అధికార దర్పం
అహంకారానికి ఆయువుపట్టు అధికారం
దర్పానికి ప్రతిరూపం ధనవంతుడు
పొగరుకు దర్పణం విచ్చలవిడితనం
గర్వానికి నిలువుటద్దం ఉన్నతనం
అహంకారంతో విర్రవీగెను
కొలనులో మదగజం
మకరం మదగజం పొగరును అణచె
అనువుగాని చోట అధికులమనరాదనే
సత్యవాక్కు తెలియవచ్చె
బలిచక్రవర్తి గర్వం అణచె
వామనుడి పాదం
శిశుపాలుడి అహంకారం అణచె
శ్రీ కృష్ణుని ధర్మచక్రం
రాజుల ఆగడాలను అణచె
పరశురాముని పవిత్ర గొడ్డలి
లక్ష్మి ఏలినట్టి లంకాధిపురం
మదం చేత నాశనమయ్యె
అంతుబట్టని అహంకారం
మానవత్వాన్ని ముంచేస్తుంది
మనిషిని కాల్చేస్తుంది కూల్చేస్తుంది
ధనదాహంతో మదమెక్కిన
ధనవంతుల కోరలు పీకడానికి
భగవంతుడు ఎత్తాలి మరో అవతారం
అనాదిగావస్తున్న అహంకారాన్ని
ఆమడదూరం జరిపి
ఆప్యాయంగా ఆనందముగా
జీవించాలి నవసమాజపు మానవులు
--- ఆచార్య ఎం రామనాథం నాయుడు,
మైసూరు.