ఆధ్యాత్మిక జ్ఞాని - హనుమ
పరమేశ్వరుడి అంశగా
అంజనాదేవి గర్భమున ఉదయించి
ఉదయించే ఎర్రని సూర్యుడిని
పండనుకొని మింగబోయె
పవనసుతుడు
సంగీతవిద్యను రవిచే నేర్చి
సంగీతశాస్త్ర కర్తయయ్యె
మాటతీరులోనూ
వినయవిధేయతలలోను
గాంభీర్యంలోను
గుణగణాలలోను
సాటిలేరు హనుమకి
భక్తి శక్తి అమోఘ సేవానిరతి
కలిగిన ఆధ్యాత్మిక జ్ఞాని
గుండె నిబ్బరంగల
భవిష్యత్ బ్రహ్మ
గుండె ధైర్యంగల పరాక్రమవంతుడు
సుగ్రీవునికి మంత్రిగాను
రామునికి దూతగాను
నమ్మిన బంటుగాను ఉండి
సముద్రాన్ని అవలీలగా దాటి
లంకా నగరాన్ని దహించి
రావణుని గర్వం అణచి
ఉన్నాడులెస్స రాఘవుడున్నాడని
సీతాదేవి కన్నీటిని తుడిచి
కంటిన్ జానకి పూర్ణచంద్ర వదనన్
అని శ్రీ రామునికి చెప్పి అతని
ఆలింగనాన్ని పొంది జన్మ సార్థకం చేసుకున్న
పునీతుడు, పావనచరితుడు
మనసునే మందిరంగా మార్చుకుని
హృదయంలో సీతారాములను
నింపుకొని ఆరాధించిన
భక్తాగ్రేసరుడు హనుమంతుడు
దాస్య భక్తికి నిదర్శనంగా
నిలిచిన నిరాడంబరుడు
ధన్యుడు పరమ పవిత్రుడు హనుమ
ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు