పద విభాగం
పదం
పదం అనేమాటకు పాట, మాట, వహము, కాలు, పద్యమందలి నాల్గవ చరణము, చిహ్నము, స్థానము, శబ్దము అని అర్థాలున్నాయి.
(గణితశాస్త్రము ప్రకారం ఒక సమాసములోగాని సమీకరణములోగాని ఉండు నొక రాశి (Term) - ax2+bx+c=o ఇందు మూడు పదము లున్నవి)
మనకు కలిగే భావాలకూ, మనం చూసే వస్తువులకూ సమాజం ఏర్పరచుకున్న గుర్తులే పదాలు. ఈ ధ్వని చిహ్నాలు ఒకే భాష తెలిసిన ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థ వినిమయం చేస్తాయి.
“అర్థమునిచ్చు ఒకటిగాని, ఒకటికంటే ఎక్కువగాని అక్షరాల సముదాయమును పదం అనవచ్చు”.
ప్రాచీన సంప్రదాయాన్ననుసరించి తెలుగు భాషలోని పదాలను
1.తత్సమం, 2.తత్భవం, 3.దేశ్యం, 4.గ్రామ్యం, 5.అన్యదేశ్యం అని వర్గీకరించారు.
తత్సమం
తత్ అనగాతత్వము, మూలము, సారము.
సమము అనగా సమానము.
సంస్కృతముతో(మూలముతో) సమమై తెలుగు విభక్తి గల శబ్దము. సంస్కృతము సంస్కృత ప్రాకృత శబ్దములకు తెలుగు ప్రత్యయములు చేర్పగా ఏర్పడిన పదములు తత్సమాలు. “`సంస్కృత, ప్రాకృత భాషలలోని పదాలతో సమానమైన పదాన్ని తత్సమం అంటారు. తత్సమ పదాల్ని ప్రకృతి పదాలు అనికూడా అంటారు”.
సంస్కృత ప్రాకృతతుల్యం బగు భాష తత్సమంబు
సంస్కృతము - సంస్కృతసమము
రామః - రాముఁడు
విద్యా - విద్య
హరిః - హరి
ధేనుః - ధేనువు
భూః - భువి
పితా - పిత
గౌః - గోవు
నౌః - నావ
దౌః - దివి
హృద్ - హృది
జగత్ - జగత్తు, జగము
ఇత్యాదు లూహ్యంబులు
సంస్కృతము - ప్రాకృతము - ప్రాకృతసమము
అగ్నిః - అగ్గీ - అగ్గి
ఆటిః - ఆడీ - ఆడి
ఆలిః పఙ్క్తౌ - ఓలీ - ఓలి
కటుః - కారో - కారము
గౌరవమ్ - గారవం - గారవము
జటా - జడా - ౙడ
రాజ్ఞీః - రాణీ - రాణి
శ్రీః - సిరీ - సిరి
ఇత్యాదు లెఱుంగునది.
తత్భవం
భవము అనగాపుట్టుక, సంసారము, ప్రాప్తి, శుభము, సత్త, సంసారము, ప్రపంచము అని అర్థము.
“సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన(పుట్టిన) పదములను తద్భవములుఅంటారు. తత్భవాలను వికృతి పదాలు అని కుడా అంటారు”.
సంస్కృత ప్రాకృతభవంబగు భాష తద్భవంబు
ఆకాశః - ఆకసము
కుడ్యమ్ - గోడ
తామరసమ్ - తామర
నిభః - నెపము, నెవము
ముఖమ్ - మొకము, మొగము
మృగః - మెకము, మెగము
వక్రః - వంకర
సముద్రః - సముద్రము
ఇత్యాదులు గ్రహించునద
సంస్కృతము - ప్రాకృతము - ప్రాకృతభవము
ఆశ్చర్యమ్ - అచ్చేరం - అచ్చెరువు
పృథివీ - పుఢవీ - పుడమి
ప్రయాణమ్ - పయాణం - పయనము
లక్ష్మీః - లచ్చీ - లచ్చి
విష్ణుః - విణ్ణూ - వెన్నుఁడు
స్తమ్భః - ఖంభో - కంబము
ఇత్యాదులు తెలియునద
దేశ్యం
దేశ్యం అనగాదేశమునకు తగినది, భాషలో తత్సమాది విభాగములలో నొకటి. తత్సమము, తత్భవములుకాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు.
