10వ తరగతి - తెలుగు వాచకము
3వ పాఠం - కొత్తబాట
పాఠ్యాంశ వివరణ
భూస్వామ్య, పెత్తందారీ, కర్కష విషపు కోరల్లోంచి, మూఢనమ్మకాలు ముసుగులోంచి, అంటరానితనపు ఆకృత్యాల నుండి అప్పుడప్పుడే బయటపడుతూ, బడుగు బలహీన వర్గపు ప్రజల జీవితాల్లోకి కొత్త వెలుగులు ఎలా ప్రకాశించాయో వస్తున్న మార్పుల్ని సమసమాజం స్థాపన దిశగా పయనిస్తున్న విధానాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించే కథానిక.
ప్రక్రియ
కొత్తబాట పాఠ్యభాగం కథానిక ప్రక్రియకు చెందింది. కథానిక చిన్నదే కావచ్చు కానీ, అది సువిశాల ప్రపంచంలో సమైక్య జీవన విధానాన్ని ప్రోత్సహిస్తుంది. మానవత్వాన్ని వెలిగిస్తుంది.
"కథ్" అనే ధాతువునుండి "కథ" అనే పదం పుట్టింది. దీనికి సంభాషించుట, చెప్పుట అనే అర్ధాలున్నాయి. అగ్ని పురాణంలో కథానిక ప్రస్తావన ఉందనీ, సంస్కృతంలో ఇతివృత్త భేదాన్ని బట్టి "కథా, ఆఖ్యాయికా, ఖండకథా, పరికథా" అనే భేదాలున్నాయని చెబుతారు. ఈనాడు తెలుగులో "కథ", "కథానిక" అనే పదాలు సమానార్ధకంగా వాడబడుతున్నాయి. ఇవి ఆంగ్లంలో "Short Story" అనే ప్రక్రియకు పర్యాయాలుగా వాడబడుతున్నాయి.
కవిపరిచయం
కొత్తబాట అనే ఈ పాఠ్యభాగ రచయిత పాకాల యశోదారెడ్డి గారు. ఈవిడ ‘తెలుగులో హరివంశాలు’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. యశోదారెడ్డి గారు రాష్ట్ర అధికారభాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం ‘మహాలక్ష్మి ముచ్చట్లు’ ఎంతో ప్రజాదరణ పొందింది. ఇంకా ఎన్నో పరిశోధనా గ్రంథాలను మరియు కథా సంపుటాలను వెలువరించారు. కొత్తబాట పాఠ్యభాగం ‘నేషనల్ బుక్ ట్రస్ట్’ వారు ప్రచురించిన ‘యశోదారెడ్డి ఉత్తమ కథలు’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది.
సారాంశం
అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింప బడ్డాయి.
'నేను రాన్రా తమ్ముడు!' అని అక్క తమ్మునితో ఎంత జెప్పిన గాని వినకుండా, పట్టిన పట్టు విడవ కుండా ఎంటబడ్డడు. అక్క పయనమై బండెక్కి బయలు దేరింది. వసదాగిన పిట్టోలె ఒకటే చెప్పుక పోతుండు తమ్ముడు. అక్క ఎంత సేపటికీ మాట్లాడపోయే సరికి
ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు? అంటడు.
చెట్ల పచ్చదనం, పువ్వుల సోయగం, చింతలు, యాపలు, మావిళ్ళ సింగారం గూర్చి తమ్ముడు చెబుతూ ఉండగానే మాటల్లో ఊరి పొలిమేర రానే వచ్చింది. బాటకు ఇరు వైపుల గుబుర్గ వెరిగిన వాయిలు పొదలు, ఎదిగి వస్తున్న కొత్తచెట్లు, ఆయకట్ట కట్టడం వలన నీలసముద్రమోలె నిండుగ వున్న చెర్వు, గవిండ్ల గుడ్డెలుగులు, చిర్తగండు, తాచుపాము, నక్కలు అన్నీ కనబడుతున్నయి.
కొత్తబాటేసినం అంటే అక్క నమ్మలేదు. తరాలనాటి బాట కయ్యలు గట్టి, గండ్లు వడిన బాట. ఆ వొంపులల్ల, వొర్రెలల్ల వడి నడుసుకుంట వోవలంటే కాళ్ళు బెణికేది. బండ్లో కూసుంటే నడుములిరిగేవి. అలాంటిది హాయిగా ఊరి పొలిమేర రానె వచ్చింది.
