అశ్లీల, అసంబద్ధ ప్రసారాలను టీవీలో అనుమతించడం ఎవరి ప్రయోజనం కోసం?? -- వడ్డేపల్లి మల్లేశము, 9014206412

అశ్లీల, అసంబద్ధ ప్రసారాలను టీవీలో అనుమతించడం ఎవరి ప్రయోజనం కోసం?? -- వడ్డేపల్లి మల్లేశము, 9014206412

అశ్లీల, అసంబద్ధ ప్రసారాలను టీవీలో అనుమతించడం ఎవరి ప్రయోజనం కోసం??

-- వడ్డేపల్లి మల్లేశము, 9014206412

    05.9.2021

వడ్డేపల్లి మల్లేశము

    "మీ భార్యని ఇక్కడినుంచి వెళ్ళగొట్టు వెంటనే నా మెడలో తాళి కట్టు" ఇది నేటి సీరియల్ లోని అసంబద్ధ దుష్ట సంస్కృతి కి సంబంధించిన ఆనవాళ్లలో  ఒకటి మాత్రమే.

 టీవీ ప్రసారాలపై అటు ప్రభుత్వానికి  నియంత్రణ లేకపోవడం ఇటు సభ్యసమాజానికి బాధ్యత కరువైన కారణంగా టీవీ చానల్ యాజమాన్యాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజా జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నవి అనడంలో సందేహం లేదు.

   

టిఆర్ఎస్ పార్టీ హామీ:

     ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారానికి రాకముందు టీవీ ప్రసారాలు సినిమాల్లోని అసభ్య అశ్లీల పదజాలము, సంఘటనలు ,సందర్భాలను కట్టడి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు దాటిపోయినా టీవీ ప్రసారాల లోని అసంబద్ధ విధానాలను అశ్లీల విధానాలను అడ్డుకోవడానికి ప్రభుత్వపరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

     సాంస్కృతిక రంగానికి సంబంధించి పాటలు కానీ సన్నివేశాలు, సంభాషణలు, అశ్లీల దృశ్యాలు సభ్య సమాజం మీద ముఖ్యంగా యువత మీద చెడు ప్రభావం చూపుతాయనే బాధ్యత ప్రభుత్వం విస్మరించిన కారణంగా ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయింది.

   

ప్రసారాల్లో ని అసంబద్ధ విధానాలు:

     సుమారుగా 90% ప్రసారాలు ప్రజా జీవితానికి సంబంధం లేని ఉన్నత వర్గాల కొమ్ముకాసే అందము, శృంగారము, అశ్లీలం చుట్టూ తిరిగే కార్యక్రమాలే ఎక్కువగా ఉన్నాయి. నాగరిక సమాజాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకు పోయే విధంగా, బాధ్యతలను గుర్తించే విధంగా, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించే విధంగా ఏ ఒక్క ప్రసారం కూడా లేకపోవడం అత్యంత బాధాకరం. కుటుంబ సంబంధాలను విచ్ఛిన్నం చేసే సంభాషణలు, కిలోల కొద్దీ బంగారాన్ని మెడలో వేసుకొని స్త్రీల పాత్రలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి పురుషులని మట్టి బొమ్మలు గా తయారు చేసే సీరియల్ మనము ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాము. కథాంశం సంవత్సరాల తరబడి సాగదీయడం , సామ్రాజ్యవాద విష సంస్కృతికి ప్రజలను అలవాటు చేసే విధంగా ఉన్న టీవీ ప్రసారాల పట్ల ప్రభుత్వం ఇకనైనా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.

    ఈ విషయంలో మహిళా సంఘాలు ఎందుకు నోరుమెదపడం లేదో అర్థం కావడం లేదు. అత్యంత బాధాకరమైన రీతిలో స్త్రీ శరీరాన్ని అర్థనగ్నంగా చూపిస్తూ ఉంటే అది నిర్వాహకుల దోషమా? పాత్రలు వేస్తున్న స్త్రీల దోషమా? సభ్య సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. భార్య ఉన్న భర్తను తను ప్రేమిస్తూ తన భర్తను విడిచి పెట్టే పాత్రలు టీవీలలో అనేకం. ఇదేనా మనం నేటి సమాజానికి యువతకు నేర్పే సందేశం.?

