ఇది కలకాదు‌ పచ్చినిజం...???... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

ఇది కలకాదు‌ పచ్చినిజం...???... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

నిన్న ఉదయం పార్కులో కలిసిన
సాయంకాలం ఫోన్లో మాట్లాడిన
రాత్రి బజారులో గలగలమని నవ్విన
మా ప్రియమిత్రుడు మా ప్రాణమిత్రుడు
నేడు నిద్రలేవలేదంటే...
సూర్యోదయాన్ని చూడలేదంటే...
హఠాత్తుగా తెల్లారక మునుపే కన్నుమూసి 
కళ్ళముందే కనుమరుగై పోయాడంటే...
నమ్మలేకపోతున్నాం ఇది కలయా నిజమా ?
అర్థంకాక కలవరపడి‌ పోతున్నాం...

నిజమే నిన్న వెలిగిన "ఆదీపాన్ని"
"కరోనాభూతం" నేడు కసిగా ఆర్పేసింది
మా మిత్రున్ని మాకు దూరం చేసింది
ఆ కుటుంబంలో అంధకారాన్ని నింపింది

ఐనా ఇంకా వారి "తీపి జ్ఞాపకాలు"
మాచుట్టే "తేనెటీగల్లా" తిరుతున్నాయి...
వారింకా బ్రతికే వున్నట్లుగాా...
ప్రేమతో చిరునవ్వుతో పలకరించినట్లుగా...
కలిసి మనసు విప్పి మాట్లాడినట్లుగా...
చేయి కలిపినట్లుగా భుజం తట్టినట్లుగా... 
గలగల గంభీరంగా నవ్వినట్లుగా...

లోకవిషయాలన్నీ గంటలతరబడి చర్చించినట్లుగా...
ఎన్నో ప్రశ్నలకు చక్కని సమాధానాలనిచ్చినట్లుగా...
కోవిడ్ విషయాలో మమ్మల్ని హెచ్చరించినట్లుగా...
ఎన్నో ఉచిత సలహాలనిచ్చినట్లుగా...
విలువైన సూచనలు చేసినట్లుగా...

అనేక ఆర్థిక ఆరోగ్య ఆథ్యాత్మిక
వి‌షయాల అన్వేషణలో కొత్తదారులను
జటిలమైన అనేక సమస్యలకు
పరిష్కారమార్గాలను చూపినట్లుగా...
మాకెంతో ఆత్మ స్థైర్యాన్ని 
నూరిపోసినట్లుగానే...ఉంది
ఇంకా ఇది కలయా నిజమా ? 
అర్థంకాక అల్లాడి‌పోతున్నాం

అయ్యో ఓ దైవమా ! 
మా జీవితం ఇంత క్షణికమా?
గడ్డిపువ్వులా........ వాడిపోవడమేనా?
మల్లెపువ్వులా.......మాడిపోవడమేనా?
నీటిబుడగలా.........పేలిపోవడమేనా?
ఎండుటాకులా....... రాలిపోవడమేనా?
గాలిలో ధూళిలో.....కలిసిపోవడమేనా?
అయ్యే ఓ దైవమా ! 
మా జీవితం ఇంత క్షణికమా ? ఇది 
ఎవరికీ అంతుచిక్కని ఇంత వింత రహస్యమా?

-- పోలయ్య కవి కూకట్లపల్లి,
అత్తాపూర్, హైదరాబాద్.

0/Post a Comment/Comments