నా భారతం ఒక అత్యుత్తమ సంస్కారానికి నెలవు. అహింస, సత్యం, ధర్మం, క్షమ వంటి వేళ్ళు ఈ భువిలో సుస్థిరం గా లోలోతులకు పాతుకుపోయాయి. జాలి,దయ,దానగుణాలతో పాటు ‘సర్వేజనాః సుఖినో భవంతు’ వంటి అత్యున్నత ఆదర్శాలకు కొలువు.
‘మానవ జీవితానికి కుటుంబం ఊయల వంటిది’ అంటాడు సుప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. అటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఒకప్పుడు ఎన్నో నీతికథలు,శతకాలు,నైతిక.విలువలు నేర్పడంజరిగేది. చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు, యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు,నాటకాలు అలరించి ఆనంద పరచేవి. సమాజానికిచెప్పాల్సిన నీతి బోధలు, ఉద్యమాలు హృద్యంగాచెప్పబడేవి. పెద్దలంటే గౌరవం, చిన్నలంటే అభిమానం, పరస్పర ఆదరాభిమానాలు ఉండేవి. వ్యవసాయ ప్రధానదేశం కాబట్టి స్వాతంత్ర్యానంతరం ప్రణాళికా బద్ధంగా పరిశ్రమలు, వాణిజ్య సంబంధిత ఎగుమతులు, దిగుమతులు కొన్నిజరిగాయి. ఆర్థికాభివృద్ధి తోపాటు విదేశీ మారక ద్రవ్యం లభించింది. జనాభా పెరిగింది. నిరుద్యోగం, చిరుద్యోగ సమస్య పెరిగింది. స్వార్థం, లంచగొండితనం, ఆశ్రితపక్షపాతం పెరిగాయి. కుల మత వైషమ్యాలు, అంటరానితనం, మహిళలపై వివక్ష అక్కడక్కడా ఇప్పటికీ పడగలు విప్పుతున్నాయి. ‘సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి’ అంటాడు శ్రీ శ్రీ. అమ్మాయిలు అంతరిక్షం వరకూ వెళ్ళారు. అది చాలదన్నట్లు ఆకాశంలోనూ సగభాగమయ్యారు. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించారు. నవకల్పనలు, సరళీకృత ఆర్థిక విధానాలు ఒక పక్క, దేవాలయ విగ్రహ ధ్వంసాలు, కుంభకోణాలు, కుల గజ్జి మరోప్రక్క నెలకొన్నాయి. రాజకీయ హత్యలు, రైతుల ఆత్మ హత్యలు, మానభంగాలు, అనైతిక కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి.
నా భారతి చెదరని చిరునవ్వుతో క్షితి నుండి క్షిపణి వరకు కాంతి కిరణమై దూసుకు పోతుంటే, మోయలేని బరువు తో పుస్తకాలు వీపు పై వేసుకున్న పాపాయి గుర్తొస్తుంది. ఆ శుష్క హాసం గుండెను చురుక్కుమనిపిస్తుంది. ఐక్యరాజ్య సమితికి యోగా భిక్ష బెట్టి, ప్రపంచానికే కరోనా మందును పంపిన స్థాయి మనదని ఆనంద పడాలో, నిత్యం జరిగే దారుణాలు చూసి కుమిలి పోవాలో తెలియని మానసిక స్థితిమనది. వేదాలకు, ఇతిహాసాలకు, ఆర్ష ధర్మానికి ప్రతీక యైన రాముడు, బుద్ధుడు పుట్టిన దేశమని గర్విద్దామా!? కూటికి, గుడ్డకు కూడా కరువైన మానవాళిని చూసిగర్హిద్దామా!? తేల్చుకోలేని పరిస్థితి! అభివృద్ధి ఆకాశం అంటింది.
పాపం కూడా కొండలా పెరిగింది. స్వార్థం పడగలు విప్పింది. ఫలితంగా హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణం పర్యావరణ కాలుష్యానికి దారితీసింది. ప్రకృతి ఉత్తరా ఖండ్ వరదలు, లైలా, హుదూద్ తుఫాన్లు, భూకంపాలు, ఉప్పెనలతో పగతీర్చుకుంది. పేరు ఏదైతేనేం ప్రళయం, విధ్వంసం జరిగాయి. నోబెల్ బహుమతులతో పాటు అనేక శాస్త్ర రంగాలలో సర్జికల్ స్ట్రైక్ వంటి విషయాల్లో విజయాలు సాధించాం. ఆటలలో పతకాలు యెన్ని వున్నా నిత్యం ఎక్కడో ఒకచోట మానవత్వం మంటగలిపే దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బంధాలను మరచిన హింసలు, శాడిజం ప్రవృత్తులు బయటపడుతూనే ఉన్నాయి. నా భారత మాతకు మాత్రం తన పొగరు జూపడానికి, హైందవ కీర్తిని విదేశాలలో విహరింప జేయడానికి ఆధర్మ చక్రం, ధార్మికత చాలు. ఈ దేశం లో ప్రతివాడు పౌరుషం తో ఉరకలు వేయాలి. మన త్రివిధ దళాల సిపాయిల త్యాగాలు మాత్రమే కాదు- మన దేశభక్తి కూడా అవసరం దేశం వెలుగులు నలు దిశలా వెదజల్లేందుకు. ప్రపంచానికే మకుటాయ మానంగా వెలుగొందడానికి ఇది చాలు.
అందుకే శేషేంద్ర అంటారు ‘నేను పిడికెడు మట్టినే కానీ నాకు ఒక దేశపు జెండా కున్నంత పొగరు ఉంది’ అని. యువత ఎక్కువ వున్న దేశం మనది. అందుకే వివేకానందుడు ‘ఉక్కునరాల యువతను ఇవ్వండి. అద్భుతాలు చేస్తానం’టాడు. ఈ 75 సంవత్సరాల కాలంలో కొన్ని మెరుపులు, కొన్ని మరకలు రెండూ ఉన్నాయి. గాంధీజీ,నెహ్రూ తదితర నాయకుల విజయాలతో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి అదృశ్యం; బాపు,ఇందిర,రాజీవ్ గాంధీల హత్యలు వంటిమరకలుకూడావున్నాయి.
‘పదండి ముందుకు పడం డి తోసుకు పోదాం! పోదాం! పైపైకి’ అని ఎవరికి వారు ప్రేరణ నిచ్చుకుంటే తప్ప నీతిగా బ తికితే తప్ప సామాన్యుడు బతికి బట్ట గట్ట లేడన్నది నిర్వివాదాంశం! నాకీ అవకాశం ఇచ్చి ప్రేరణ కలిగించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపు కుంటూ...స్వస్తి!
బి హెచ్.వి.రమాదేవి
ఎం.ఏ.,ఎం,ఏ.,ఎం.ఫిల్., ( పిహెచ్.డి)
తెలుగు లెక్చరర్, రాజమహేంద్రవరం.
చర వాణి: 6305543917.