రాత్రి పూట డ్రైవర్ని
డా.. కందేపి రాణీప్రసాద్.
పిల్లల పీజీలయ్యక ఈ మధ్యనే పిల్లల్ని తీసుకుని మా సొంతూరు చీరాల వెళ్ళాము. పెద్ద చదువుల్లోకి వచ్చాక పరిక్షలన్ని ప్రాజెక్టులని మాతో వచ్చేవాళ్ళళ కాదు పిల్లలు. ఉళ్ళో అవి ఇవి చూపించాక నేను చదువుకున్న వుమెన్స్ కాలేజి చూపించాను. కాలేజిలో ఉన్న గార్డెన్ ను చూపించి అవన్నీ మేము నాటిన చెట్లే అని చెప్పాను. వాళ్ళు గార్డెన్ దాని పక్కనే సైకిల్ స్టాండ్ ను చేశారు. కాసేపు అటూ ఇటూ తిరిగాక 'కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి వెల్లిపోదాం పదా' అన్నారు. 'కారు దిగాక రెండు అడుగులు వెయ్యలేరు వీళ్ళేం పిల్లలో' అనుకుంటూ మేము అప్పట్లో మనింటి దగ్గర నుంచీ కాలేజి దాకా నడుచుకుంటూ వచ్చే వాళ్ళం. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి అన్నం కూడా తిని వచ్చేవాళ్ళం. ఇలా రోజుకు నాలుగుసార్లు తిరిగేవాళ్ళం' అంటూ పాత రోజులు గుర్తు చేసుకుంటూ గొప్పగా చెప్పాను. అంత విని వాళ్ళు ఏమ్మా! మీ నాన్న నీకు కారు కొనియ్యకపోతే పోనీ గానీ కనీసం సైకిలన్నా కోనియ్యలేదా! ఇంత దూరం నడిచావా? మా నాన్నకు రైస్ మిల్లులున్నాయి గదా" అన్నారు. పిల్లలు నాలుగడుగులు వెయ్యలేక పోతున్నారని నేను గొప్పగా చెబితే వాళ్ళు నన్ను చూసి జాలిపడ్డారు. సరే ఇంతకి వీళ్ళ మాటల్తో నేను సాకిలు నేర్చుకోవడంలో పడ్డ కష్టాలన్నీ గుర్తువచ్చాయి.
మేం కాలేజిలో చదువుకునే రోజుల్లో ఆడపిల్లలు సైకిల్ తోక్కేవాళ్ళు లేరు. చిన్నపిల్లలు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు. కానీ కాలేజి స్థాయిలో ఎవరూ లేరు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా మానాన్న నాకు సైకిల్ కొని పెట్టారు. 'నువ్వు సైకిల్ నేర్చుకుంటే స్కూటర్ కొనిస్తాను. అన్నాడు. మానాన్న ఎప్పుడూ కాలం కంటే పదడుగులు ముందే ఉంటాడు. స్వాతంత్ర్యనికి పూర్వం పెళ్ళయ్యాక మా అమ్మను చదివించాడు. అలాగే నన్ను ఊరు మొత్తంలో ఏ పదిమందో సైకిల్ తొక్కే సమయంలో నన్ను సైకిల్ నేర్చుకోమని ప్రోత్సహించాడు. నాకు సైకిల్ నేర్పడానికి మా అన్నా కోడుకును కూడా నియమించాడు. అప్పుడు చూడాలి నా కష్టాలు. ఎవరైనా చూస్తారేమోననే భయంతో రాత్రిపూట 9 గంటల తర్వాత నేర్చుకోవటం మొదలు పెట్టేదాన్ని. సైకిల్ తొక్కడమయితే వచ్చింది గానీ ఎదురుగా ఎవరైనా రాగానే భయపడేదాన్ని. ఖాళి రోడ్లపై మాత్రం బ్రహ్మాండంగా తొక్కేదాన్ని మా నాన్న చూసి బాగా వచ్చింది. జనంలో తిప్పటం వస్తే స్కూటర్ కొనిపెడుతా అన్నాడు. ఈ మాట నాకు ఆనందం కలిగించలేదు గానీ మా అల్లుడికి ఆనందం కలిగించాలి. 'ఎలాగోలా నేర్పించేస్తే తాతయ్య స్కూటర్ కొంటె, స్కూటర్ తో తిరగచ్చుకదా' అని వాడి ప్లాను. అందుకని నాతో పాటు వాడు కూడా సైకిల్ తీసుకొని సాయంత్రం 6 గంటలకు సమయంలో జనసమ్మర్థం ఉన్నా మెయిన్ రోడ్డులోని నన్ను తీసుకెళ్ళాడు. రోడ్డు మీద అందరూ వింతగా చూస్తుంటే నాకు సిగ్గేసింది. ఒణిలు వేసుకున్న అమ్మాయిలు సైకిల్ తొక్కే వాళ్ళు లేరు. అందుకే నాకు భయం. నన్ను భయపెట్టటానికి ఎదురు వచ్చే వాళ్ళు సైకిల్ ను దగ్గర దాకా తెచ్చి మలుపు తిప్పే వాళ్ళు. ఈ లోపల నేను భయపడిపోయి మా అల్లుడిని పట్టుకోమనే దాన్ని. వాడు రెండు సైకిళ్ళూ మానేజ్ చేసేవాడు. ఇలా టెన్షన్ పడేదాన్ని సాయంత్రం 6 నుండి 7 టైపులో చేర్పించాడు నన్ను మానాన్న. ఆ టైపు సెంటర్ కు సైకిల్ మీద వెళ్ళమనే వాడు. పక్కనే మా అల్లుడు ఉంటె తప్ప నేనొక్కదాన్ని ఎప్పుడూ వెళ్ళలేదు.