ఊర చెరువు, మత్తడి, పసుల కొట్టాలు, ఎల్లమ్మ గుడి, పూజారి కిష్టమాచారి ఇల్లు దాటగానే గోపాల్రాయని భవంతి బంగుల, రావి చెట్టు కింద రచ్చకట్ట అన్నింటా మార్పు కొట్టచ్చినట్లు కనబడుతుంది.
గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్థి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపిన శ్రీమంతుడు రంగరాయని రెండంతస్తుల గచ్చు భవంతి, తరువాత వారి పాలోండ్ల ఇండ్లు, వాళ్ళ బావ పోలీసు పటేలు పాపిరెడ్డి ఇద్దరూ ఇద్దరే. హనుమంత రాయుడు కుటిల వాజి. బండి వాళ్ళ ఇంటి మూల దిరుగంగనే వాళ్ళ పెదమామ ఇంటిపొంటి ...... మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లులో అదే గరిసెల ఇండ్ల దీపాలు, మనుసులు మెసలడం కనబడింది.
బండి ఇంటి కమాను ముందర ఆగింది. పిల్లలందరూ వచ్చి సుట్టూ జేరిండ్రు, బండి దిగి బంకులు దాటి ఇంట్లకు నఢ్సిన అలవాటు సొప్కున బాయి కాడి గచ్చుల్లకు నడ్సింది. అక్కడ వొనమాలి లేదు అక్కా అని విల్సుకుంటూ కుసుమ నీళ్ళ చెంబు అందిచ్చింది. రెండు చేతులతో ఆ పాలేరు రాజని బిడ్డను ఎత్తుకుంది. కుసుమ అని పేరు పెట్టింది తనే. తమ్ముడు బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలవడ్డడు.
కొత్తబాట పాఠం ప్రకారం
మారుతున్న సమాజంలో..
- ఊరికి వెళ్ళే బాట సక్రమంగా ఉండేది కాదు. ఆ బాటపై ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నపని.
- కొత్తబాట వేయడం వలన ప్రయాణం సుగమమైంది. యిబ్బందులు లేకుండా సులభంగా, సుఖంగా సాగుతుంది. కాని బాటకిరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లు తొలగించబడ్డాయి. కొత్తచెట్లు నాటారు.
- చెరువుకు ఆయకట్ట కట్టడం వలన చెరువు నీటితో నిండి ఊరంతటికీ ఆధారమైంది.
- ఉన్నత వర్గాల స్త్రీలు బండి లో వెళ్ళినప్పుడు, బండి ఊళ్లోకి రాగానే వారు ఎవరికీ కనబడకుండా బండికి ఉన్న యెర్ర పర్దాలు కిందికి దించేవారు.
- రచ్చండకు దూరంగా నిలబడే జనాలు, రచ్చబండ పై కూర్చునే స్వాతంత్ర్యం లభించింది.
- మూఢనమ్మకాలను పెంపుజేసి, మిత్తి పూజలు జేసి శ్రీమంతులైన వారి మీద ప్రజలు తిరుగబడితే వారు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి బంగ్లాలల్లో దీపంపెట్టే దిక్కులేక దుమ్ముకొట్టుకొనిపోయాయి.
- ఒకణ్ణి ఎక్కించి, ఒకణ్ణి దించి ఇద్దర్ని ఎదగనీయకుండా జేసే నక్కజిత్తుల కుటిలవాజీలు లేరు.
- పంచాయితీలకు దండుగలు గట్టడంలేదు.
- దొంగతనాలు, పంటచేలల్లో దోపిడీలు లేవు.
- ఎంతటి వారికైనా సరే మనుషులు మోసే మ్యాన పల్లకీలు లేవు. పగటి దీపాలెలిగిచ్చి చేసే ఊరేగింపులు లేవు.
- మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లు రాత్రిబడిగా మారింది.
- పిల్లలకు సీముడు ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సు కండ్లు లేవు. పిల్లలందరు దోస పండ్లోలె ఉంకుచండ్లోలె కళకళలాడుతున్నారు.
- యజమానులు, పాలేరులు అని తేడాలేకుండా కలిసి మెలిసి ఒక ఇంటిలోని వారి వలె ఉంటున్నారు.
ముగింపు
ఒకప్పటి పెద్దరికం, పెత్తందారీతనం, మూఢనమ్మకాల ముసుగులో జరిగే దోపిడీలు పోయి సమసమాజ స్థాపన దిశగా నూతన సమాజ నిర్మాణానికి కొత్తబాట వేయబడింది. ఇది కొత్తకొత్త బాటలు వేయడానికి కొత్త తరాన్ని నిర్మించడానికి నాందీ భూతం.