“తెలుగు దేశంలో (త్రిలింగాలు - కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం అనే మూడు క్షేత్రాల మధ్యగల భూభాగంలో) సంస్కృత, ప్రాకృత భాషల ప్రభావం లేకుండా మొదటినుండి ప్రజల వాడుకలో ఉన్న పదాలను దేశ్యాలు అంటారు”.
త్రిలింగదేశ వ్యవహారసిద్ధం బగు భాష దేశ్యంబు
ఊరు, పేరు, ముల్లు, ఇల్లు, కోట, పేట, దూడ, మేడ, కోఁత, లేఁత, తావి, మోవి - ఇత్యాదులరయునది
గ్రామ్యం
గ్రామ్యం అనగాఅర్థదోషములలో నొకటి, శబ్దదోషములలో నొకటి, ,అసభ్యమైనది, పామరము, అశ్లీలము, అసభ్యమగు మాట, పామరజన వాక్యము, వన్యము,ఊరియందు పుట్టినది, తెలివిలేనిది, నాగరికతలేనిది అని అర్థం. “ప్రాచీన సంప్రదాయాన్ననుసరించి లక్షణ విరుద్ధమైన భాషా (పద) రూపాలను గ్రామ్యం అంటారు”.
ఇందులో రెండు రకాలు 1.నింద్య గ్రామ్యం, 2.అనింద్య గ్రామ్యం.
నింద్య గ్రామ్యం: వ్యాకరణ నియమ విరుద్ధాలై, ఆర్యులైన వారి (శిష్టులు) వ్యవహారంలో కనబడని పదాలు నింద గ్రామ్యాలు.
అనింద గ్రామ్యాలు: వ్యాకరణ నియమ విరుద్ధమైనాఆర్యుల ప్రయోగాలలో ఉన్న పదాలు అనింద్య గ్రామ్యాలు.
లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యంబు
వస్తాఁడు, తెస్తాఁడు, వచ్చేని, తెచ్చేని, వచ్చేవాఁడు, తెచ్చేవాఁడు, వచ్చేటివాఁడు, తెచ్చేటివాఁడు ఈ భాష ప్రయోగంబున కనర్హంబు.
ఆర్యవ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు
పెద్దలు వ్యవహరించిన మాట గ్రామ్యంబయిన గ్రహింపఁదగునని తాత్పర్యము. కఱకంఠుఁడు, ప్రాణగొడ్డము, జీవగఱ్ఱ, కపిలకన్నులు, కపిల గడ్డము, కపిలజడలు
అన్యదేశ్యం
అన్య అనగాభిన్నము, ఇతరము, వేరు అని అర్థం.
సంస్కృత ప్రాకృత పదాలు తప్ప ఇతర భాషా పదాలు ఏదో ఒక కారణం వల్ల తెలుగు భాషలోకి వచ్చిచేరే పదాలు అన్యదేశ్యాలు. “సంస్కృత ప్రాకృత పదాలు కాకుండా తెలుగులో గల వేరే భాషా పదాలు అన్యదేశ్యాలు”.
ఉదాహరణ: బస్సు, కారు, స్కూలు, స్టేషను, రోడ్డు మొదలైనవి.
ద్రుతప్రకృతికములు
నకారంబు ద్రుతంబు(నకారము న్). ద్రుతాంతము లయిన పదములు ద్రుతప్రకృతికములు
ప్రథమా, కయి, పట్టి, యొక్కేతరములయిన విభక్తులు, ఉత్తమ పురుషైక వచనంబులు, భూత తద్ధర్మాద్యర్థక ప్రథమ పురుషైక వచనంబులు, ఆశీరాద్యర్థంబులయిన యెడుత వర్ణకంబులు, శతృతుమానంతర్య చేదాద్యర్థకంబులు, నేను తాను పదంబులును, వలె ప్రభృతులును, ద్రుత ప్రకృతికంబులు.
నన్నున్, నాచేతన్, నాతోడన్, నాకొఱకున్, నావలనన్, నాకంటెన్, నాకున్, మాలోపలన్, మాయందున్, వత్తున్, వచ్చెదన్, వచ్చెన్, వచ్చున్, వచ్చెడున్, ప్రసన్నులయ్యెడున్, కావుతన్, కొట్టుచున్, కొట్టఁన్, కొట్టఁగన్, కొట్టుడున్, కొట్టినన్, వలెన్, ఎంతయున్, పోలెన్, అయ్యున్ ఇత్యాదు లూహ్యంబులు.
