చేనేతను కాపాడుకుందాం. చేనేత కార్మికులు ఆత్మగౌరవంతో బతికే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
---వడ్డేపల్లి మల్లేశము - 9014206412 *7.8.2021*
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలతో!......
శ్రమైక జీవన సౌందర్యం, మేళవిస్తే ఆవిర్భవించినది చేనేత వృత్తి. అంత గొప్ప వృత్తిలో పనిచేస్తున్న కార్మికులు వృత్తి పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలీచాలని రాబడితో, గత్యంతరంలేని పరిస్థితులలో ,వృద్ధాప్యాన్ని సైతం పక్కనపెట్టి కుటుంబ పోషణార్థం ముట్టి పట్టి మొగ్గ0 నేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు.
కుల వృత్తుల లో చేనేత మేటి:
అనాదిగా భారతదేశంలో గ్రామీణ కుల వృత్తుల తో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేది. వృత్తిని నమ్ముకొని చిత్తశుద్ధిగా పనిచేయడం పరస్పర ఆర్థిక లావాదేవీలతో వ్యక్తుల అవసరాలను తీర్చుకోవడం కాకుండా ఆర్థికంగా మిగులును సమకూర్చుకొని దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆంగ్లేయుల రాకతో వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం తో పాటు పరోక్షంగా మన చేతివృత్తుల విధ్వంసం కూడా ప్రారంభమయింది. అన్ని రకాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా యంత్రాలతో తయారైన వస్తువులను ఇక్కడ అమ్ముకోవడం తో చౌకగా లభించిన కారణంగా మన చేతివృత్తుల ఉత్పత్తులు క్రమంగా నష్టాల బారిన పడ్డాయి. అందులో చేనేత కూడా ఒకటి.
జాతీయ చేనేత దినోత్సవ నేపథ్యం ఏమిటి:
ఆంగ్లేయులను వారి దేశానికి తరిమికొట్టాలని ఇక్కడి రాజకీయ పార్టీలు సంఘాలు సంస్థలు పోరాట కార్యక్రమాలు క్విట్ ఇండియా లాంటి ఉద్యమాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహం లాంటి ప్రజా ఉద్యమాలు అటు అతివాదులైన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వారి ఆధ్వర్యంలో కొనసాగినాయి. మరోవైపు గాంధీ నాయకత్వంలో స్వదేశీ విధానాన్ని అవలంబించాలని విదేశీ వస్తువులను బహిష్కరించాలని సాగిన ఉద్యమంలో గాంధీజీ స్వయంగా చరఖా తి0 పి, నూలు వడకి నేసిన వస్త్రాలనే ధరించడంతో పాటు దేశ ప్రజలందరికీ కూడా స్వదేశీ వస్త్రాలనే ధరించాలని పిలుపిచ్చారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికినందున చేనేత రంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు చరిత్రలో కొనసాగినవి.
ఈ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన కొన్ని సంఘాలు బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్ హాల్ లో 1905 ఆగస్టు 7వ తేదీన భారీ సమావేశం నిర్వహించి దేశీయ ఉత్పత్తుల పునరుద్ధరణకు పెద్దఎత్తున పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎర్ర మాధ వెంకన్న నేత ఈ విషయంలో చొరవ చూపిన కారణంగా 2008 ఆగస్టు 7వ తేదీన రవీంద్రభారతిలో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా తొలిసారిగా అధికారికంగా నిర్వహించడం జరిగింది. అనంతరం 2012- 2014లో ఢిల్లీలో జరిగిన చేనేత వాక్ మరియు చేనేత దినోత్సవ ర్యాలీకి చాలా స్పందన వచ్చిన వేల కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో చర్చించి 2015 జూలై 29 వ తేదీన ఆగస్టు 7వ తేదీని అధికారికంగా జాతీయ చేనేత దినోత్సవం గా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేశారు.
ఆ గెజిట్ నిర్ణయం మేరకే 2015 ఆగస్టు 7వ తేదీన చెన్నైలోజరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు.. ఈరోజు చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటు ప్రతిభ కనపరిచిన చేనేత కళాకారులకు పురస్కారాలు ఇవ్వడానికి కూడా ప్రారంభించాడు.
