ఆడపిల్ల ఓ సృష్టి ప్రదాత ---డా వి.డి రాజగోపాల్

ఆడపిల్ల ఓ సృష్టి ప్రదాత ---డా వి.డి రాజగోపాల్




ఆడపిల్ల ఓ సృష్టి ప్రదాత

ఆడ పిల్లలు సృష్టి ప్రదాతలు
అమ్మానాన్నల వడిలో పెరిగి
క్రమంగా అందానికి ప్రతిరూపమై
పెళ్లి తంతుతో మరో ఇంట ప్రవేశించి
ఆ ఇంటి కోడలు పాత్రలో ఇమిడి
భర్త అనే సహచరునితో  సహచర్యం
సంసారం అనే బంధం ఏర్పరుచుకొని
పుట్టినింటి ప్రేమలు మమకారాలు
మనసులో పదిలంగా ఉంచుకొని
పండుగపబ్బాలకో శుభకార్యాలకో
చుట్టపు చూపుగా పుట్టింటి గడప చేరి
ఆయింట్లో ప్రేమ పరిమళాలు వెదజల్లి
అమ్మనాన్నలకు తను ఎలా ఉన్నా
అత్తింటి కష్టాలు మనసున ఉంచుకొని
చిన్నపాటి విషయాలు  గొప్పగా చెప్పి
అక్కడా ఇక్కడా ఆప్యాయతలు పంచి
పిల్లల పెంపకం అనే బాధ్యతతో
అన్ని మరచి జీవనం సాగిస్తున్న
ఓ అమ్మాయిల్లారా!
ఓ తల్లులారా! 
ఓ అక్కల్లారా!
ఓ చెల్లెల్లారా!
ఓ మహిళల్లారా!

కూతురై పుడతారు
సోదరై ప్రేమ పంచుతారు
కోడలిగా కొలువు తీరి
భార్యగా అన్నీ భరిస్తారు
తల్లిగా అలరిస్తారు
కొడుకులను వెనుకేసుకొస్తారు
కష్టాలెన్నో పడతారు
అవమానాలు లెక్క చేయక
కడవరకు ప్రేమనే కురిపించే
ప్రేమామృతం మీరు
అవసాన దశలో అమ్మానాన్నలు
కొడుకుల ఆదరణకు నోచుకోకపోయినా
వారింట ఓ కొడుకు అవతారమెత్తి
సేవచేసే  అపరూప స్వభావం మీది

కూతుర్ల దినం అట నేడు
మిమ్మల్ని ఓ మారు తలచుకుంటూ...

ప్రేమతో .....ఓ తండ్రి

---డా వి.డి రాజగోపాల్





0/Post a Comment/Comments