కళలు
ద్రుతప్రకృతులు గాని శబ్దంబులు కళ లనంబడు
రాముఁడు, రాములు, హయము, విష్ణువు, గోడ, మేడ, అయ్య, అమ్మ, రామునికయి, జ్ఞానముఁబట్టి, నాయొక్క, వచ్చిరి, వచ్చితిని, వచ్చితిరి, వచ్చితిమి, రాఁడు, రారు, రాదు, రావు, రాము, కొట్టక, తిట్టక, ఎత్తిలి, ఒత్తిలి, ఊరక, మిన్నక, బళి, అక్కట, ఏల ఇత్యాదు లూహించునది
వచనాలు:
వచనం అనగా మాట, వాక్యము, సామెత, వేదవాక్కు, సూత్రములు అని అర్థం.
ద్వివచానాలు: ఏకవచనము, బహువచనము.
త్రివచానాలు: ఏకవచనము,ద్వివచనము,బహువచనము. (ద్వివచనము సంస్కృతంలోనే ఉంటుంది)
సంస్కృతంలో వచనములు మూడు విధములుగా ఉన్నాయి. తెలుగు భాషలో రెండు వచనములే ఉన్నాయి.
అవి. ఏకవచనము, బహువచనము.
ఏకవచనము :ఒక వస్తువును గాని, వ్యక్తిని గురించి తెలుపునది ఏకవచనము.ఒక సంఖ్యను తెలియజేసేది "ఏకవచనము". ఉదాహరణ: రాముడు, వనము. కొన్ని పదములు నిత్యైక వచనములుగా ఉపయోగించబడతాయి.
నిత్య ఏకవచనము :పంటలు, లోహములు మొదలైనవి నిత్య ఏకవచనములగును - వరి, బియ్యము, ఇనుము, రాగి.
బహువచనము :రెండు గాని, అంతకంటె ఎక్కువ వస్తువుల గురించి గాని, మనుషులను గురించి గానిచెప్పినది బహువచనము. ఉదాహరణ: బల్లలు, వనరులు. కొన్ని పదములు నిత్య బహు వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. పాలు, కందులు, పెసలు, మొదలైనవి.
వచనములు లేదా వచనాలు సంఖ్యలను తెలియజేసేవి.
నిత్య బహువచనము :ధాన్య వాచక శబ్దములు - కందులు, పెసలు, ఉలవలు.
ద్వివచనము:రెండు సంఖ్యను తెలియజేసేది "ద్వివచనము".
భాషా భాగములు
భాష:భాష అనే పదం భాష్అనే సంస్కృత పదం నుండి జన్మించింది. భాష అనగా మాట, ప్రతిజ్ఞ, ప్రమాణము, వ్యవహార యోగ్యమైన వాక్యాదికము, సంస్కృతాది భాష, బాస అని అర్థం.
భాగము: భాగముపాలు, వంతు, వాటా, భాగ్యము.వంతు, వాటా (కళింగ మాండలికం),
భాగం,వంతు (తెలంగాణ మాండలికం), సర్గ (రాయలసీమ మాండలికం)
భాషాభాగములు ఐదు. 1. నామవాచకము, 2. సర్వనామము, 3. విశేషణము, 4. క్రియ, 5. అవ్యయము.
నామవాచకము:
నామము:నొసట పెట్టుకొనెడు బొట్టు, నామధేయము.
నామ:పేరు అని సామాన్యార్థం. కాని,పాళీ బౌద్ధ వాఙ్మయంలో మనస్సు అనీ, మనస్తత్వమనీ అర్థాలు ఉన్నాయి. ఏక వచనంగా ధ్వనించే ఈ పదం నాలుగు విధాలైన మనోధర్మాలకు సమష్టిగా వర్తించే శబ్దం. అవి: వేదన, సంజ్ఞ, సంఖార (సంస్కార), విజ్ఞాన అనే ధర్మాలు. కొన్ని చోట్ల విజ్ఞానం వేరుగా ఉంది.లేఖ, చీటి, పత్రము, పత్రిక, ఉత్తరము, పొత్తము, చరిత్రము, ఇతిహాసము, కృతి, గ్రంథము.
వాచకము:వాక్యార్థమును తెలిపెడి శబ్దము, తరగతి పాఠ్యపుస్తకము, శబ్దము, చదువుట.
