శ్రీశ్రీ(వచనకవిత)
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్
కదనపాళిని ఎక్కుపెట్టి
బాధ్యతలను ఎలుగెత్తి చాటి
విప్లవశంఖం మోగించి
అగ్నివీణమెట్లను కదిలించి
సామాన్యుని ఘోషను వినిపించి
పీడిత,తాడిత ప్రజల పక్షం వహించి
అభ్యుదయాన్ని రంగరించి
కొత్తదనాన్ని సూత్రీకరించి
కవిత్వానికి నిర్వచనమిచ్చి
సంప్రదాయాలను తెంచి
నాగరికతను పెంచి
ప్రపంచబాధలను సమాంతరంగా సాక్షీకరించి
ఎరుపెక్కిన జ్వాలల్లోని
సెగలను తగిలించి
విస్ఫులింగాలను పుక్కిట నిల్పి
మానవతను మేల్కొలిపి
ఉద్యమాలను రగులుకొల్పి
ఎద తంత్రులను సుతిమెత్తగా మీటి
ఆకాశాన్ని అండగా చూపెట్టి
అవకాశాలను సమానంగా పంచి
ఇజాల నిజాలను దుమ్ముదులిపి
కమ్యూనిజమనే ఇమ్యూనిటీని అందించి
పేదవాడి మాటై,పాటై,నినాదమై మ్రోగించి
సహస్ర వెలుగులను చిమ్మిన భాస్కరుడు
మేడిపండు సమాజ స్కానింగ్లు
చేసి
ప్రణయగీతాలతో పదునైన మాటలతో
సాహిత్యంలో యుగకర్తగా నిలిచిన కవిశేఖరుడు
తెలుగుపాటకు వెలుగులందించి జాతీయ గుర్తింపు నిచ్చిన మార్గదర్శకుడు.