7వ పాఠము - శతక మధురిమ - 10వ తరగతి - తెలుగు వాచకం

7వ పాఠము - శతక మధురిమ - 10వ తరగతి - తెలుగు వాచకం

10వ తరగతి - తెలుగు వాచకం

7వ పాఠము - శతక మధురిమ




పాఠం ఉద్దేశం

సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.


పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది శతకాలలోని పద్యాలను ముక్తకాలు అంటారు ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది శతకాల్లో మకుటం సాధారణంగా పద్య పాదం చివర ఉంటుంది అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి ఈ పాఠ్య భాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంక రామేశ్వర, వేణుగోపాల శతక పద్యాలు ఉన్నాయి.


కవి పరిచయాలు


1. సర్వేశ్వర శతకం రచయిత యథావాక్కుల అన్నమయ్య 13వ శతాబ్దం. ఇతని శైలి ధారాళమైనది.


2. శ్రీకాళహస్తీశ్వర శతకం రచయిత ధూర్జటి. 16వ శతాబ్దం ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరు.


3. మల్లభూపాలీయం రచయిత ఎలకూచి బాలసరస్వతి. నాగర్ కర్నూల్ జిల్లాలోని జటప్రోలు సంస్థానాధీశుడు అయిన సురభి మాధవ రాయల ఆస్థాన కవి. తెలుగులో మొదటి త్యర్ధి కావ్యమైన రాఘవయాదవపాండవీయంను రాశాడు. భతృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించిన తొలి కవి.


4. దాశరధి శతకం రచయిత రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న. గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నివాసి. భద్రాచలంలో శ్రీ రామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు. శ్రీరాముని పై ఎన్నో కీర్తనలను రచించిన వాగ్గేయకారుడు.


5. నరసింహ శతకం రచయిత కాకుత్థ్సం శేషప్ప కవి. ఇతని రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన సామాజిక స్పృహ కనిపిస్తుంది.


6. విశ్వనాథేశ్వర శతకం రచయిత గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మ. 300కు పైగా అష్టావధానాలు చేసి ‘అవధాని. శశాంక ఆశుకవితా కేసరి’ అన్న బిరుదు పొందాడు.


7. శ్రీ లొంకరామేశ్వర శతకం రచయిత నంబి శ్రీధరరావు. ఇతనికి కవిరాజ అను బిరుదు కలదు.


8. వేణుగోపాల శతకం రచయిత గడిగె భీమకవి. వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అబ్బడం విశేషం.


ప్రవేశిక

మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి? ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? స్నేహితులు ఎట్లా ఉంటారు? భగవంతుని గుణాలు భక్తులతో ఎట్లా ఉండాలి? కీర్తిమంతుడు ఎవరు? మనుషుల్లోని రాక్షస గుణాలు ఏవి? అని తెలుపుతూ వివిధ శతక కర్తలు రాసిన పద్యాలను ఈ పాఠంలో గలవు.


కంఠస్థ పద్యాలు - తాత్పర్యాలు


మ. భవదీయార్చన సేయుచోఁ ప్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెం

      డవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా  సమో

      త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో

      గవిధానం బవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా !                                   1


     సర్వేశ్వరా! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ. మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తియోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవుకదా!


శా. ఊరూరం జనులెల్ల బిక్షమిడరో, యుండం గుహల్గల్గవో

     చీరానీకము వీధులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః

     పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీవోపవో

     చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!                                       2

     శ్రీకాళహస్తీశ్వరా! తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలున్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపసులను కాపాడడానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు.


మ. సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లు బుధుండౌదలన్

      గురుపాదానతి కేల నీగి చెవులందున్విన్కి వక్ర్తంబునన్

      స్థిర సత్యోక్తి భుజంబులంన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో

      హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా! నీతి వాచస్పతీ!                               3


       నీతిలో బృహస్పతి అంతటి వాడవైన ఓ సురభిమల్లా! తలవంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగిన వాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనసు నిండా మంచితనం కలవాడైన పండితుడు సంపదలు లేకున్నా  ప్రకాశిస్తాడు.


