రచయితలు అమ్ముడు పోతున్నారన్న విమర్శ మధ్యన ఆత్మగౌరవాన్ని కాపాడుకో వలసిన బాధ్యత సాహిత్య రంగం పై ఉన్నది. - వడ్డేపల్లి మల్లేశము

రచయితలు అమ్ముడు పోతున్నారన్న విమర్శ మధ్యన ఆత్మగౌరవాన్ని కాపాడుకో వలసిన బాధ్యత సాహిత్య రంగం పై ఉన్నది. - వడ్డేపల్లి మల్లేశము

రచయితలు అమ్ముడు పోతున్నారన్న విమర్శ మధ్యన ఆత్మగౌరవాన్ని కాపాడుకో
 వలసిన బాధ్యత సాహిత్య రంగం పై ఉన్నది.

- వడ్డేపల్లి మల్లేశము, 9014206412.
      ప్రజల, విభిన్న వర్గాల, సమాజ హితాన్ని కోరే సాహిత్య రంగానికి ప్రతినిధులుగా ఉన్న కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, బుద్ధిజీవులు, సామాజిక కార్యకర్తలు ఏ రకంగా ను రాజీ పడటానికి వీల్లేదు. ప్రజల పక్షాన నిలిచి గెలవాల్సిన రచయితలు కవులు కలలో కూడా స్వార్థ ప్రయోజనాలకు పాల్పడడం కానీ ప్రభుత్వానికి అమ్ముడుపోవడం కానీ చేయకూడదు.

       వివక్షతలు, అసమానతలు, అంతరాల తో కూడిన అసమ సమాజంలో సమ సమాజ స్థాపన లక్ష్యంగా పని చేయడం ద్వారా సాహిత్య రంగం నిరంతరం ప్రజల పక్షాన నిలవాల్సివుంటుంది. సమాజాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తూ సమస్యలకు పరిష్కారాలను వెతికే క్రమంలో కష్టజీవికి ఇరువైపులా ఉండే వాళ్ళు కవులు రచయితలు. మరో మాటలో చెప్పాలంటే అన్నార్తులు, శరణార్థులు చీకట్లో,మురికి కూపాల్లో మగ్గుతున్న వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత వీరిదే.

   రచయితల్ని  కొంటున్న ప్రభుత్వాలు:

           తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015 జూన్ 2వ తేదీన జరిగిన తొలి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేల కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కవి సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాటి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కవులు, రచయితలు, కళాకారులు ప్రజల పక్షాననే ఉండాలి కానీ ప్రభుత్వ పక్షాన కాదు. అని స్పష్ట మైనటువంటి మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుతము ఈటెల రాజేందర్  శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్న విషయం మీకందరికీ తెలిసిందే.      తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కవులు, రచయితలు, గాయకులకు కొందరికి సాంస్కృతిక సారథి లో ఉద్యోగాలు రాగా మిగతా పేరుగాంచి ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన అనేక మంది రచయితలు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి అనుకూలంగా కొనసాగుతున్న విషయాన్ని విమర్శకులు ఎత్తిచూపారు. ఇటీవల సాహిత్యరంగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కార గ్రహీత ప్రముఖ కవి నిఖిలేశ్వర్ ఢిల్లీలో తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు రచయితల్ని  కొంటూ సాహిత్య రంగాన్ని నిర్వీర్యంగా మారుస్తున్నాయని చేసిన ఘాటైన విమర్శను సమకాలీన సాహిత్య రంగం ఆలోచించవలసిన అవసరం ఉన్నది.

        రెండు రాష్ట్రాల్లోనూ సాహిత్యరంగంలో రచయితలు దారి తప్పి పోతున్నారని పదవులు అధికారానికి అమ్ముడుపోయి స్థభ్దులుగా మారి పోతున్నారని ఆక్షేపణ చేశారు. పాలకులు శాసన సభ్యులతో పాటు కవులను కూడా కొంటున్నారని సమాజ పతన  దశకు నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

     సాహిత్యరంగం ఎలా ఉండాలి?

        రచయితలకు ఆత్మవంచన ఉండకూడదు. ప్రజా ఉద్యమాల్లో త్యాగశీలుర  జీవితాలను వర్ణించాలి కానీ పాలకులను కీర్తించడం పనిగా పెట్టుకున్న  వారిని ఉపేక్షించకూడదు. శాసనసభ్యులు మంత్రుల జన్మదినోత్సవాల వేళ కీర్తిస్తూ రాసిన రచయితలు సమాజంలోని సామాజిక రుగ్మతలను ఎత్తిచూపడానికి సిద్ధపడతారా?

