అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేకదినోత్సవం జరుపుకుంటాము.
దీనిని 2003 అక్టోబర్ 31న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అవినీతి వ్యతిరేక దినోత్సవం లో నిర్ణయించారు.
అవినీతి ప్రభావం.
అవినీతి ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీస మౌలిక వసతులు కూడా సంపాదించుకో లేక పోతున్నారు. అవినీతి అనేది మన దేశములో వేళ్ళతో సహా భూమిలో పాతుకు పోయింది. అవినీతి లేని రంగమంటూ ఈనాడు మనకేదీ కనబడదు. ప్రతిచోటా అవినీతి విలయతాండవం చేస్తోంది. అటు ప్రభుత్వరంగాలు అయితే చెప్పనలవి లేదు. గ్రామస్థాయి నుండి రాజధాని స్థాయి వరకు ప్రతిచోటా అవినీతిమయమే. ప్రైవేట్ సంస్థలు, ఎన్జీవోలు, మీడియా, రాజకీయాలు, వ్యక్తులు, రక్షణనిలయాలు, ఆర్టిఓకార్యాలయాలు ఒకటనేమిటి అవినీతి లేని రంగము కానరాని చోటు నేడు ఉండదు. అందరూ కలిసి ఉమ్మడిగా అవినీతిని పెంచి ముఖ్యంగా మానవహక్కులను కాలరాస్తున్నారు. జీవన ప్రమాణాల నాణ్యత క్షీణించింది. వాటివల్ల వ్యవస్థలో నేరాలు పెరిగిపోయాయి.
ఒక వ్యక్తి లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుంటే, అతను నీతివంతంగా ఎలా పనిచేస్తాడు . తాను ఉద్యోగం కొన్నాడు కాబట్టి, అంతకుమించి తాను ధనం సంపాదించాలనే ఆశతో, తాను అవినీతికి పాల్పడే అవకాశం నూరు శాతం ఉన్నది. ప్రతి నిత్యము ప్రతిచోటా అవినీతి తిమింగలాలు దొరికినంత మేస్తూనే ఉన్నాయి. ఈ అవినీతి దొంగలను అక్కడక్కడ పట్టుకుంటూ ఉంటారు. వారి దగ్గర కోట్లు దొరుకుతూనే ఉన్నాయి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం, కానీ ఎవరూ ఏమీ చేయలేకుండా ఉన్నారు. మరలా యథేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళు మొదలు పెడుతున్నారు.
చిన్న కాపలాదారు మొదలుకొని ఉన్నతోద్యోగి వరకు ఈ అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మధ్యవర్తుల ద్వారా వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ రంగములో లంచం లేనిదే ఏపని జరగదని ప్రజల అభిప్రాయం. ఈ మధ్యనే మనం చూస్తూ ఉన్నాం,
ప్రజలలో సహనం నశించి పెట్రోల్ తో దాడులు చేస్తున్నారు. వ్యవస్థ ఎంతదిగజారిపోయిందో ఈచర్యను బట్టి మనకు అర్థమయింది.
కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం, హక్కుల కమిషన్లను ఆశ్రయించడం, ఇంటర్నెట్, టీవీ, ప్రింట్ మీడియాను ఆశ్రయించడం, సమాచారహక్కు చట్టం కింద సమాచారం కోరడం వంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకైనా తగ్గించవచ్చు. యాంటీ కరెప్షన్ సంస్థలు ఏర్పాటు చేయడం, రాజకీయ పక్షాలకు నిధులు అందించడం లో, పాలనావ్యవహారాల్లో పారదర్శకత పెంచడం, ప్రతిభ, సామర్థ్యం లాంటి అంశాల కారణంగా నియామకాలు, ప్రమోషన్లు చేపట్టడం లాంటి చర్యలు తీసుకోవాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడం, వివిధ దేశాలు పరస్పరం సహకరించుకోవడం, అన్ని రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లాంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకు తగ్గించవచ్చు.
ముఖ్యంగా రాజకీయరంగములో అవినీతికి అంతు లేకుండా ఉంది. దానికి సంస్కరణలు చూపాలి. నాయకులు ఓట్లు కొనడం, ప్రచారానికి విపరీతంగా ఖర్చు పెట్టడం. కోట్లు గుమ్మరించి గెలవడం. గెలిచిన తర్వాత అక్రమ సంపాదన మొదలుపెట్టడం. నేడు మన నాయకులు అక్రమంగా సంపాదిస్తున్న విషయం అందరికి తెలిసిందే, వారు పెట్టిన ఎన్నికల ఖర్చులను ప్రజల ముందు ఉంచాలి. సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తిగా సమాచారాన్ని ప్రజలుతెలుసుకునే వీలు ఉంది. దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే కొంత వరకు అవినీతి దూరమవుతుంది. అధికార వికేంద్రీకరణ జరగాలి.జవాబుదారితనం స్థానిక ప్రభుత్వాలు పాటించాలి."లంచం తీసుకోవడం ఎంత నేరమో, లంచం ఇవ్వడం అంత నేరమని తెలుసుకోవాలి"
నా అభిప్రాయం ఏమంటే,ఈ లంచగొండితనంతో సామాన్యులు ఎంతో బాధపడుతున్నారు, సామాన్యుడు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేక, వారికి లంచాలు ఇచ్చుకో లేక, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు,అడుగడుగునా నిఘా నేత్రాలు పెట్టి, సాధ్యమైనంత త్వరగా ఈ వ్యవస్థను అంతమొందించాలి, ప్రజలు కూడా జాగృతం కావాలి, తాను లంచం ఇచ్చే అలవాటు మానుకోవాలి, అలా అడిగిన వారిని సమాచార హక్కు చట్టం కింద కేసు పెట్టాలి. అలాంటి వారిని ఎప్పటికప్పుడు ప్రజల ముందర పెట్టాలి.అవినీతి లేని ప్రజాస్వామ్యాన్ని చూడాలని నేను కోరుకుంటున్నా. ప్రతి వ్యక్తీ స్వచ్ఛందంగా తనకు కావలసినవన్నీ సరైన మార్గంలో సంపాదించాలని కోరుకుంటున్నా. అవినీతిని మూలాలతో సహాఅంతం చేస్తే తప్ప ఈ కలుపు మొక్కలు పోవు.
కొప్పుల ప్రసాద్,
తెలుగు ఉపన్యాసకులు
నంద్యాల.
9885066235