చేనేత ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లు:
యంత్రాల మీద తయారవుతున్న వస్త్రాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో, మరొకవైపు చేనేత వస్త్రాలపట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కారణంగా ముడిసరుకులైన నూలు, రంగుల కు ధరలు అధికంగా పెరగడంతో ముడి సరుకులు కొనుగోలు చేసి సొంతంగా నేసుకుంటున్న కార్మికులకు ఆటు చేనేత సహకార సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా కూలి గిట్టుబాటు కావడం లేదు. సహకార సంఘాల పరిధిలో పనిచేస్తున్న మగవాళ్లకు మీటర్ ఒక్కంటికి 20 నుండి 30 రూపాయలు మాత్రమే కూలీ ఉన్నందున పని చేసిన ఒక రోజు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. నేత పనిలో సహకరించే స్త్రీలకు కూడా 100 రూపాయలు కూడా దక్కడం లేదుఅనివాపోతున్నారు . ఇది అత్యంత దయనీయమైన విషయం. ఇటీవలి కరోనా నేపథ్యంలో గత సంవత్సరం కాలంగా పనులు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. ఒకవైపు చేనేత వల్ల బ్రతుకు తెరువు లేదని నేటి తరం యువకులు పవర్లూమ్స్ లేదా మిగతా చిరు వ్యాపారాల్లో నిమగ్నమై పొట్ట పోసుకుంటున్నారు.
ఉదాహరణకు వరంగల్ జిల్లాలోని పరిస్థితిని గమనిస్తే ఐదు వేల చేనేత మగ్గాల పైన 20 వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్న సందర్భంలో ఇక్కడ ప్రధానంగా నేస్తున్న కార్పెట్లు ప్రభుత్వము కొనుగోలు చేయక పాఠశాలలు ఇతర సంస్థలకు సరఫరా చేయని కారణంగా 3,20,000 కార్పట్లు అమ్ముడు పోక నిల్వ ఉన్నాయంటే కరోనా కారణంగా మహిళలతో సహా పురుషులు పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అక్కడి సమాచారం. ఇలాగే చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సహకార సంఘాల పరిదిలో ఉత్పత్తి అయిన వస్త్రాలు అట్లాగే నిల్వ ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఒకేరకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సందర్భంలో స్థానికంగా అనేక ప్రాంతాలలో వాళ్ల సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఎమ్మార్వో లు ప్రభుత్వ అధికారులకు విజ్ఞాపన పత్రాలు అందించారు.
పరిష్కరించవలసిన కొన్ని సమస్యలు:-
- ]కరోనా వల్ల పని లేని కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలి చావులకు గురవుతున్న సందర్భంలో నెలకు పదివేల రూపాయలు చొప్పున గత ఆరు మాసాల కెగాను ఆర్థిక సహకారం చేసి ఆదుకోవాలని గతంలో కొరియున్నారు.
- ఉత్పత్తి అయిన వస్త్రాలనుఆప్కో,తదితర సంస్థల ద్వారా కొనుగోలు చేసి తిరిగి పనులు కల్పించాలి.
- నూలు ఇతర ముడిసరుకుల పై 50 శాతం సబ్సిడీతో కార్మికులకు సరఫరా చేయాలి.
- చేనేత కార్మికులకు భరోసా కల్పిస్తూ ఆర్థిక పథకాలు అన్నింటినీ కొనసాగించి ప్రభుత్వ వాటాను చెల్లించాలి.
- మీటర్ కొక్కంటి ఇస్తున్న కూలీని ప్రభుత్వం లోటును భరించి మీటర్ ఒక్కంటికి 100 రూపాయలు ఇస్తే కానీ కనీసం 400 రూపాయలు గిట్టుబాటు కావు.
- ఆరోగ్య బీమా పథకాలను వర్తింపజేసి కార్డులతో ఉచిత వైద్యాన్ని కల్పించాలి.
భారతదేశ చేనేత ప్రతిభ ఆనవాళ్ళు కొన్ని:
ఇప్పటికీ నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి లాంటి చాలాచోట్ల స్త్రీలు కూడా మగ్గం నేస్తు చేనేత ఉత్పత్తులను గణనీయంగా పెంచుతున్నారు. భూదాన్ పోచంపల్లి లో 2018లో అశోక చక్రం తో సహా త్రివర్ణపతాకాన్ని ఎలాంటి కుట్టు లేకుండా తయారు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఆంగ్లేయుల కాలంలోనే మన చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో పట్టే చీర నేసి ఆంగ్లేయులకు పంపించగా అక్కడి రాణి ప్రశంసలు అందుకున్నారు.