       మరి కొంతమంది రచయితలు ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వాల అధినేతలను కీర్తించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ రకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య రంగంలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఎత్తి చూపడం లో గల వాస్తవాలు....? కవులు, రచయితలు ఇప్పటికీ తమను తాము పరీక్షించుకొని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నవి.

   సామాజిక రంగమే సాహిత్యానికి పునాది:

       సమాజంలో నెలకొన్న భిన్న సమస్యలు, విభిన్న సంఘర్షణలు, అసంబద్ధ విధానాలు,
 సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, వివిధ సామాజిక రుగ్మతలు సాహిత్య రంగానికి వస్తువుగా  ముడిసరుకు గా పనిచేస్తాయి. రచయితలు స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ భావాలను వ్యక్తం చేయగలిగినప్పుడే సమాజంలో నెలకొన్న సకల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మొహమాటానికో, ప్రభుత్వ, కార్పొరేట్ వ్యవస్థ మెప్పు కోసమో తన బాధ్యతను మరిచి గీత దాటితే రచయితలు కవులు ఆత్మవంచన చేసుకున్న వారే అవుతారు.

        గౌరీ లంకేశ్, దబోల్కర్, పన్సారే వంటి రచయితలు, జర్నలిస్టులు, సంపాదకులు సమాజములో వ్యాపించిన కుళ్ళును కడిగే ప్రయత్నంలో స్వతంత్రంగా వ్యవహరించినందుకు గానూ చిత్రహింసల తోపాటు హత్యకు గురయ్యారు. ఇలాంటి దుస్సంఘటనల కు నిరసనగా గత 5,6 సంవత్సరాల క్రితం భారత దేశ వ్యాప్తంగా అనేక పురస్కారాలు పొందిన టువంటి జర్నలిస్టులు, రచయితలు, కవులు,  జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు కూడా తమ బిరుదులు పురస్కారాలను ప్రభుత్వానికి వాపస్ ఇచ్చినారు. అయినా ప్రభుత్వాలు, పెట్టుబడిదారీ వ్యవస్థ, నేరస్తులు అవినీతి పరుల తో కూడుకున్న టువంటి ఉన్నత వర్గం, జర్నలిస్టులు రచయితల పట్ల తమ వైఖరిని మార్చుకోలేదు. కనుకనే ఇప్పటికీ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న  ఆస్వతంత్రత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరింత   మించి పోయిందన్న నిఖిలేశ్వర్ విమర్శలు మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

        అంటే సాహిత్యానికి ఆయువు పట్టు అయిన సామాజిక రంగంలోని సమస్యల పట్ల కవులు రచయితలు కళాకారులకు స్వేచ్ఛ లేకుండా చేయడం, ప్రశ్నిస్తే అడ్డుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో రాజీపడే ధోరణి గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా ప్రజా రచయితలు కవుల సంఖ్య తగ్గిపోవడం సామాజిక పతనానికి ప్రమాద సూచికగా భావించ వలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

    కవులు రచయితలు నిర్ణయించుకోవాలి:

             నికార్సయిన ప్రజల మనిషిగా నిలబడడానికి ,ఆత్మ వంచన కు తావు లేకుండా స్వతంత్రంగా బతకడానికి, ప్రజల సమస్యలను తనదైన కోణంలో రాయడానికి వెనుకాడని వాళ్ళే నిజమైన ప్రజా రచయితలు. ఈ విషయంలో కవులు రచయితలకు స్పష్టత ఉండాలి. తమ గమ్యాన్ని, గమనాన్ని ప్రజా కోణంలో నిర్దేశించుకోవాలి. ప్రపంచంలోని వివిధ భాషలలో పేరుగాంచిన రచయితల స్వతంత్ర భావజాలాన్ని  పుణికి పుచ్చుకొని ఆత్మస్థైర్యంతో, ధిక్కార స్వరంతో, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ప్రజల పక్షాన నిలబడాలి. అట్లా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం అని కాదు. కాకపోతే ప్రజలకు అనుకూలం అనే కోణంలో ఇటు కవులు అటు ప్రభుత్వాలు మరోవైపు సమాజం కూడా ఆలోచించాలి.