వచించు = మాట్లాడు, చెప్పు;
వక్త = మాట్లాడేవాడు; పండితుడు;
వచనం, వచస్సు = మాట;
వక్తవ్యం = మాటాడదగినది, తిట్టదగినది.
వచించు = చెప్పు
వాచికం = సమాచారం, వార్త, నోటితో పలికే తీరు;
వాచాలుడు, వాచాటుడు = వదరుబోతు, వాగుడుకాయ;
వాచ, వాకు, వాక్కు = మాట, పలుకు;
వాగ్మి = నేర్పుగా మాట్లాడేవాడు;
వాఙ్ముఖం = ఉపన్యాసం;
వాచస్పతి = బృహస్పతి;
వాచ్యం = స్పష్టమైన సూటి అర్థం, చెప్పదగినది, నిందించదగినది.
“పేరును తెలియజేయునది నామవాచకము. మానవుల యొక్క పేర్లను,జంతువుల యొక్క పేర్లను, ప్రదేశములు,వస్తువుల పేర్లను తెలియజేయునవి నామవాచకములు. నామవాచకములను విశేష్యములు అనికూడా అంటారు”.
ఉదా: రాముడు, పాఠశాల, విజయవాడ, బల్ల. ఈనామవాచకములు మరల నాలుగు విధములు.
సంజ్ఞావాచకము:రాముడు, గోదావరి.
జాతి నామవాచకము:చెట్టు, పర్వతాలు, గోడ.
గుణ నామవాచకము: తీపి, నలుపు, తెలుపు.
క్రియా నామవాచకము: వంట, నడక, చేత.
సర్వనామము:
సర్వము:అంత, అంతయు, అఖిలము, అనూనకము, అనూనము, అభోగము, ఎల్ల, ఎల్లది, నిఖిలము, నిరవశేషము, నిశ్శేషము, నెట్ట(న)(ణ)ము, న్యక్షము, పూర్ణము, మొత్తము, యావత్తు, రెప్పము, విశ్వము, సంగ, సంప(త్తి)(త్తు), సంపూర్ణము, సంపూర్తి, సకలము, సమగ్రత(ము), సమస్తము, సమష్టి.
సర్వ: సంపూర్ణము; సకలము; శివుడు; విష్ణువు.చిన్న బిందె.
“నామవాచకమునకు(పేరుకు) బదులుగా వాడబడేది సర్వనామము”.
సర్వులకు (అందరికీ) వర్తించే నామము సర్వనామము. ఉదా: నీవు, ఆమె, అతడు.
విశేషణం:
విశేషణము:గుణవాచక శబ్దము.
విశేషణ: దీనితో వస్తువులను, ద్రవ్యములను వేరు చేయుదురు. వ్యాకరణంలో కర్త, క్రియల యొక్క విశేషణము.
“నామవాచకము, సర్వనామముల యొక్క గుణములను తెలియజేయు పదములను విశేషణములు అంటారు”.
ఉదా: పొడవైన, ఎరుపు, తీపి.
క్రియ:చేయుట, చేష్ట, చేఁ, యత్నము, ఉపాయము, చికిత్స, ప్రాయశ్చిత్తము, విధము,ఆరంభము, పూజ. [భౌతికశాస్త్రము] పని. ఒక వస్తువు తనమట్టుకు తాను చలించునపుడుగాని లేదా దూరమున నున్న మఱియొక వస్తువు మీద తన ప్రభావమును చూపునపుడుగాని జరుగుపని.“పనిని తెలియజేయునది క్రియ”.
త్రివిధ క్రియలు:ప్రాణాయామమునకు సంబంధించిన క్రియలు-1. పూరకము, 2. కుంభకము, 3. రేచకము.
తెనుగుభాషలోని క్రియాభేదములు-1. ఉపకృతి క్రియలు (పోషించు మొ|.), 2. పరిణతి క్రియలు (జయించు మొ.), 3. సంవృతి క్రియలు (రంజించు మొ.)
"ఉపకృతి పరిణతి సంవృతిభేదాత్త్రివిధా క్రియా" [ఆంధ్రశబ్దచింతామణి 5-1]
(ఇ.) 1. మణిక్రియ, 2. మంత్రక్రియ, 3. ఔషధ క్రియ.
(ఈ.) (జఠరక్రియలు) 1. ఖల్వము, 2. క్షామము, 3. పూర్ణము
పనులన్నియూ క్రియలు. పనులను తెలిపు పదములను క్రియలు అంటారు.