ఇదంతా చూసి మా అల్లుడు ఒక ప్లాను వేశాడు. స్కూటర్ కొనిచ్చేలోపు టివియస్ నేర్చుకుంటే బాగుంటుంది. నేను మా ఫ్రెండు దగ్గరుంది తెస్తా' అన్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండు వీడికి ఇవ్వలేదు. వాడు చాల చోట్లా ప్రయత్నం చేశాడు గానీ ఎవరూ వీణ్ణి నమ్మలేదు. మా అల్లుడు నాకన్నా 2 సంవత్సరాలు పెద్దవాడు. మా నాన్న స్కూటర్ కొనిస్తే వాడు కూడా తిరగచ్చని. కానీ నేను సింగిల్ గా సైకిల్ మీద బజార్ కు వెళ్ళాలి కదా! ఏం చేస్తాం అలా కాలం గడిచిపోయింది. నా పైనల్ ఇయర్ అయిపోయింది వాడు మాత్రం టివిఎస్ కోసం వేట మానలేదు. చాలామంది నడిగినా ఇవ్వలేదు. చివరగా నా పెళ్లి కుదిరింది. తెల్లారి పెళ్లి. ఇంట్లో అంత హడావిడిగా ఉంది. ఆ రోజు పెళ్లి కూతుర్ని చేశారు కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంట్లో కూర్చుని ఉన్నాను. పెళ్లి కొడుకు వాళ్ళు కళ్యాణమండపానికి వచ్చారని చెపితే అమ్మానాన్న అందరూ వాళ్ళని స్వాగతించడానికి వెళ్లారు.
అప్పుడు హడావిడిగా వచ్చాడు మా అల్లుడు ఎవరిదో టివీఎస్ తీసుకొని. రాణి! త్వరగా రా! ఒక రౌండ్ వేసి వద్దాం! మళ్ళి పెళ్ళి వాళ్ళు ఈ బండి తీసికెళ్ళి పోతారు అంటూ హడావిడి పెట్టద్దు. 'ఎక్కడిదిరా ఈ బండి?' అని నేనేడుగుతున్నా వెనక నుంచీ మా నాయనమ్మ వచ్చింది. "ఏంటి ఎక్కడికి వెళ్ళేది? పెళ్లి కూతుర్ని చేశాక ఎక్కడికి వెళ్ళకూడదు" అని ఇంకా ఆమెకు అసలు విషయం తెలియ లేదు. తెలిస్తే మమ్మల్ని అక్కడే పాతేసేది. అలా నేను స్కూటర్ కొనుక్కోకుండానే పెళ్ళయి పోయింది.
పెళ్ళయ్యాక మావారి దగ్గర బజార్ స్కూటర్ చూసి ఈ కథంతా చెప్పాను. "పెళ్ళి కూతుర్ని చేశాక, తెల్లారితే పెళ్లన్నపుడు బండి దొరికిందా నడపటానికి" అని తెగ నవ్వారు. ఆ తర్వాత తనే దగ్గరుండి స్కూటర్ నడపటం నేర్పారు. ఇక్కడా అదే ప్రాబ్లమ్. ఉళ్ళో ముగ్గురు, నలుగురు తప్ప ఎవరూ నడిపేవారు. అందుకని రాత్రిపూట నడిపి "నేను కూడా స్కూటర్ నడిపాను" అని మురిసి పోయ్యా.
ఆ తర్వాత మావారు కారు కొన్నాక కారు నేర్పించారు. మద్రాసు, బెంగళూరు అంటూ తెగ తిరిగే వాళ్ళం. ఇప్పుడు కూడా అర్థరాత్రి 12 దాకా తను నడిపి ఆ తర్వాత నాకు స్టిరింగ్ ఇచ్చేవారు. హైవేల్లో రాత్రి పూట కారు నడిపెదాన్ని. అప్పుడు సైడ్ ఇచ్చేటప్పుడు చెయ్యి చూపించే వాళ్ళు. వెనక వచ్చే లారీల వాళ్ళకు అలా చెయ్యి చుపించినపుడు గాజులు కనపడి ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్ళేటప్పుడు విచిత్రంగా చూసేవాళ్ళు. ఎదురు వాహనాలు అడ్డం రాణి హైవేలపై కారు చక్కగా నడిపేదాన్ని. తెల్లారుతూ ఉండగానే మావారి కిచ్చసే దాన్ని. అలా జీవితాంతం నేను రాత్రిపూట మాత్రమే నడుపుతున్నాను. మొత్తానికి మా నాన్న కోరిక తీరలేదు. సైకిల్, స్కూటర్, కారు వాహనం మారింది కానీ నేను జనసంమర్థంలో మాత్రం నడపలేదు.