అమ్మమ్మ బతికింది అంతే చాలు
కె. సృజన్ సింధూర్
నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను. మా అమ్మ తమ్ముడితో అవస్థ పడుతూ నన్ను మా అమ్మమ్మ దగ్గర వదిలి పెట్టింది. నేను పుట్టినపుడు మా తమ్ముడు పుట్టినపుడు రెండు సార్లు అమ్మకు ఆపరేషన్ చేశారు అందుకే ఇద్దరితో చేసుకోవటం కష్టమని నన్ను మా అమ్మమ్మ వారింట్లో వదిలిపెట్టింది. అక్కడ నాకు భలే సరదాగా ఉండేది. మామ పుస్తకాలు పట్టుకొని కాలేజికి తయారైతే నేనూ పుస్తకాలు తీసుకొని నేనూ కాలేజికి పోతా అని తయారయేవాన్నట. నన్ను అమ్మమ్మ ఎత్తుకొని అటు తిప్పి ఏదో మాయచేసి మామ కాలేజికి వెళ్ళిపోయాక ఇంట్లోకి తెచ్చేది. నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాణ్ణి . ఏ మాత్రం తలుపులు తీసి ఉన్నా బుడుగు మంటూ బయటకు వెళ్ళిపోయి పక్కింట్లోనో ఎదురింట్లోనో కుర్చునేవాన్నట. అందుకే అమ్మమ్మ ఇంటి తలుపులు అన్ని వేసుకొని వంట చేసుకుంటూ ఉండేది. ఇలా చాలా విశేషాలున్నాయండి. అమ్మమ్మతో ఇంతకీ మా అమ్మమ్మ పేరు తెలుసా ! అంగలకుదుటి గోవిందమ్మ. అమ్మమ్మ వాళ్ళ ఊరు చీరాల అక్కడ సముద్రం ఉంటుందండి ! సముద్రతీరం 2కి .మీ దూరం మాత్రమే ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళింటికి మా తమ్ముడికి సముద్రం అంటే చాల ఇష్టం. నాకు ఇష్టమేనండి. కానీ వాడికి చాలా చాలా ఇష్టమన్నమాట అది సంగతి.
మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే చాలా విశేషాలున్నాయి గానీ అందులో మొదటిది నాకిష్టమైనది ఏంటంటే వంట చాలా బాగా చేస్తుంది. మనలో మాట మా అమ్మ వంట ఏమంత బాగోదు. మా అమ్మకు చెప్పకండెం వింటే బాధపడుతుంది. మా అమ్మమ్మ పప్పు, పచ్చి పులుసు చేస్తే ఎంత రుచిగా ఉంటుందో ఇంకా గోంగూర పచ్చడి,చింతకాయ పచ్చడి చేస్తే ఆ రోజు మిగతా కూరలు మిగిలి పోవాల్సిందే. ఇంకా చామదుంప వేపుడు, చామదుంప పులుసు చాల బాగా వండుతుంది. అమ్మమ్మ వస్తే నేను అమ్మను వద్దని పచ్చళ్ళు, పులుసులు చేయ్యమంటాను. అప్పుడు అమ్మ కోపం వచ్చి 'నువ్వు ఇంకా అమ్మమ్మ కాలం వాడివి పథ చింతకాయ పచ్చడి టెస్ట్' అంటూ ఎగతాళి చేస్తుంది. ఇలా అంటుందా తీర అమ్మమ్మ పచ్చళ్ళు చేశాక పస్ట్ థానే ఆ పచ్చళ్ళు తింటుంది. తన వంతను మెచ్చుకోలేదని అక్కసుతో అలా నన్ను ఎగతాళి చేస్తుందన్న మాట. ఇంకా నాకు రవ్వలడ్డూలు, బొంబాయి రవ్వతో చేసే కేసరి చాల ఇష్టం. అమ్మమ్మ ఉన్నన్ని రోజులు నేను ఇవే తింటున్నాను. మామ అమెరికా వెళ్ళిపోయాడు. తాతయ్య చనిపోవడంతో ప్రస్తుతం అమ్మమ్మ మా ఇంట్లోనే ఉంటోంది.
