు + ఎదిగిన
పేరవుతుంది = పేరు + అవుతుంది
ఇత్త్వ/ఇకార సంధి:
ఇకారం: హ్రస్వమైన ఇ.
సూత్రం: “ఇత్తునకు సంధి వైకల్పికముగానగు”.
ఏమ్యాదులందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.
ఇత్తు: హ్రస్వమైన ఇ
వైకల్పికము: ఒకసారి సంధి (నిత్యము) జరిగి, మరొకసారి సంధి జరగక (నిషేధము) పోవడాన్ని
వ్యాకరణ పరిభాషలో 'వికల్పము' వైకల్పికము అంటారు.
ఉదా:
వచ్చితిమి+ఇప్పుడు = వచ్చితిమిప్పుడు .
దారినిచ్చిరి = దారిని+ఇచ్చిరి
అత్త్వ/అకార సంధి:
అకార: వర్ణమాలలోని మొదటి అక్షరము
సూత్రం: “అత్తునకు సంధి బహుళముగానగు”.
అత్తు నకు అచ్చు పరమైనపుడు సంధి బహుళము.
అత్తు: హ్రస్వమైన అ
బహుళము: సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని బహుళంగా అంటారు. (అన్య అనగా ఇతర, కార్యము అనగా పని, హేతువు)
ఉదా:
మేన+అల్లుడు=మేనల్లుడు.
మేనత్త = మేన+అత్త
సరళాదేశ సంధి/ద్రుత ప్రకృతిక సంధి:
సూత్రం: “ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే పరుషాలు సరళంగా మారును”.
కచటతపలు వరుసగా గజడదబలు గా మారుతాయి.
ద్రుతము: నకారాన్ని ద్రుతం అంటారు. (ను, ఎన్)
దృతప్రకృతి: నకారం చివరన వుండే పదాలను దృతప్రకృతి అంటారు. (పదం చివరన ను లేదా న్ వుండడం)
పరుషాలు: కచటతప
సరళాలు: గజడదబ
ఉదా:
పూచెను+కలువలు=పూచెనుగలువలు
మూటఁగట్టు = మూటన్+కట్టు
పూచెనుగలువలు = పూచెను+కలువలు
గసడదవాదేశ సంధి:
సూత్రం: ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళముగానగు.
(ప్రథమ అనగా ప్రథమా విభక్తిప్రత్యాలు)
కచటతప లకు వరసగా గసడదవలు ఆదేశంగా వస్తాయి
ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె
(ఈ సంధి ప్రవృత్తి, అప్రవృత్తి, వైకల్పికం, అన్యవిధము
అను నాలుగు ఉదాహరణములు కలిగి ఉండును)
ఉదా:
నాల్కలుసాచు = నాల్కలు+చాచు
ప్రాణాలు గోల్పోవు = ప్రాణాలు+కోల్పోవు
ఆసువోయుట = ఆసు+పోయుట
కాలుసేతులు = కాలు+చేతులు
త్రిక సంధి:
“ఆ ఈ ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.
త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విరుక్తంబు పరంబుగనగు.
(త్రికము మీద ఉన్న అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది)
ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్ఛికంబబబైన దీర్ఘన్నకు హ్రస్వంబగు”.
ద్విరుక్తం: ద్విరుక్తము అనగా ద్విత్వాక్షరం
ఆచ్చికం: అచ్చ తెలుగు పదం
ఉదా: అక్కడ = ఆ+కడ;
'ఆ' అనునది త్రికము, 'క' అనునది అసంయుక్త హల్లు.
కనుక ద్విరుక్తంబు వచ్చి ఆ+క్కడ ఐనది.
ద్విరుక్తంబగు 'క్క' పరంబుగనప్పుడు 'ఆ' దీర్ఘం కాస్త హ్రస్వంబై 'అ' అవుతుంది = అక్కడ
* కింది పదాలను గమనించండి.
అ) అచ్చోటు → ఆ + చోటు
ఆ) ఇవ్విధము → ఈ + విధము
ఇ) ఎక్కాలము → ఏ + కాలము
పై పదాలలో పూర్వపదాల్లో ఆ, ఈ, ఏ లు ఉన్నాయి.
ఆ, ఈ, ఏ లను 'త్రికం' అంటారు.
ఇవి సర్వనామాలు.
ఈ త్రికముమీద ఉన్న అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది.
ఆ + చోటు → ఆ + చ్చోటు;
ఈ + విధము ఈ + విధము;
ఏ + కాలము → ఏ + క్కలము
ఇలా ద్విత్వం (ద్విరుక్తం)పైన ఉన్న దీర్ఘాచ్చు హ్రస్వంగా మారుతుంది.
ఆ + చ్చోటు → అచ్చోటు
ఈ + వ్విధము → ఇవ్విధము
ఏ + క్కాలము → ఎక్కాలము
త్రికం మీద అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమౌతుంది.
బహుళం: ఒక వ్యాకరణ కార్యం
నిత్యంగారావడం, రాకపోవడం, వికల్పంగారావడం, అన్యకార్యం రావడం
- ఇట్లా నాలుగు విధాలుగా జరిగితే 'బహుళం' అంటారు.
