చైతన్య తరంగం...! _ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ), ఖమ్మం.

చైతన్య తరంగం...! _ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ), ఖమ్మం.

చైతన్య తరంగం...!
_ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

ఏ కలం కన్న కడుపున పుట్టిన కవనం వేగు చుక్కై వెలగనపుడు
ఏ గళం కడలి అలలతో పొంగే గానమై గాండ్రించనపుడు 
ఏ కష్టాలు సుడి గుండాల్లో చిక్కిన శల్యమై కొట్టు మిట్టాడుతున్నపుడు
ఆగదు చైతన్య తరంగ పయనం నేనున్నాననీ గమ్యం ముద్దాడే దాకా..!

బతుకు బాటల తరంగాలకు ముళ్ల కంచె ఎదురైనప్పుడు
విషపు కాలపు కల్లోలం లో మహమ్మారి కోరలు చాచినపుడు
మనిషికి మనిషి ఎవరికి వారే యమునా తీరే ఐనపుడు
ఆగదు చైతన్య తరంగ పయనం నేనున్నాననీ గమ్యం ముద్దాడే దాకా...!

ఎదలోతుల్లోంచి కన్నీటి ధార కనురెప్పల తలుపు తెరిచి వర్షించినపుడు
ఆకలి దప్పుల దుప్పటి ఎంత కప్పుకున్న జఠరాగ్ని పర్వతం బద్దలైనపుడు
అన్న దాతల కాయ కష్టం మధ్య దళారీల కాష్ఠంలో కాలుతున్నపుడు
ఆగదు చైతన్య తరంగ పయనం నేనున్నాననీ గమ్యం ముద్దాడే దాకా...!

పాశ్చాత్యపు విష సంస్కృతి సుడిగుండం మత్తులో మునిగి తేలుతున్నపుడు
మన సంస్కృతి సాంప్రదాయాలు వికృతంగా ఆకృతి దాలుస్తున్నపుడు
సంస్కార హీన సమాజంలో కుసంస్కార  కుళ్లు వేళ్ళూసుకున్నపుడు
ఆగదు చైతన్య తరంగ పయనం నేనున్నాననీ గమ్యం ముద్దాడే దాకా...!

చెత్త కుప్పల పొత్తిల్లు అనాథల ఇల్లైనపుడు
మేల్కొలిపే సూర్యుడు నిద్రపుచ్చే వెన్నెల అమ్మానాన్నలైనపుడు 
బాల కార్మికులకు ఉచిత  నిర్భంధ విద్య ఊచు లేనపుడు
ఆగదు చైతన్య తరంగ పయనం నేనున్నాననీ గమ్యం ముద్దాడే దాకా...!

0/Post a Comment/Comments