ఒకసారి నా చిన్నప్పటి విషయం చెబుతానుండండి. నాకు పాపిడి అంటే తెగ ఇష్టం. రోజు అమ్మమ్మ కోనిపెట్టేది. వాడు వీధిలోకి రాగానే గంట మోగిస్తాడు. పిల్లలందరూ ఆ గంట వినగానే బిల బిల మంటూ ఇళ్ళలో నుంచి బయటకు వస్తారు. రోజు ఒక రూపాయి పాపిడి కొనిస్తే తింటూ ఉండేవాడిని. ఒకరోజు వాడి గంట మోగింది. అమ్మమ్మే మో వంట పనిలో మునిగిపోయి వినలేదు. నాకు మాత్రం బాగా వినిపించింది. వెంటనే లేచా. చూస్తే తలుపు కొంచెంగా తీసి అమ్మమ్మ కుక్కర్ గాస్కెట్ నీళ్ళలో వేస్తూ ఉంది. నేను మధ్యలో దూరి బయటకు వెళ్ళిపోయా. అమ్మమ్మ గమనించలేదు. పాపిడి బండి దగ్గరికెళ్ళి పోయాను. డబ్బులివ్వలేదు కాబట్టి వాడు నాకు పాపిడి ఇవ్వలేదు. వాడు నాకు పాపిడి ఇవ్వలేదు కాబట్టి నేను వాడితో పాటే వెళ్ళాను. అలా వీధి దాటిపోయి ప్రక్కవీధిలో దాకా వెళ్ళిపోయాను. ఈ లోపల అమ్మమ్మ ఇంట్లో నేను కనపడక పోవటం చూసి గబగబా బయటికొచ్చి వాళ్ళను విళ్ళనూ అడిగి పాపిడి బండి దగ్గరకు వచ్చింది. గబుక్కున నన్ను ఎత్తుకొని పాపిడి కొని పెట్టింది. ఆ తర్వాత పాపిడి బండి వాడిని తిట్టింది. ఇలా పసి పిల్లోడు నీ వెనకే వస్తుంటే చెప్పాల్సిన పని లేదా. ఎటైనా తప్పిపోతే ఏంటి పరిస్థితి అంటూ చీవాట్లు పెట్టింది. నేనంటే ఎంత ప్రేమో!
అమ్మమ్మ చక్కగా జడల్లు కొని చుట్ట చుట్టుకుంటుంది. నేను అటు పోతూ ఇటు పోతూ ఆ చుట్ట లాగేస్తుంటాను. అది ఊడి పోతుంది ' ఇప్పుడే వేసుకున్నాన్రా! ఉడదీశావా' అంటూ అరుస్తుంది. నేనేమో నవ్వుతుంటాను. "ఏరా ఇంత పెద్దోడివైనా అమ్మమ్మతో తిట్లేంటిరా" అని అమ్మ కోప్పడుతుంది. నాకేమో సరదా! అంతే!
పోయిన సంవత్సరం అమ్మ నాన్న, తమ్ముడు హైదరాబాద్ వెళ్ళారు. నేను అమ్మమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నాం. అప్పుడు అమ్మమ్మ ' ఎదో గుండెల్లో మంటగా ఉందిరా! అంది వెంటనే సీన్ అర్థమై ఫిజిషియన్ ను పిలిపించా. ఇంతకి చెప్పలేదు కదా! నేను హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ను హార్ట్ ప్రాబ్లమే. వెంటనే అంబులెన్స్ ను పిలిపించి హైదరాబాద్ తిసుకోచ్చేశాను. అమ్మా, నాన్న ఇక్కడే ఉన్నారు కదా! అపోలో లో 'స్టంట్' వేసి అమ్మమ్మకు ఆపరేషన్ చేశారు. అక్కడి డాక్టర్లు చాలా మంచి డెసిషన్ సరైన టైములో తిసుకున్నావంటూ పొగిడారు. ఏమైతేనేం మా అమ్మమ్మ బతికింది. నాకంతే చాలు. ఆపరేషన్ అయి ఇంటికొచ్చాక ' ఉరికే అల్లరి చేస్తావుగానీ నేనంటే నీకెంత ప్రేమరా! అని అన్నది. అమ్మమ్మ ప్రక్కనే కూచొని చుట్టను (కొప్పును) లగేశాను. మళ్ళి జడ ఉడి పోయింది. ఒరేయ్ గాడిదా! అంటూ తిట్టింది. " ఇలా ఎవరూ తిడతారు? నాకు దిష్టి ఎవరూ తీస్తారు అమ్మమ్మా" అంటూ అమ్మమ్మ ఒళ్ళో పడుకోబోయాను. ' ఆపరేషన్ చేశార్రా అమ్మమ్మకు' అంటూ అమ్మ కొట్టబోయింది. నేను బయటకు తుర్రుమన్నాను.