ద్విరుక్తమైన హల్లు సంబంధితంగా ఆచ్ఛికమైన దీర్ఘం హ్రస్వమౌతుంది.
ఆచ్ఛికం: అచ్చ తెలుగు పదం.
ఉదా:
అచ్చోట = ఆ+చోట - త్రికసంధి
ఎక్కాలం=ఏ+కాలం - త్రికసంధి
ఇవ్వీటి = ఈ+వీటి- త్రికసంధి
రుగాగమ సంధి:
సూత్రం: “పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు”.
కర్మధారయమునందు పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే రుగాగమమవుతుంది.
కర్మదారయము: విశేషణ విశేషాలతో కూడిన పదాన్ని కర్మధారయం అంటారు.
ఒక వర్ణం మిత్రుడిలా అదనంగా చేరడమే ఆగమం.
పేదాది శబ్దములు: పేద, బీద, బాలింత మొదలైన పదాలు పేదాదులు.
ఉదా: పేద+ఆలు=పేదరాలు
* ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి.
ఎ) పేదరాలు
ఆ) బీదరాలు
ఇ) బాలింతరాలు
పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో గమనిద్దాం.
ఎట్ల మారయో పరిశీలిద్దాం.
అ) పేద + ఆలు → పేదరాలు
ఆ) బీద + ఆలు → బీదరాలు
ఇ) బాలింత + ఆలు → బాలింతరాలు
పేద + ఆలు → పేద + ర్ + ఆలు → పేదరాలు
బీద + ఆలు → బీద + ర్ + ఆలు → బీదరాలు
బాలింత + ఆలు → బాలింత + ర్ + ఆలు → బాలింతరాలు
పై మూడు సందర్భాలలో పర పదం 'ఆలు'
పేద, బీద, బాలింత పదాలకు 'ఆలు' పరమైంది.
పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను 'పేదాదులు' అంటారు.
పేదాదిపదాలకు 'ఆలు' అనే పదం కలిసినప్పుడు 'ర్' అనే అక్షరం అదనంగా వచ్చింది.
ఒక వర్ణం మిత్రుడివలె అదనంగా చేరడమే 'ఆగమం'.
'ర్' అనేది అదనంగా రావడాన్ని 'రుగాగమం' అంటారు.
దీన్నే ఇట్లా కూడా చెప్పవచ్చు
పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం సంబంధితంగా రుగాగమమవుతుంది.
◆ పైన చెప్పిన మూడు పదాలలో
పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం (నామవాచకం)
ఇలా విశేషణ విశేషాలతో కూడిన పదాన్ని కర్మధారయమంటారు.
◆ కర్మధారయమందు పేదాది శబ్దాలకు
'ఆలు' శబ్దం పరమైతే రుగాగమమవుతుంది.
పై పద్ధతి ప్రకారం కింది పదాలను విడదీసి గమనించండి. పరిశీలించండి.
అ) ముద్దరాలు = పేద+ర్+ఆలు - రుగాగమ సంధి
ఆ) జవరాలు = జవ+ర్+ఆలు - రుగాగమ సంధి
ఇ) మనుమరాలు = మనుమ+ర్+ఆలు - రుగాగమ సంధి
ఈ) కొమరాలు = కొమ+ర్+ఆలు - రుగాగమ సంధి
పైన చెప్పిన పేదాది పదాలు తెలుగుపదాలు.
ఇప్పుడు సంస్కృతానికి సమానమైన (తత్సమ) పదాలకు
ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.
గుణవంత + ఆలు → గుణవంతురాలు
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంతురాలు
శ్రీమంత + ఆలు → శ్రీమంతురాలు
ఈ సందర్భాలలో కూడా 'ర్' వస్తుంది.
కానీ స్వల్పమైన తేడా వచ్చింది గమనించారా? అదేమిటో పరిశీలిద్దాం!
గుణవంత + ఆలు - గుణవంత + ఉ+ ఆలు → గుణవంతు + ఆలు గుణవంతు + ర్ + ఆలు → గుణవంతురాలు
శ్రీమంత + ఆలు → శ్రీమంత + ఉ+ ఆలు → శ్రీమంతు + ఆలు → శ్రీమంతు + ఆలు → శ్రీమంతు + ర్ + ఆలు → శ్రీమంతురాలు
అలాగే..
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంత + ఉ+ ఆలు → బుద్ధిమంతు + ఆలు - బుద్ధిమంతు + ర్ + ఆలు → బుద్ధిమంతురాలు
పై మూడుచోట్ల తత్సమపదాలకు 'ఆలు' కలిస్తే
మొదటి పదం చివర ఉన్న అచ్చు
'అ'కారానికి బదులు 'ఉ' కారము వచ్చి
తరువాత రుగాగమయింది.
దీన్ని ఇట్లా చెప్పవచ్చు.
◆ కర్మధారయమందు తత్సమ శబ్దములకు 'ఆలు' శబ్దము పరంగా పూర్వపదం చివరఉన్న 'అకారానికి' ఉకారము వచ్చి రుగాగమం అయింది.
బుద్ధిమంతురాలు = బుద్దిమంత+ర్+ఆలు - రుగాగమ సంధి
సాహసవంతురాలు = సాహసవంత+ఆలు - రుగాగమ సంధి
Readable pdf Download Here Click