సొరకాయ తీగ – ప్రాక్టిసుకు ప్రాబ్లం డా.. కందేపి రాణీప్రసాద్.

సొరకాయ తీగ – ప్రాక్టిసుకు ప్రాబ్లం డా.. కందేపి రాణీప్రసాద్.




సొరకాయ తీగ – ప్రాక్టిసుకు ప్రాబ్లం
                              డా.. కందేపి రాణీప్రసాద్.
మేము పూర్వకాలపు జమిందార్ల ఇంట్లో అద్దెకుండే రోజులవి ఆ ఇంట్లో చాల ఖాళి స్థలం ఉండేది. ఆ స్థలమంతా చెట్లతో నిండి ఉండేది. దాన్ని బూత్ బంగాళా అనేవాళ్ళు. పాతకాలపు సన్లే షేడ్లు లేని కిటికీలు పెద్ద బురుజుల తో ఆకుపచ్చ రంగు వేసిన తలుపులతో గమ్మత్తుగా ఉండేది. ఆ ఖాళి స్థలంలో పారిజాతం, దానిమ్మ, వేప, రావి, గుల్ మొహార్ వంటి పెద్ద చెట్లు మందార, మల్లె, సన్నజాజి, గన్నేరు, నంది వర్ధనాలు వంటి పూలచెట్లు ఉండేవి.అంతేకాక ఒక పక్కన పెద్ద తొట్టి లాంటిది భూమిలోపలికి కట్టి ఉన్నది. దాంట్లో నీళ్ళు నింపి ఉండేవి. వాటిలో కలువ పూలు తామర పూలు చేట్లుండేవి ఒక్క వాన కురిస్తే చాలు జినియాలు, బంతులు, కనకాంబరాలు మొలకలు లేస్తూ ఉండేవి. చాలా బాగుండేది ఆ ఇల్లు. కానీ మేము చెరక బంతి, జినియాలు వంటి మొలకలు లేవడం మెల్లగా మానేశాయి. ఎందుకంటే పేషంట్లు అందరూ ఆ మట్టిలో పిల్లలను ఆడిస్తూ తిరుగుతుండే వాళ్ళు. మనుషులు నడిచేసరికి నేల గట్టిపడి చిన్న చిన్న మొక్కలు పోయినాయి.
సరే అలా ఉండగా ఒక సంవత్సరం నేను కూరగాయల మొక్కలు పెట్టాలనుకున్నాను. కొద్ది స్థలం చదును చేసి అక్కడ వంగ బెండ, చిక్కుడు చెట్లు పెట్టాను. అవి చక్కగా పెరుగుతున్నాయి. అయితే వాటిలో ఎలా వచ్చిందో ఏమో ఒక సొర చెట్టు మొలిచింది. అది మెల్లగా తీగ పాకింది. అప్పుడు చూసి అక్కడో పుల్ల గుచ్చము. ఏమంత శ్రద్ధ పెట్టక పోయినా తీగ సాగుతోంది. ఆ చెట్టుకు అనుకుని మా మెడికల్ షాపు ఉంటుంది. మెల్లగా ఈ తీగను ఆ షాపు యొక్క రూము పైకి పాకించాము. అంతే దానికి ఆలంబన దొరికినట్లయింది. షాపు మీదున్న రేకులన్ని మెత్తటి పరుపులతో నింపినట్లుగా సొర తీగలు అల్లిబిల్లిగా అల్లుకున్నాయి అడుగు మందంతో. దీని పువ్వులు రాత్రి పూట పూస్తాయి. రాత్రి అవుతూనే చీకట్లో నక్షత్రాల్లా తెల్లటి పువ్వులు చక్కగా పూస్తాయి. అక్కడక్కడా పిందెలు వేయటం మొదలయింది. దానికి అనుకుని మా వాష్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియా పిట్ట గోడకూ అల్లేసుకుంది సొర తీగ. మేము మేడ మీద ఉంటాము. మా వంట రూము షాపుకు ఎదురుగ పైన ఉంటుంది. రెడింటి మధ్య ఓ 15 అడుగుల దూరం ఉంటుంది. సోరతీగకు ఖాళి సరిపోవటం లేదని మేమేం చేశామంటే షాపు మీదనుంచి మా వంటింటి కిటికీకి తాళ్ళు కట్టి పందిరిలగా తాయారు చేశాము. ఇక చూడండి సొర తీగ ప్రతాపం తాళ్ళ చుట్టూ బలంగా చుట్టుకొని వెడల్పాటి ఆకుల్ని కుట్టేసి కొబ్బరాకుల పందిరిలా అందంగా అల్లుకుంది. మందులు కొనుక్కోవడానికి వెళ్ళే పేషంట్ల కు ఎండ పొడ తగలకుండా చల్లని పందిరిగా మారింది. పిందెలు పెరిగి కాయలవుతున్నాయి.
