నదీ దేశం నాదేశం...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
విశిష్ట చరిత్రను విశ్వమంతా కలిగి
విలక్షణ సంస్కృతి సంప్రదాయాలతో
విశేషమైన సహజ వనరులు సిరులైన
నదులతో వినుతికెక్కిన విశ్వంభర నా దేశం...!
సింధూ పరివాహక ప్రాంతాల్లో
పరిఢవిల్లిన నాగరికత
వికసించిన సాంస్కృతిక
సారస్వత వైభవాల తోరణాలు గల
ఘనమైన వారసత్వం నా దేశం...!
నదీతీరాలు మోక్ష కారకాలైన పుణ్య క్షేత్రాలతో
ఆధ్యాత్మిక అమృతవాహిని శోభను సంతరించుకొని
దేవీప్యమానంగా శత సహస్ర కాంతులతో
మంగళ హారతి పట్టిన మోక్ష భూమి నా దేశం...!
ప్రజల దాహార్తిని తీరుస్తూ
క్షుద్భాదను పోగొడుతూ
పసిడి సిరులు కురిపించే పంటలు పండిస్తూ
తమ పావన తరంగాలతో పునీతమై
పుణ్య భూమిగా నిలిచింది నా దేశం...!
పురాణ పురుషులకు నిలయమై
చరిత్రలకు సాక్షిభూతమై
సాహితీ మూర్తులకు కావ్య వస్తువై
నాగరికతకు మూలమై
నదుల సమూహం కలిగిన
నదీ దేశం నాదేశం....!