ఉదా: చదువుట,తినుట
సకర్మక క్రియలు:
సకర్మక: పని చేయువాడు,వ్యాకరణంలో సకర్మక ధాతువు.
సకర్మక క్రియ:కర్మసాపేక్షితమైన క్రియావాచకపదము.
సకర్మకము:మంచిపని, ఒక గ్రహయోగము, [వ్యాకరణశాస్త్రము] కర్మము యొక్క ప్రశ్నను కలిగించు క్రియ.
ఉదా. రాముడు రావణుని చంపెను. (ఎవరిని చంపెనన్న ప్రశ్న కలుగుచున్నది, కాన చంపెను అన్న క్రియ సకర్మకము.)
“కర్మను ఆధారముగా చేసికొనియున్న క్రియలను సకర్మక క్రియలు అంటారు”.
ఉదా: మధు బడికి వెళ్ళెను.
అకర్మక క్రియలు: అకర్మకము: కర్మలేనిది, “కర్మముయొక్క ప్రశ్నను కల్గించని క్రియ”.
ఉదా. గ్లాసు పగిలెను. (ఇందు పగిలెను అన్నది కర్మను బోధించుటలేదు కాన అకర్మకము.)
అకర్మ: చేయదగని కార్యము.
“కర్మ లేకపోయినను వాక్యము అర్థవంతమైనచో అవి అకర్మక క్రియలు”.ఉదా: సోముడు పరుగెత్తెను.
సమాపక క్రియలు:సమాపకక్రియ = వాక్యమును పూర్తి చేయు క్రియ. వచ్చెను, రాగలడు, వచ్చుచున్నాఁడు మొదలగునవి.సమాపకము = చంపునది, పూర్తి చేయునది.
“పూర్తి అయిన పనిని తెలియజేయు క్రియలు సమాపక క్రియలు”.
ఉదా: తినెను, నడచెను.
అసమాపక క్రియలు:అసమాపకక్రియ = పూర్తికాని పనిని తెలుపు క్రియతిని, చదివి, తినుచు, చదువుచు మొ.
అసమాప్త: సమాప్తము కానిది.
“పూర్తికాని పనిని తెలియజేయు క్రియలు అసమపక క్రియలు”.
ఉదా: వ్రాసి, తిని.
అవ్యయములు:
“లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు”. ఈ పదాలు లింగ, వచన, విభక్తుల చేతమార్పులు చెందవు.
ఉదా: ఆహా! ఓహో! ఔరా!
కాలాలు
కాలాలు మూడు. 1. భూత కాలము, 2. భవిష్యత్ కాలము, 3.వర్తమాన కాలము.
భూత కాలము: జరిగిపోయిన పనిని (క్రియ) గురించి తెలుపుతుంది.
ఉదా. వెళ్ళాడు, పాడింది, రాసారు మొ.
భవిష్యత్ కాలము: జరుగబోయే పనిని (క్రియ) గురించి తెలుపుతుంది.
ఉదా. వస్తాడు, పాడతాడు మొ.
వర్తమాన కాలం: జరుగుతున్న పనిని (క్రియ) గురించి తెలుపుతుంది.
ఉదా. ఆడుతున్నాడు, పాడుతున్నాడు మొ.
లింగ భేదాలు
స్త్రీ పురుషాది జాతిభేదమును లింగము అంటారు.
తెలుగులో లింగములు మూడు. 1. స్త్రీ లింగము, 2. పుంలింగము, 3. నపుంసకలింగము.
వీటినే వరుసగా మహతీ వాచకము, మహద్వాచకము, అమహద్వాచకము అని అంటారు.
స్త్రీ లింగము:స్త్రీలను సూచించు నామవాచక సర్వనామ మరియు విశేషణ పదములు పుంలింగములు.
ఉదా.సీత, మాత, ఆమె, గుణవంతురాలు మొ.
పుంలింగము: పురుషులను సూచించు నామవాచక సర్వనామ మరియు విశేషణ పదములు పుంలింగములు.
ఉదా. రాముడు, కృష్ణుడు, ఏసు, అతడు, ఇతడు, గుణవంతుడు మొ.
నపుంసకలింగము: స్త్రీ పురుష భేదము తెలియపరచకుండా వుండు నామవాచక, సర్వనామ, విశేషణ పదములు నపుంసకలింగములు. (వృక్షములు, జంతువులు, చలనములేని వస్తువులు మొ.)
