భగ్న హృదయం(ముత్యాలసరాలు)

భగ్న హృదయం(ముత్యాలసరాలు)


శాంతమగు నా స్వాంతమందున
కాంతివగు నా కళ్ళయందున
దుమ్ము గొట్టి, రేపి అలజడి
గమ్మునెళ్ళితివా, రాక్షసి!

పనియు లేకను,నీవు లేకను
ఎటూ తోచక ఎలా బతుకను?
నిన్నె తలుచుకు కన్ను మూయను
ఇలా చంప్తావే,రాక్షసి!

నీవు లేకను, నిదుర రాకను
గదియె నరకము,తిండి గరళము
కంటి నీళ్ళనె తాగి నిన్నే
తలుచుకుంటానే,రాక్షసి!

నాదు ప్రాణము నిలువకుండెను
నాదు మనస్సు చచ్చిపోయెను
నేను జీవత్ శవము నైతిని
ఎంత జేసితివే,రాక్షసి!

నాదు కంటికి నిదుర నెందుకు
నాదు ఒంటికి తిండినెందుకు
నాదు ఇంటికి శాంతినెందుకు
కరువు చేసితివే,రాక్షసి?

నేతి పూతల తీపి కబురుల
ఆశ జూపీ,మోసపుచ్చీ
తల్లిదండ్రుల వెంట,వెంటనె
పయనమయ్యతివే,రాక్షసి!

నాదు గుండెను చెరకు గడలా
విరిచి వేసియు,పీల్చి వేసియు,
పిప్పి చేసియు,కాల్చివేసియు,
వెళ్ళి పోయితివే,రాక్షసి!

క్షణములన్నియు యుగములాయెనె
మనసు నిండా శూన్యమాయెనె
తనువు మొత్తం మొద్దుబారెనె
నీవు లేకుంటే,రాక్షసి!


---కవిచక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కరీంనగర్
9963991125


0/Post a Comment/Comments