"దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్" అంటూ ఒక సరి కొత్త సత్యాన్ని చాటి చెప్పిన గురజాడ మనుషులకు, దేశానికి మేలు చేయడానికి భాషా సాహిత్యాలు సాధనంగా ఉండాలని దేశాభిమానం పెంచే విధంగా కొనసాగాలని, అందరికీ అర్థమయ్యే ప్రజా భాషలోనే వాడుక చేసే విధంగా ఉంటేనే ఆ సాధనాలు గొప్ప నాగరికతకు మార్గదర్శనం అవుతుందని చాటి చెప్పిన మహనీయుడు గురజాడ అప్పారావు...
1920 శతాబ్దాలలో తన రచనలతో సాంఘిక పరివర్తనకు ప్రయత్నం చేసిన గొప్ప గొప్ప సాహితీకారులలో గురజాడ అప్పారావు గారు ఒకరు. ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో తన రచనలన్నీ కూడా ప్రజల మన్ననలు పొందాయి. వాడుక భాష ఒరవడికి ఎంతగానో కృషి చేసిన "కవిశేఖర బిరుదాంకితుడు. అభ్యుదయ కవితా పితామహుడిగా వెలుగొందిన మహనీయుడు.
గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 న వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలి తాలూకా రాయవరంలో జన్మించారు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో ఉద్యోగి ఉండేవారు. తన పదవ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలోనే చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రి కాలం చెయ్యటంతో, విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాల పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో అప్పటి ఎమ్. ఆర్. కాలేజి ప్రిన్సిపాల్ సి. చంద్రశేఖర శాస్త్రి ఇతనును చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884లో ఎఫ్. ఎ చేసారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. హైస్కూలులో టీచరుగా చేరారు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి అతనుకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు కూడా. అప్పటి కళింగ రాజ్యంగా పేరుపొందిన విజయనగరంలోనే అప్పారావు గారు నివసించారు. విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో అతనకు మంచి సంబంధాలు ఉండేవి. 1887లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అతను మొదట ప్రసంగించారు. ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసులో చేరారు. 1889లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో తమ్ముడు శ్యామలరావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాసారు. వీరు రాసిన ఆంగ్ల పద్యం సారంగధర, ఇండియన్ లీషర్ అవర్లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. ఆంగ్లంలో యెంత గొప్పగా వ్రాసినా అది పరభాషేనని, తన మాతృభాషలో వారు ఇంకా గొప్పగా వ్రాయగలరని వారు గ్రహించారు. ఇండియన్ లీషర్ అవర్ ఎడిటరు గుండుకుర్తి వెంకట రమణయ్య కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించాడు. 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ నియామకం పొందారు.
1884లో మహారాజా కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1886లో డిప్యూటీ కలెక్టరు ఆఫీసులో హెడ్ క్లర్కు పదవినీ, 1887లో కళాశాలలో అధ్యాపక పదవినీ, 1886లో రాజా వారి ఆస్థానంలో చేరారు. 1911లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో సభ్యత్వం కూడా లభించింది. 20వ శతాబ్ది తొలినాళ్ళలో జరిగిన వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు తన సహాధ్యాయి గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి పోరాటం సలిపారు. వారిద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంథిక భాషావాదులతో అలసట ఎరగకుండా తలపడ్డారు. గిడుగు వాదనాబలానికి, గురజాడ రచనాశక్తి వ్యావహారిక భాషోద్యమానికి వినియోగపడ్డాయి.
సారంగధర, పూర్ణమ్మ, కొండుభట్టీయం, నీలగిరి పాటలుముత్యాల సరాలు, కన్యక, సత్యవ్రతి శతకము, బిల్హణీయం (అసంపూర్ణం), సుభద్ర, లంగరెత్తుము, దించులంగరు, లవణరాజు కల, కాసులు, సౌదామిని, కథానికలు, మీపేరేమిటి, దిద్దుబాటు, మెటిల్డ, సంస్కర్త హృదయం, మతము విమతము, పుష్పాలవికలు మొదలైన రచనలు.
గురజాడ వారి కన్యాశుల్కము నాటకాన్ని తొలిసారిగా 1892 లో ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. దీని విజయంతో, అప్పారావు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెతికారు. భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రశంసించడంతో అప్పారావుకు ఎంతో పేరు వచ్చింది. అప్పారావు దీన్ని మహారాజా ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు.
గురజాడ రచనల్లో కన్యాశుల్కము (నాటకం) అగ్రగణ్యమైనది. కన్యాశుల్కము దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన ఉత్తమోత్తమమైన రచనలలో ఒకటి. 1892లో ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం వివిధ భాషలలో అనువాదమై100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది.
ఇతని రచనలలో దేశంను ప్రేమించుమన్నా...పుత్తడి బొమ్మా పూర్ణమ్మ..మొదలైన ఎన్నో రచనలు ప్రసిద్ది పొందాయి.1913లో అప్పారావు పదవీ విరమణ చేసారు. గురజాడ ఆనారోగ్యంతో ఉన్న బాధపడే సమయంలోనే మద్రాస్ విశ్వవిద్యాలయం వారు "ఫెలో"తో గౌరవించారు. చివరికి ఆయన 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గురజాడ అప్పారావు దేశమును ప్రేమించుమన్నా, మంచితనాన్ని పెంచుమన్నా... అంటూ దేశంపై ప్రేమను, మంచితనం రచనలందు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శంగా నిలిచాయి, నిలుస్తాయి. వొట్టి మాటలు మానుకొని గొప్పగొప్ప పనులు చేయడానికి శ్రీకారం చూట్టాలని మనిషి ఉనికిని దేశ ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పిన అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు ప్రజల హృదయాలలో చెరగని చిరస్మరణీయుడు.
వ్యాసకర్త
శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్