ఉదా. గోవు,వృక్షము, బల్ల, పుస్తకము, జ్ఞానము, తనువు, సౌందర్యము మొ.
పురుషలు
ఉత్తమపురుష: నేను ఉత్తమపురుష, మధ్యమపురుష: నీవు మధ్యమపురుష, ప్రథమపురుష: తనుప్రథమపురుష
ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష. ఎదురుగా వినేవ్యక్తిమధ్యమపురుష. ఎవరికోసమైతే మాట్లాడుతున్నామో తను ప్రథమపురుష.
అర్థాలు
అర్థము: అర్థము అనగా శబ్దముచే బోధ్యమైనది- శబ్దార్థము; ఇది వాచ్య లక్ష్య వ్యంగ్యరూపమున త్రివిధము,
వస్తువు,ఇంద్రియములచే గ్రహింపఁబడు విషయము - శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, శబ్దార్థము, ఇంద్రియార్థము, ధనము(పురుషార్థములలో) రెండవది. కారణము, కార్యము, వస్తువు, నివృత్తి,
యాచన, న్యాయము, వ్యవహారము, ప్రకారము అని అర్థాలున్నాయి.
పురుషార్థములు:ధర్మార్థకామమోక్షములు (1. ధర్మము, 2. అర్థము, 3. కామము, 4. మోక్షము.)
ఇంద్రియములు:జ్ఞానద్వారములు.
జ్ఞానేంద్రియములు :త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము.
కర్మేంద్రియములు :వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ.
మనస్సు తోడంగూడ ఏకాదశేంద్రియము లనంబడు.
త్రివిధ ఇంద్రియములు:1. జ్ఞానేంద్రియములు (చక్షురాదులు), 2. కర్మేంద్రియములు (పాణిపాదాదులు),
3. అంతరింద్రియములు (మనోబుద్ధ్యహంకారములు).
జ్ఞానేంద్రియములు: 1. శ్రోత్రము, 2. చర్మము, 3. చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక.
కర్మేంద్రియములు: 1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ.
కర్మేంద్రియములు(5), జ్ఞానేంద్రియములు(5),చతురంతఃకరణములు (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము)
త్రివిధ అర్థములు:(శబ్దముల అర్థములు) - 1. వాచ్యార్థము (అభిధావృత్తిచే చెప్పబడునది), 2. లక్ష్యార్థము (లక్షణావృత్తిచే చెప్పబడునది), 3. వ్యంగ్యార్థము (వ్యంజనావృత్తిచే చెప్పబడునది).
"అర్థో వాచ్యశ్చ లక్ష్యశ్చ వ్యంగ్య శ్చేతి త్రిధా మతః" [సాహిత్యదర్పణము 2-2]
వాచ్య/వాచ్యము:చెప్పఁదగినది, నిందింపఁదగినది, అభిధచేఁ దెలియఁదగిన యర్థము, చెప్పుటకు యోగ్యమైనది, దూషింపబడునది.
లక్ష్య:గుఱి, లక్షణచేఁ దెలియఁదగిన యర్థము, లక్ష్యము,గురి, ఉద్దేశము,లెక్క, సంఖ్య, గణన.
లక్ష్యము:గుఱుతుచే తెలియఁదగినది, మర్యాద, చూడదగిన, విచారింపదగిన, ఉద్దేశము,దృష్టాంతము
వ్యంగ్య:వ్యంజనావృత్తిచేఁ దెలియఁదగిన యర్థము, వికట, వెంగళి,వెఱ్ఱి, మూఢుఁడు.
వ్యంగ్యము:ఎత్తిపొడుపు, వేళాకోళము, నింద్యము, ఒక అర్థభేదము, గూఢము.
అభిధ:ఒక శబ్దవృత్తి (సంకేతితములగు పదపదార్థముల సంబంధము), పేరు, ఒకానొక శబ్దశక్తి, అభిధ-లక్షణ-వ్యంజన అను శబ్ద శక్తులు మూఁడింటిలో మొదటిది,ఇది పదమునకున్నట్టి సంకేతితార్థమును తెలుపునది, శబ్దముయొక్క సంకేతితార్థము (వాచ్యార్థము)ను తెలుపుశక్తి, (అభిధ, లక్షణ, వ్యంజన అని శబ్దశక్తులు మూఁడు.)
