పంచముఖుడు(వచనకవిత)
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
నెలవంక నుదుట ధరించి
సర్పమాలలను కంఠమున నిలిపి
జటాఝూటమునందు గంగమ్మను అవధరించి
నుదుట త్రినేత్రమును దాల్చి
ఢమరుకమును ఒక హస్తముతో పట్టుకొని
పినాకమును మరొక హస్తమున అలంకరించి
గరళమును కంఠమునందు దిగమింగి
ధ్యానముద్రతో,తపోనిష్ఠమై మునిగి
కైలాసతాండవ కేళీనాదవినోది
పార్వతీ అర్థశరీర సమన్వయమొనర్చి
నందీశ్వర,భృంగీశ్వర నిత్యస్తోత్ర విలాసఠీవి
భక్తసులభ,భోళాశంకర మూర్తి
లింగరూపమెత్తి,నిజదేహనిశ్శబ్దసాంబమూర్తి
రౌద్రానల భీకర ప్రచండతాండవ ధ్వంసి
అభిషేక ఆనంద తేజో విరాణ్మూర్తి
శ్రీ మల్లిఖార్జున,రాజరాజేశ్వర,ద్రాక్షారామనివాసి
కోటప్పకొండ, కుమారభీమేశ్వర
సలిల మల్లియమాధురీ
నిత్యోదక,నిరామయ వేదాంతస్ఫూర్తి
పంచభూతాత్మక పునీత దర్శన కాలబేధి
నిర్మోహ,నిరంతర,శ్మశానస్థిత,హవనలబ్ధి
చిన్మయ,చిద్రూప,చిరంజీవ తాత్విక, లయాకార పరమేష్ఠి
విభూతి నొసగు నిత్యచైతన్య కీర్తి.
:ఇతి శివమ్:
హామీపత్రం:
పై వచనకవిత నా స్వంత రచన.