"అమ్మతనం - కడురమణీయం" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"అమ్మతనం - కడురమణీయం" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

అమ్మతనం - కడురమణీయం

ఉదరమున నవమాసాలు మోసి
ప్రసవోద్భవవేదన పొంది
జన్మనిచ్చిన అమ్మతనం
కమనీయం కడురమణీయం

అమ్మ పేగు బంధం పరమ పవిత్రం
అమ్మ మనసు అనంతం
అది ఆకాశపు అంచు సముద్రపులోతు
బిడ్డను కనుపాపలా కంటికిరెప్పలా కాచి
రక్షణకవచంలా నిలిచి
లాలించి పాలించి పరితపిస్తూ
మూర్తీభవించిన మాతృత్వంతో
అవ్యాజ్యమైన అనురాగంతో
పున్నమిచంద్రునివంటి చల్లనిచూపులతో
అమితమైన ఆనందంతో ఆప్యాయంగా
మాతృధారను అమృతధారగా కురిపించి
ప్రేమతో దీవించి బంగారు భవిష్యత్తుకు
బాటవేయాలని తపనపడే హృదయం
తల్లడిల్లే హృదయం మాతృహృదయం

అమ్మపలుకు తేనెలొలుకుల వేదవాక్కు
అమ్మఒడి ఊయలూగేబడి
బిడ్డ ఆకలితీర్చే కల్పవృక్షం అమ్మ
దైవంలేదు తనతల్లికంటే
ప్రత్యక్షదైవం మనమాతృమూర్తి
అమ్మతనం అమృతలోకం

--- ఆచార్య ఎం రామనాథం నాయుడు,
మైసూరు.

0/Post a Comment/Comments