లక్షణ:ఒక శబ్ద వృత్తి, గుఱి, గుఱుతు, చూపు, వ్యాకరణాది శాస్త్రము, పేరు, బెగ్గురు (పురాణమునకుఁగల పంచలక్షణములు. - సర్గము, ప్రతిసర్గము, వంశము, మస్వంతరము, వంశానుచరితము.),మద్రదేశపురాజు అగు బృహత్సేనుని కూఁతురు. కృష్ణుని భార్యలలో ఒకతె, లక్కుమనుఁడు(సౌమిత్రి-లక్ష్మణుడు).
వ్యంజన:ఒక శబ్దవృత్తి, స్పష్టము చేయుట,ప్రకటించుట, కూర, ఆలుమగల గుఱి,గుఱుతు,మీసము,హల్లు, అన్నాదులను దీనితో కలుపబడును,తొక్కు, పచ్చడి మొదలగునవి.
“అభిధ అంటే పేరు అని అర్థం. ఒక శబ్దానికి సందర్భంతో ప్రమేయం లేకుండా సూటిగా నిఘంటువు ఏ అర్థం ఇస్తుందో అది అభిధ. ఒక శబ్దం ఇచ్చే అర్థంలోని కొన్ని లక్షణాలను పురస్కరించుకొని వచ్చే విశేషార్థం. సందర్భంతో దీనికి ప్రమేయం ఉంటుంది. అభిధార్థం(వాచ్యార్థం), లక్షణార్థం(లక్ష్యార్థం), రెండూ అన్వయించిన తర్వాత శబ్దానికి ఇంకా ప్రసారం వున్నప్పుడు వచ్చే మూడో అర్థం వ్యంజన. ఈ వ్యంజనావృత్తినే ధ్వని అంటారు”.
పర్యాయ పదాలు
పర్యాయ:క్రమము; సమానార్థకపదము.
ఒకే అర్థాన్ని ఇస్తూ, అనేక పదాలు ఒక దానికి వాడటాన్ని పర్యాయ పదం. అర్థం ఒకటే, కానీ ఆ అర్థాన్నిచ్చే పదాలు మాత్రం అనేకం. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటారు. ఒకే అర్థమునిచ్చు వివిధ పదములను పర్యాయపదములు అంటారు.
తనయుడు = కొడుకు, పుత్రుడు, సుతుడు,
తరువు= చెట్టు, వృక్షము, మహీరుహము
జలధి = కడలి, అర్ణవము
పర్వం = పబ్బం, పండుగ, వేడుక
నానార్థాలు
నానా: చాలా రకములు. అనేకము; పలు రకములు; పలు విధములు.
నానార్థ: అనేక ప్రయోజనములు కలవాడు; అనేకార్థములు గల కావ్యము.
పదం ఒకటే ఉండి అనేక అర్థాలు ఉండేదాన్ని నానార్థాలు అని అంటారు. ఒక పదానికుండే వేరు వేరు అర్థాలను నానార్థాలు అనవచ్చు.
పదం ఒకటే - అర్థాలు మాత్రం విడివిడిగా అనేకం ఉంటాయి
క్రియ=పని, చేష్ట, శ్రాద్ధము, ప్రాయశ్చిత్తము, చికిత్స
లావు= బలము, సమర్ధత, గొప్పతనము
వ్యతిరేక పదాలు
వ్యతిరేక: వేఱు, మాఱు,ఒక యర్థాలంకారము, ఏ విషయమున కైనను విరుద్ధము.
ఒక పదమునకు వ్యతిరేకమైన అనగా విరుద్ధమైన అర్థమును ఇచ్చు పదాలను వ్యతిరేక పదాలు అనవచ్చు.
ఉదా. ఆరోగ్యము x అనారోగ్యము, నాగరికత x అనాగరికత, జ్ఞానము x అజ్ఞానము.
ప్రకృతి - వికృతులు
వికృతి: మార్పు చెందినది, వికారము చెందినది, చిత్త విక్షేపము,రోగము, ఇరువది నాల్గవ సంవత్సరము, వికారము, విస్మృతి, [భౌతికశాస్త్రము] బలప్రయోగము వలన ఒక వస్తువు ఆకారమునందు తేబడిన మార్పు. ఒక ప్రతిబలముచే ఒక వస్తువులో గోచరించు విరూపత యొక్క విస్తారము. బహిర్బలముల కారణముగ ఒక ఘనపదార్థమునకు సంభవించు వికార రూపము.
ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు - అని మన పూర్వీకుల అభిప్రాయం. సంస్కృత భాషలో నుండే ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం. సాధారణంగా మనం వాడుకునే తెలుగు మాటలు చాలావరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి. అలాగే కొన్ని పదాలు ప్రాకృత భాషల నుండి వచ్చాయని వ్యాకరణ వేత్తలు తెలియచేశారు.
సంస్కృతంతో సమానమయిన పదాలను తత్సమాలని, సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలని అన్నారు. ఇలాంటి తత్సమ తద్భవ శబ్దాలను మనం వికృతులు గాను, సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రాకృతులు లేదా ప్రకృతులు గాను చెప్పుకుంటున్నాము. తెలుగు భాషలో చాలా ప్రకృతి వికృతులుగా ఉన్నాయి. తెలుగు నిఘంటువులు వీటిని ఆకారాది క్రమంలో చూపిస్తాయి.
తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు:
ప్రకృతి - వికృతి
భాష - బాస
విద్య - విద్దె
ఆకాశం - ఆకాశం
ధర్మము - దమ్మము
వ్యుత్పత్త్యర్థము
అవయవార్థము (పదముయొక్క వ్యుత్పత్యర్థము).
వ్యుత్పత్తి:శాస్త్రాదిజన్య పరిజ్ఞానము,శబ్దసంభవ ప్రకారము, విశిష్టోత్పత్తి,మూలము,పదవ్యుత్పత్తి, వ్యుత్పత్త్యర్థము, పాండిత్యము.
వ్యుత్పన్న:శాస్త్రాదిజన్య పరిజ్ఞానము కలవాఁడు, పుట్టించబడినది,శబ్దార్థ నిర్వచనము చేయబడ్డది.
“పదము లేదా శబ్దము యొక్క అర్థమును లేదా అది పుట్టిన విధమును వివరించునది వ్యుత్పత్త్యర్థము”.
ఉదా. విద్యార్ధి - విద్యను అర్థించువాడు (శిష్యుడు), అసురులు - సురులు కానివారు (రాక్షసులు).
జాతీయములు
జాతి: కులము, పుట్టుక, సామాన్యము, ఒక అర్థాలంకారము, పద్యభేదము, ప్రొయ్యి, జాజికాయ, జాజి, ఉసిరిక.
(పరుషజాతులు నాలుగు. - భద్రుఁడు, దత్తుఁడు, కూచిమారుఁడు, పాంచాలుఁడు.స్త్రీ జాతులు నాలుగు.- పద్మిని, హస్తిని, శంఖిని, చిత్రిణి.పదునెనిమిది జాతులు - బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వ్యావహారిక, గోరక్షక, శిల్పక, పంచాణ, కుంభకార, తంతువాయ, క్షౌరక, రజక, వస్త్రచ్ఛేదక, చర్మకార, తిలఘాత, లుబ్ధక, చండాల, మాతంగజాతులు.)[జీవశాస్త్రము] గణము, ప్రాణులలో కొన్ని ఉపజాతులు కలసి ఒక జాతిగా వర్గీకరింపబడినది.
[చరిత్ర; రాజకీయశాస్త్రము] ఒక దేశములో నివసించుచు సాధారణముగ ఒకే తెగకు చెంది ఒకే భాష, సంస్కృతి, ఆచారములు కలిగి ఒకే రాజకీయ ఆర్థిక వ్యవస్థలో నుండు జనులు.దీనిలో పుట్టుదురు. కులము.ప్రాణులలో వుండునది. గోత్వ-బ్రాహ్మణత్వాది జాతి.పిత్రాది సంతానరూపమైన గోత్రము. వాది వాదనను కారణము లేకుండా ఖండించు వచనము; ఒక అలంకారము; షడ్జాది సప్తస్వరాలు; మాలతి; జాతి పుష్పము.
జాతీయ: జాతిలో పుట్టినవాడు,సజాతీయుడు,వ్యాకరణ శాస్త్రంలో ప్రకారార్థమునిచ్చు ప్రత్యయము.
జాతీయకరణము: ఒక పరిశ్రమను కాని, వ్యాపారమును కాని ప్రభుత్వరంగములోనికి తీసికొనుట, లేక దాని పరిపాలనమును ప్రభుత్వము వశపరచుకొనుట (ప్రయివేటు వ్యక్తుల ఆధీనంలోని సంస్థలను)
జాతీయము: మాండలికం, స్థానిక ఉచ్ఛారణ.