సంక్రాంతి పర్వదినం అంటే...?
ఊరినిండా పాడిపంటలే...
భోగిమంటలే...
ఇంటినిండా పిండివంటలే...
కొత్తజంటలే...
గాదెలనిండా నవధాన్యాలే...
భోగభాగ్యాలే...సిరిసంపదలే...
గంగిరెద్దులే...గాలిపటాలే...
కొత్తఅల్లుళ్ళే...కోడిపందాలే...
ముసిముసి నవ్వులే...
ముత్యాల ముగ్గులే...
హరిదాసుల వినోదాలే...
డూడూబసవన్నల విన్యాసాలే...
ఈ జీవితాన...
ఏ విషాదంలేని...
ఏ విపత్తులురాని...
మొండివ్యాధులు వెంటపడని...
చక్కని ఆయురారోగ్యైశ్వర్యాలే...
కానీ...
నిజమైన సంక్రాంతి
పర్వదినమెప్పుడు?
మూడు సాగుచట్టాల
ముప్పు...తప్పినప్పుడు...!
అన్నదాతల
ఆత్మహత్యలు... ఆగినప్పుడు...!
ఆకలిమంటల
అగ్నిజ్వాలలు...ఆరినప్పుడు...!
అందరి ఎదలో ఆనందాల
హరివిల్లులు...విరిసినప్పుడు...!
ముఖాలలో చిరునవ్వుల
చిరుజల్లులు...కురిసినప్పుడు...!
ఇంటిల్లిపాది మధుర
జ్ఞాపకాలతో....మురిసినప్పుడు...!
అందరి ఆశలు కోరికలు...తీరినప్పుడు...!
అందరి జీవితాల్లో పచ్చనైన
ప్రశాంతతా పంటలు...పండినప్పుడు...!
కళ్ళుపొరలు
కమ్మిన కామాంధులైన
మానవమృగాల పశువాంఛకు
ఆడిపాడే అమాయకపు పసిమొగ్గల
బంగారుభవిష్యత్తు...బలికానప్పుడు...!
అర్ధరాత్రిలో ఆడపడుచులు
నిర్భీతిగా...తిరిగినప్పుడు...!
విహంగాలై స్వేచ్ఛగా...విహరించినప్పుడు...!
అప్పుడే అప్పుడే...
అంబరాన్నితాకే...సంక్రాంతి సంబరాలు
అప్పుడే అప్పుడే
సకల జనులకు...సుఖశాంతులు...!
అందరి జీవితాల్లో...వెల్లివిరియును
భవ్యమైన...దివ్యమైన...నవ్య క్రాంతులు...!
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్