షాపు మీదున్న రేకుల రూఫ్ నిండా బిందేల్లాంటి సోరకాయల్ని దింపింది. నేను అప్పటి వరకు పొడుగ్గా ఉండే సోరకాయల్ని మాత్రమే చూశాను. వీటిని " పెట్టె సొర కాయలు" అంటారట. పౌర్ణమి నాటి రాత్రిళ్ళు వాకిట్లో నిలబడితే తెల్లటి నక్షత్రాల్లాంటి పువ్వులు మధ్య మధ్య ఆకుల మాటున నుంచి కొద్ది కొద్దిగా కనిపిస్తూ గుండ్రటి చంద్రుడులా కాయలు కనివిందు చేస్తున్నాయి. ఆకాశంలో నక్షత్రాల మధ్య చంద్రుడోక్కడే కనిపిస్తాడు గానీ ఇక్కడ నక్షత్రాల పూల మధ్య అనేక చంద్రుళ్ళు కనిపిస్తున్నారు. నింగి నున్న చంద్రుడు మేఘాల మధ్య దోబూచు లాడినట్లుగా మా మిద్దె మీద చంద్రుళ్ళు ఆకుల మధ్య కని కనిపించకుండా దోబూచులాడుతున్నాయి. వాటినలా చూస్తుంటే మనసు ఆనందంతో నిండి పోయేది.
ఆ కాయల్ని చూసి కడుపు నిండిపోయింది గానీ కాయల్ని ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క కయ కోసి మేము కొద్దిగా సాంబారు పెట్టుకుని, మిగతా కయ నలుగురికిచ్చినా ఎక్కువై పోయింది. కాయలు కోసి హాస్పిటల్లో పని చేసే స్టాఫ్ అందరికి ఇచ్చాను. అవి కాస్తూనే ఉన్నాయి ఇంకా పెద్దగా. వీధిలో వాళ్ళందరికీ ఇచ్చాం. మళ్ళి ఇస్తామంటే మొన్నిచ్చిన కయ ఇంకా అయిపోలేదు అన్నారు. సరే అని కాయను ఐదారు ముక్కలుగా కోసి ఐదారుగురికి పంచాము. మా సొరకాయల పంపకం పక్క వీధులకూ పాకింది. అయినా కాయలు విపరీతంగా కాస్తున్నాయి. ఇక వీధిలో వాళ్ళు మా కాంపౌండర్లు కనపడితే తలుపులు వేసుకోవడం మొదలు పెట్టారు. ప్రతి రోజు సొరకాయల పంపకం పెద్ద సమస్య ఐ పోయింది. సొరకాయ పెంపకం బాగానే ఉంది కానీ పంపకం సమస్యే ఎక్కువ అయింది.
షాపు మీద నుంచి వంటింటి కిటికీకి తాళ్ళు కట్టానని చెప్పను కదా! ఆ కిటికీకి ఇవతల స్టవ్ ఉంటుంది. వంటలు చేసుకుంటూ కిందనున్న జనాల్ని చూస్తూ ఉండేదాన్ని సరే ఈ సోరతీగా ఏం చేసిందనుకున్నారు. తీగలు కిటికీ చువ్వలకు చుట్టుకుని ఇంటి లోపలకు వచ్చేశాయి. నేను పని మీదున్నా నన్ను చూడచ్చని లోపలికే వచ్చేశాయను కున్నాం. లోపలి వచ్చినా తీగలకు రెండు పిందెలు వేశాయి. నేను కూర వండటం కన్నా ఎవరికివ్వాలి అనే ఆలోచన లోనే ఉండటం గమనించింది కాబోలు చెట్టు అందుకే డైరెక్ట్ గా వంటింట్లోకే వచ్చి స్టవ్ పైనే పిందెలు వేసిందని చాలా సంతోషించాం. ఈ రెండు కాయలు మాత్రం ఎవరికీ ఇవ్వద్దనుకున్నాం.
రూఫ్ మీదున్న కాయలు బాగానే ఉన్నాయి కానీ పందిరికి వేలాడే కాయలు వచ్చే పేషెంట్ల అందరి తలల్ని తాకుతూ ఆశీర్వదిస్తున్నాయి. అందరూ పైకి చూడటం, కాయలు రంత బాగున్నాయో అనటం రోటినై పోయింది. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. కాయల్ని పేషంట్లకు పంచుదామని. సరే అని వెంటనే అమలు చేశాం. వెంటనే మా డాక్టరు గారు ఫోన్ చేశారు. " నువ్వీ సోరకాయలివ్వటం మానేయమని". ఏంటంటే ఇప్పటికే వీధిలో వాళ్ళు తలుపులేసుకుంటున్నారు. ఇప్పుడు పేషంట్లకు ఇస్తే వాళ్ళు రావడం మానేస్తారు. నా ప్రాక్టిస్ మీద దెబ్బ కొట్టకు అని. ఏం చేస్తామండి అప్పటి నుండి ఇప్పటి వరకూ సొరకాయ చెట్టు పెడితే ఒట్టు!.
 

0/Post a Comment/Comments