     గత మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన టువంటి బిగ్ బాస్ కార్యక్రమం సంవత్సరాల తరబడి గా సాగింది. తిరిగి మళ్లీ నేడు  బిగ్బాస్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం మీద విజ్ఞులు మేధావులు అనేక విమర్శలు గతంలో చేసి ఉన్నారు. ఏమాత్రం ప్రయోజనం లేకపోగా స్త్రీలు పురుషులు ఉమ్మడిగా సంవత్సరాల తరబడిగా కలిసి ఉండే కార్యక్రమం వల్ల ఏమి ప్రయోజనమో నిర్వాహకులు ఇకనైనా తెలుసుకోవాలి. అందులో పురుషులతో కలిసి ఉండే స్త్రీల యొక్క వేషధారణ అతి వికృతంగా ఉంటే ఇటు పురుషులు స్త్రీలు ప్రేక్షకులుగా ఆ కార్యక్రమాలను ఎందుకు ఆదరిస్తున్నారు?

    

సామాజిక విచ్ఛిన్నానికి టీవీ ప్రసారాలు:

          శృంగారం, ప్రేమ అందాలను ఆరబోసే కార్యక్రమాలు వ్యక్తిగతం అవి  రహస్యమైన వి కూడా. అలాంటి వ్యక్తిగతమైన జీవితాలను తీసుకువచ్చి శరీరాలను ప్రదర్శించడమే లక్ష్యంగా బరితెగించి నటిస్తుంటే మహిళా సంఘాలు,  రచయితలు, కవులు, మేధావులు ఎందుకు విమర్శించడం లేదు? ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకు రావడం లేదు?

     

టీవీ ప్రసారాలు ఎలా ఉండాలి:

        శాస్త్రీయ వైఖరిని పెంపొందించేలా, శ్రమను గౌరవించేలా, మానవ సంబంధాలను బలోపేతం చేసే విధంగా టీవీ ప్రసారాలు ఉండాలి. తప్పటడుగులు వేసేవారికి బుద్ధి చెప్పే విధంగా పెద్దన్న పాత్ర నిర్వహించవలసిన టీవీ ప్రసారాలు హద్దు అదుపు లేకుండా అన్ని రంగాల్లోనూ విఫలమైనట్లు గా భావించవలసి ఉన్నది.

    టీవీ ప్రసారాలలో నటిస్తున్న స్త్రీలు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని కోరుకోవాలి .కానీ దుష్ట పాత్రలను నటించడానికి అంగీకరించకూడదు. అశ్లీలంగా  ఉండే సన్నివేశాలను ప్రోత్సహించకూడదు. కుటుంబ సభ్యులందరూ ఉమ్మడిగా కలిసి చూసే విధంగా కార్యక్రమాలు ఉంటే మానసిక ఉల్లాసం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు చోటు దక్కుతుంది.

     మహిళలే డామినేషన్ చేసే పాత్రలు ఎక్కువ కావడం వలన స్త్రీ కి స్త్రీ ఏ శత్రువా? అనేది బలపడడం తో పాటు పురుష పాత్రలను నామమాత్రంగా చేయడం కూడా అసంబద్ధమైన జీవన చిత్రానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.

  టీవీ ప్రసారాల పైన చర్చ జరగాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఎక్కడో ప్రారంభిస్తే తప్ప ఈ విషయం పట్ల స్పష్టత రాదు. ముఖ్యంగా విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రభుత్వ పరంగా కూడా సెమినార్లు నిర్వహించడం ద్వారా మార్గాన్ని అన్వేషించి ప్రభుత్వం టీవీ ఛానళ్లకు ఆదేశాలు ఇచ్చే విధంగా కృషి జరగాలి. ప్రభుత్వానికి మనసు ఉంటే గానీ ఈ విషయంలో ఫలితాలను సాధించలేము.

 ప్రతి ఒక్కరూ టీవీ ప్రసారాల లోని అసంబద్ధమైన, అశ్లీల, దుష్ట సంస్కృతికి సంబంధించిన సన్నివేశాలను ఖండిస్తే తప్ప ప్రగతిని సాధించలేము.


( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)

0/Post a Comment/Comments