   సాహిత్య రంగం- ప్రభుత్వాల బాధ్యత:

           హక్కులు బాధ్యతల విషయంలో, ప్రజాస్వామిక కర్తవ్యాల విషయంలో, సమాజం మరింతగా ఉన్నత స్థాయికి చేరుకునే విషయంలో రచయితలు కవులు మేధావులు బుద్ధిజీవులు నిర్వహించే పాత్ర ఎనలేనిది. వీరి కృషి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభుత్వానికి ఎంతో దోహదపడుతుంది. కానీ వీరి కృషిని సరైన కోణములో అవగాహన చేసుకోని ప్రభుత్వాలు కక్షపూరితంగా ఆలోచించడం వలన సాహిత్య రంగం ప్రభుత్వాల మధ్యన సంఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణకు, సమాజ ఉన్నతీకరణ కు, నీతివంతమైన పాలన అమలుకు అంత శ్రేయస్కరము కాదు.

      ప్రభుత్వం తలపెట్టిన సుపరిపాలన పూర్తిస్థాయిలో అమలు జరగాలంటే ,ప్రభుత్వ పథకాలు ప్రజలకు పూర్తిగా అందాలంటే, ప్రజలకు ప్రభుత్వాల పట్ల విశ్వాసం పెరగాలంటే ,ప్రజా ప్రభుత్వాలు గా  పేరుగాం చాలంటే ప్రజాస్వామిక పౌర హక్కుల కార్యకర్తలు, మేధావులు, బుద్ధిజీవులు, కవులు, రచయితలు, కళాకారుల యొక్క సహకారం ప్రభుత్వాలకు ఎంతో అవసరం.

        వాస్తవాల పునాదిపైనే వీరి సహకారాన్ని ప్రభుత్వాలు గనుక తీసుకుంటే మరింత మెరుగైన సమాజం ఏర్పడడానికి వీలుంటుంది. సాహిత్య రంగాన్ని ప్రభుత్వాలు తమ వైపు తిప్పుకోవడం కానీ, ఆశ చూపి లోబర్చుకోవడం కానీ, పదవులతో నోరు మూయించడ0  కానీ చేస్తే ప్రభుత్వాలు అప్రతిష్టపాలు కావడమే కాకుండా సమాజం నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే రాజీపడే ధోరణి గల రచయితలను  మీరు ప్రజల పక్షమేఉండాలి! అని ప్రభుత్వాలు హెచ్చరించిన రోజు భారతదేశంలో నూతన శకానికి అంకురార్పణ జరుగుతుంది. 

       ప్రజల మేలు కోసం తమ జీవితాలను త్యాగం చేసి కేసులుతో  ఖైదీ లు గా గడుపుతున్న, నేరం రుజువు కాకుండానే శిక్షలు అనుభవిస్తున్న బుద్ధి జీవులు ప్రజల మధ్యన ఉండకపోవడం చాలా బాధాకరం. కానీ నేర చరిత్ర కలిగి అవినీతి ఆరోపణలు రుజువైన వాళ్లు కూడా నేడు చట్టసభల్లో అధికార పీఠంపై కొనసాగడం ఈ దేశ భావదారిద్ర్యం. ఈ రెండు పరిస్థితులు తప్పిదాలే. ప్రజలకు మేలు చేసిన వారు ప్రజల మధ్య ఉండాలి. వారిని ప్రభుత్వాలు గుర్తించాలి. నిజమైన నేరగాళ్లు, అవినీతిపరులు చట్టసభలు అధికార పీఠాల పై కాకుండా కఠిన శిక్షలు అనుభవించాలి.  
       
         కవులు రచయితలు కళాకారులు బుద్ధిజీవులు అమ్ముడు పోకుండా ఆత్మవంచన చేసుకోకుండా తమ కర్తవ్యాలను నిర్వహిస్తే పై రెండు పరిస్థితులు సాధ్యమవుతాయి. నేరస్తులు  శిక్షించబడతారు. ప్రజల మనుషులు రక్షించబడ తారు. నిజమైన కవులు కళాకారులు భుజానికెత్తుకున్న సాహిత్యం యొక్క ప్రయోజనం అదే.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా తెలంగాణ)


0/Post a Comment/Comments