సీ.ప.
అతినీల కిరణాల నాపి యిద్ధర కాచి
గొడుగు పట్టెడి జాలి గుండె యెవరు?
గాలినే గాలించి కసటునే తొలగించి
దిటవిచ్చు భువి గాలి తిత్తు నెవరు?
పంచభూతములను వండి,ఇద్ధరణికి
తిండి బెట్టెడి పెద్ద దిక్కు నెవరు?
భువిలోని జలమును దివిపైకి నెక్కించి
నీరదంబై వాన నిచ్చు నెవరు?
ఆ.వె.
పుట్టినపుడు నీకు తొట్టియైన దెవరు?
ఎండలందు నీకు నిగము నెవరు?
అంత్యకాలమందు నాదరించునెవరు?
చెట్టు గాద నరుడ? కట్టె కాద?
=====================
ఇద్ధర గాచి= ఈ+ధరన్ +కాచి=ఈ భూమిని కాపాడి
గాలించి = వడగట్టి
కసటు = కలుషితము
దిటవిచ్చు= దిటవు+ఇచ్చు= బలము(ప్రాణము) ఇచ్చు
గాలి తిత్తు= ఊపిరితిత్తు
నీరదము=మేఘము
తొట్టి = ఊయల
ఇగము = మంచు,చల్లదనము
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కరీంనగర్
9963991125