పోపుల పెట్టె...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
చరవాణి:7032504646
ఆయు విందతి వేత్తివా ఆయుర్వేదః నానుడి నాదం
ఆయువును వృధ్ధి చేసే వైద్య విజ్ఞాన వేదం
దీర్ఘకాలిక జగమొండి వ్యాధుల పై ఎక్కు పెట్టిన బ్రహ్మాస్త్రం
చరకుడు అగ్నివేశ తంత్రమును చరక సంహిత గా శాస్త్రీకరించిన వైద్యం ఆయుర్వేదం నా ఆరోగ్య భారతం...!
విశ్వ మానవాళి విశ్వసించిన అతి పురాతన వైద్య సంరక్షణ వ్యవస్థల సమాహారం
ధర్మార్థకామ మోక్షాల అవరోధాలకు వైద్య తాత్విక చింతనల సమ్మేళన సారం
ధన్వంతరి సుశ్రుతాది మహర్షులు నేర్చినట్టి ప్రాచీన వైద్య విజ్ఞాన భాండాగారం
సంగీతం క్షవరం భాగమై వెలుగొందిన ఆయుర్వేదం నా ఆరోగ్య భారతం...!
ఆధునిక జీవనశైలి ఆహారపు అలవాట్ల విపరీత పరిణామ ధోరణిలో
పురాతన వంటకాలను చాదస్తంగా భావించే సరళిలో
మనిషి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించే క్రమంలో
ప్రతి క్షణం లక్షల సంఖ్య లో రోగ కారక సూక్ష్మక్రిములు దేహం పై దాడి చేసే వేళలో
వసంత కాలపు ఉషోదయమై తలుపు తట్టే రక్షక దళం ఆయుర్వేదం నా ఆరోగ్య భారతం...!
తాత ముత్తాతల కాలంలో
పుట్టుక ఇంట్లోనే... చావు ఇంట్లోనే...
ఆధునిక జీవనశైలి కాలంలో
జననం ఆసుపత్రిలోనే...మరణం ఆసుపత్రిలోనే...
ఈ నేపథ్యంలో వెనకటి వంటకాలే
ఆరోగ్యమే మహాభాగ్యంగా...
ఇంటిల్లి పాది అమృత అక్షయ పాత్ర జీవామృత వేదం ఆయుర్వేదం నా ఆరోగ్య భారతం...!
జీల కర్ర నిమోనియాను మాయం చేసే వ్యాధి నిరోధక శక్తి మంత్ర దండమై
పసుపు అల్లం యాలకులు శ్వాస కోశాలకు ఆయువు పట్టే సహజ రోగ నిరోధక ఆయుధాలై
లవంగం జీర్ణ రసాల స్రవంతి, మెంతులు రక్త శుద్ధి పారిశుధ్య మిత్ర బృందమై
ధనియాలు శొంఠి మరిగించిన మిశ్రమం చల్లదనం మధుమేహ రహిత అస్త్రాలై
వెల్లుల్లి పాక హర్షంగా ఘనకీర్తి గాంచిన సూక్ష్మ క్రిమి నాశిని కొవ్వుకరిగించే హాసినై ఆయుర్వేద వైద్యుల హస్తాల్లో దివ్యౌషధం కరోనా రోగులకు ప్రాణాలు పోసిన సంజీవినై
ఒక్కొక్క దినుసుల్లో ఒక్కొక్క ఆయుర్వేద ఔషధం కేరాఫ్ అడ్రస్ పోపుల పెట్టె నా ఆరోగ్య
భారతం...!