సిరిసిల్ల కు చెందిన నల్ల పరంధాములు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన కూడా అనారోగ్యంతో బాధపడుతూ అగ్గిపెట్టెలో అమరే చీరను నేసి అధికారులు మంత్రులతో అభినందనలు అందుకున్నారు . వారు అనారోగ్యంతో మరణించారు. సిరిసిల్ల కు చెందిన చేనేత కళాకారులే నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తో పాటు అనేక మంది ప్రముఖుల చిత్రాలను చేనేత ద్వారా అల్లి ప్రతిభను చాటి పేరుతెచ్చుకున్నారు. కానీ వారి ఆర్థిక పరిస్థితి లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
ప్రభుత్వం ముందు చేనేత డిమాండ్లు:
యంత్రాల ద్వారా ఉత్పత్తి అవుతున్న వస్త్రాల పోటీని తట్టుకోలేక పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వ సహకారం కొరవడిన కారణంగా మరో కోణంలో ఉత్పత్తయిన వస్త్రాలను ధరించడానికి సమాజములో ఎక్కువ మంది సిద్ధంగా లేకపోవడం వల్ల కూడా ఉత్పత్తి అయిన వస్త్రాలకు గిరాకీ లేకుండా పోతున్నది. రాజుల వేషాలు వేసిన యక్షగానాలు వేసే పాత్రధారులు తెరముందు సామ్రాజ్య అధినేతగా కనబడిన తెర వెనుక వారి జీవితంలో అంతా చీకటే. అలాగే రాజులు, ప్రభువులు, ప్రభుత్వాలు, చక్రవర్తులు, రాను ల ప్రశంసలందుకున్న మన చేనేత కళాకారులు వారి నిజ జీవితంలో భరిస్తున్నది ఆకలి చావులే. అందుకే ఈ విషయంలో ప్రభుత్వము, సమాజము, బుద్ధిజీవులు, మేధావులు, యువత ఆలోచించి చేనేత వస్త్రాలను విరివిగా వినియోగించడం ద్వారా వృత్తిపై ఆధారపడిన బక్కచిక్కిన చేనేత కార్మికులను ఆదుకొని వారిలో ఆత్మగౌరవాన్ని పెంచవలసిన బాధ్యత మనందరిదీ.
ప్రతి రోజూ కష్టాలకు గురవుతూ, చీకట్లో మగ్గుతున్న చేనేత కార్మికులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెడుతున్నారు.
డిమాండ్లు
- ఏటా ప్రభుత్వం కేటాయిస్తున్న పన్నెండు వందల కోట్లకు బదులు 5 వేల కోట్లు కేటాయించి చేనేత రంగ అభివృద్ధికి తోడ్పడాలని చేనేత రంగ అభిమానులు కార్మికులు కోరుతున్నారు. అంతేకాదు ఆ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలి.
- కేంద్రంలో ఉన్న చేనేత బోర్డు చేనేత రంగాన్ని గురించి ఆలోచించే ఒక సంస్థ. ప్రభుత్వము ఇటీవలనే ఆ బోర్డు ను రద్దు చేస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. తిరిగి దానిని వెంటనే ప్రారంభించి చేనేత రంగాన్ని ఆదుకోవాలి.
- చేనేత కార్మికులకు భద్రత భరోసా కల్పించాలి.
- చేనేత రంగాన్ని పవర్లూమ్ రంగాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించి కార్మికులకి కనీసము నెలసరి వేతనం 20,000 రూపాయలు ఇవ్వడం ద్వారా భద్రత కల్పించే కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలి.
- ముడిసరుకులు నూలు ధరలను విరివిగా తగ్గించాలి.