ఉ. భండనభీముఁ డార్థజన బాంధవుఁ డుజ్వల బాణతూణ కో

    దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్

    రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా

    డాండ డడాండడాండ నినదంబులజాండము నిండ మత్తవే

    దండము నెక్కి చాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!                               4


     దశరథుని కుమారా! దయాసముద్రునివైన శ్రీరామా! నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరుడవు, దుఃఖాలు పొందే వారి పాలిట బంధువువు, కాంతివంతమైన బాణాలు, అమ్ములపొది, కోదండము కలిగి, ప్రచండ భుజ తాండవ ధనుర్విద్యాకళలో కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరులేరని మదించిన ఏనుగునెక్కి ఢంకా మోగిస్తూ భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను!


సీ. హరిదాసులను నిందలాడకుండినఁ జాలుఁ

                              సకల గ్రంథమ్ములు చదివినట్లు

     బిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ

                              జేముట్టి దానంబు చేసినట్లు

     మించి సజ్జనుల వంచింపకుండినఁ జాలుఁ

                              నింపుగా బహుమాన మిచ్చినట్లు

     దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలుఁ

                              గనకకంభపుగుళ్ళు గట్టినట్లు


తే.గీ. ఒకరి వర్షాశనము ముంచకున్నఁ జాలుఁ

        బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు

        భూషణవికాస! శ్రీధర్మపురి నివాస!

        దుష్టసంహార! నరసింహ! దురితదూర!                                             5


    అలంకారాలచేత శోభిల్లేవాడా! ధర్మపురిక్షేత్రంలో వెలసిన వాడా! దుష్టులను సంహరించేవాడా! పాపాలను దూరంచేసేవాడా! నరసింహా! విష్ణుభక్తులను నిందించకుండా ఉంటేచాలు, అనేక గ్రంథాలను చదివినట్లే, బిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటేచాలు. గొప్ప బహుమతిని ఇచ్చినట్లే, దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటేచాలు, బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడికట్టించినట్లే, ఇంకొకరి 'వర్షాశనాన్ని' (ఒక ఏడాదికి సరిపడా భోజనాన్ని) ముంచకుంటేచాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.


మ. ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వంసహా

      జన దైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీ

      వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో

      అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా! విశ్వనాథేశ్వరా!                     6

     విశ్వనాథేశ్వరా! త్యాగం తో కూడిన దీక్షను పోనీ జనులందరి దీనస్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైన ఆనందకరమైన జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు.


శా. పొత్తంబై కడునేర్పుతో హితము నుద్భోదించు మిత్రుండు, సం

     విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా

     యత్తంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రో

     చిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీ లొంకరామేశ్వరా!                        7


     ఓ లొంక రామేశ్వరా! మిత్రుడైన వాడు పుస్తకంమాదిరిగా మిక్కిలినేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్య సఫలతలో విలువైన ధనంవలె ఉపకరిస్తాడు. శత్రునాశనంనాశనంలో స్వాధీనమైన కత్తివలె సహాయపడుతాడు. నిండు  మనస్సై సుఖాన్నిస్తాడు.


సీ. కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు

                             మాయమాటల సొమ్ము దీయువాడు

    కులగర్వమున పేద కొంపలార్చెడివాడు

                             లంచంబులకు వెల బెంచువాడు

    చెడు ప్రవర్తనలందు జెలగి తిరుగువాడు

                             వరుసవావికి నీళ్ళు వదులువాడు

    ముచ్చటాడుచు కొంప ముంచ జూచెడివాడు

                             కన్నవారల గెంటుచున్నవాడు


తే.గీ. పుడమిలో నరరూపుడై పుట్టియున్న

       రాక్షసుడు గాక వేరౌన రామచంద్ర!

       కృపనిధీ! ధరనాగరకుంటపౌరి!

       వేణుగోపాలకృష్ణ! మద్వేల్పు శౌరి!                                                 8


       దయకు నిధివంటివాడా! నాగరకుంట పురమునందు కొలువైనవాడా! వేణుగోపాలకృష్ణా! నా దైవమా! శౌరీ! కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావివరుసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడుగాని వేరొకడుగాడు కదా!




0/Post a Comment/Comments