ఓ కవీ ఏమిటి నీకర్తవ్యం ?
---పోలయ్య కవి కూకట్లపల్లి
ఓ కవి నీ కలాన్ని "హలంగా" మార్చి
సాహితీ క్షేత్రంలో "సేద్యం"చేసి
సమాజంలోని రుగ్మతలకు "వైద్యం"చేసి
పదకవితలతో పద్యాలతో
కళామతల్లికి "నైవేద్యం"పెట్టినప్పుడే
నీ జీవితానికి ఒక అర్ధం పరమార్ధం
కవిగా సాహితీలోకంలో ధ్రువతారగా
చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో
లిఖించబడుతుంది
"తరతరాలుగాా"
"అవివేకం అజ్ఞానం"
"అమాయకత్వమే వరాలుగా"
బానిసత్వపు బ్రతికే బంగారుమయంగా
అవివేకంలో అజ్ఞానంలో అంధకారంలో
బ్రతుకుబండి నీడ్చే బడుగుజీవులకు
పీడిత తాడిత బడుగు బలహీనవర్గాలకు
నీవు కొండంత అండగా ఉండాలి
నివురుగప్పిన నిప్పులాంటివారిని
చైతన్యవంతుల్ని చేయాలి
ఖణఖణమండేనిప్పు కణికలుగా మార్చాలి
వారి జీవితాల్లో కమ్ముకున్న చిమ్మచీకట్లను
నీ కవితా కరవాలంతో చీల్చిచెండాడాలి
వారి గుండెలనిండా పండువెన్నెల్ని నింపాలి
వారి జీవితాలకు బాహుబలిలా భరోసా నివ్వాలి
నిర్భయంగా నిశ్చింతగా ప్రశాంతంగా
సుఖజీవనం చేసేలా
సులభమైన మార్గాలను అన్వేషించాలి
నాటి నేటి జీవన స్థితిగతులను
లోతుగా అధ్యయనం చేయాలి
నిప్పులాంటి నిజాలను వెలికితీయ్యాలి
వారి బానిసత్వపు బ్రతుకుల్లో వాడని
నవ్వుల పువ్వులు పూయించాలి
అందీ అందని ద్రాక్షగా ఉన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని
సమానత్వం సౌభ్రాతృత్వాల్ని
రక్షణకవచంలాంటి రాజ్యాంగ రక్షణల్ని
కోల్పోయిన హక్కుల్ని తిరిగి పొందేలా
అందరినీ ఏకంచెయ్యాలి
వారిని ఏనుగులుగా మార్చాలి
ఆత్మగౌరవమే వారికి "ఆయుధంలా"
ఆత్మవిశ్వాసమే వారికి "ఆక్సిజన్ గా"
ఆత్మబలమే వారికి "అమృతంలా" అందివ్వాలి
వారి గుండెల్లో చిరస్థాయిగా నీవు నిలిచిపోవాలి
ఓ కవి ఇదే ఇదే నీ కర్తవ్యం
ఇదే నీ బాధ్యత నీ ఆశయం కావాలి
నీవు ఓ అరుణోదయకిరణమై
నిరుపేదల జీవితాలను వెలిగించాలి
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502