గత్యంతరం లేక దారి మళ్లుతున్న నేతన్నలు:
ఆర్థికంగా గిట్టుబాటు తక్కువగా ఉన్న ఆత్మగౌరవంతో కూడిన వృత్తిగా భావించిన చేనేత కార్మికులు వంశపారంపర్యంగా కళాత్మకమైన చేనేత వస్త్రాల ఉత్పత్తిలో ఇంతవరకు బాగానే కొనసాగినారు. కానీ పోటీ ఉత్పత్తి వలన చేనేత వస్త్రాల యొక్క ధరలు ఎక్కువగా ఉండడం వల్ల వీటి గిరాకి గణనీయంగా తగ్గడంతో ఉత్పత్తులకు విలువ లేకుండా పోయి గిట్టుబాటు కూలీ కానరాక రెంటికి చెడిన రేవడిగా బతుకులు ఎలతీస్తున్న కార్మికులు. వారి కుటుంబ సభ్యులు ఈ వృత్తిని చేపట్టడం అంటే భరోసా లేకపోవడంతో చెల్లాచెదురై పోయి తలోదారి చూసుకుంటూ క్రమంగా కుటుంబాలు చేనేతకు దూరమవుతున్నాయి . ఇది భవిష్యత్తులో మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉన్నది. హోటళ్లలో, కిరాణా షాపులో, పెట్రోలు పంపులో, చిన్న చిన్న సంస్థల్లో కూలీలుగా పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. ఏదైనా స్వయం ఉపాధి కల్పించు కొందామంటే వీరికి ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో కూలీలు గానే మిగిలిపోతున్నారు .కావున వీరికి సబ్సిడీతో కూడిన రుణాలు అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది .
రైతన్న పంటలు పండించే ప్రాణదాతగా నిలిస్తే నేతన్న వస్త్రాలను ఉత్పత్తి చేసి ప్రజల మాన సంరక్షణ కు తోడ్పడుతున్నాడు. వీరికి కూడా రైతుబంధు లాగా పెట్టుబడి సాయం కానీ కుటుంబ ఆర్థిక సాయం కానీ వారి పిల్లలకు అర్హులైన వారికి ఉద్యోగ కల్పన ద్వారా కూడా ప్రభుత్వం సహాయం చేయాలని ప్రజలు చేనేత కార్మికులు కోరుకుంటున్నారు. పత్తి ద్వారా తయారవుతున్న వస్త్రాల ఉత్పత్తి ఎంత గణనీయంగా పెంచితే అంత పత్తి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుని అటు చేనేత కార్మికులు ఇటు రైతులు హాయిగా బతుకుతారు. చేనేత కార్మికులు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కాటన్ వస్త్రాలు ఉత్పత్తి ని పవర్లూమ్ పైన గాని చేనేత పైన గాని తయారయ్యేలా చూసి వాటి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించి కార్మికులకు నెలసరి వేతనం ఇవ్వడం ద్వారా వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి చొరవ తీసుకోవాలి. కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్న సందర్భంలో, బడ్జెట్లోని కొన్ని పద్దులు మురిగిపోతున్నవేల ప్రయోజనకరమైన చేనేత రంగాన్ని ప్రభుత్వము రాజ్యాంగబద్ధమైన బాధ్యతగా ఆదుకోవడం ద్వారా లక్షలాది కార్మికుల జీవితాలను మెరుగుపరిచి నట్లే కాకుండా చేనేత రంగానికి గౌరవించినట్లు కూడా ఉంటుంది. అప్పుడే జాతీయ స్థాయిలో చేనేత దినోత్సవం నిర్వహణకు సార్థకత ఉన్నట్లుగా భావించాలి.
చేనేత సహకార సంఘాలు పద్మశాలి కుల సంఘాలు రాష్ట్రంలో చేనేత పై ఆధారపడిన కార్మికుల స్థితిగతులను సర్వే చేయడం ద్వారా ఒక సమున్నతమైన ప్రాతినిధ్యాన్ని ప్రభుత్వానికి అందించి ఇప్పటికీ చేనేత పై ఆధారపడి బతుకుతున్న కార్మికుల తో పాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వ ఉపాధి అవకాశాలను కల్పించే సామాజిక బాధ్యతను నిర్వహించాలి. చేనేత కార్మికులు కూడా "ఐక్య సంఘటనగా" ఏర్పడి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వము దృష్టికి తీసుకు పోవడంలో నిరసనలు, ధర్నాలు, పోరాట కార్యక్రమాలను కూడా తీసుకోవడానికి వెనుకాడకూడదు. సమాజానికి మాన రక్షణ చేస్తున్న మీకు సమాజంలోని విభిన్న వర్గాలు అండగా ఉంటారని ఆశిద్దాం.
(వడ్డేపల్లి మల్లేశం సామాజిక విశ్లేషకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట - 9014206412)