ఆధునిక భారత తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే

ఆధునిక భారత తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే

** ఆధునిక భారత తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే **


ఆధునిక భారత సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతలను పారద్రోలి ఆనాటి సమాజంలో అసమానతలను తొలగించడానికి ఉద్యమించిన సమన్యాయ సత్య శోధకుడు, దార్శనికుడు తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబాపూలే. 1827 వ సంవత్సరం ఏప్రిల్ 11 న జన్మించిన జ్యోతిబా పూలే జన్మించారు. తన ఏడవ యేటనే బడి మానివేసినా పుస్తకాలంటే ఉన్న ఇష్టం తన తండ్రి స్కాటిష్ మిషనరీ పాఠశాలలో చేర్పించడానికి కారణమైంది.ఆదిమానవుని కాలం నుండి ఆధునిక సమాజం వరకు మానవ జాతి మనుగడకు వికాసానికి ప్రధాన కారణం అయినటువంటి విద్య దాని యొక్క విశిష్టతను గుర్తించిన జ్యోతిబా అట్టడుగు వర్గాల ప్రజలను చైతన్యం చేయడం కోసం విద్య ఒక్కటే ఆయుధమని అనేక పాఠశాలలు స్థాపించాడు .సమ సమాజ నిర్మాణం జరగాలన్నా, సాంఘిక రుగ్మతలను పారద్రోలాలన్నా ప్రజలకు అక్షరజ్ఞానం ముఖ్యమని గుర్తించారు .అశేష జనావళికి జ్ఞాన వెలుగుల్ని కుల, మత, లింగ, వివక్ష లేకుండా ఉద్యమాల ద్వారా పోరాట స్ఫూర్తితో, నిమ్నవర్గాలకు అందించిన క్రాంతదర్శి ,నవభారత నిర్మాత జ్యోతిబా పూలే. సమాజ అభివృద్ధిలో స్త్రీ పాత్ర ఎనలేనిదని గుర్తించి స్త్రీలకు, బాలికలకు పాఠశాలలు స్థాపించారు. 13 వ యేటనే ఆనాటి సంప్రదాయం ప్రకారం ఎనిమిదేళ్ల సావిత్రిబాయి తో వివాహం జరిగింది. అయితే సావిత్రిబాయి చదువుకోలేదు. ఆమెకు గురువై అక్షరజ్ఞానం అందించి ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిబా పూలే ది. కేవలం విద్య మాత్రమే కాకుండా బడి మానివేసిన పిల్లల కోసం భోజన గృహ వసతి కల్పించారు సమాజంలో నిరాదరణకు గురైన
మహిళలకు అండగా నిలబడ్డారు.విద్య హక్కు వ్యాప్తికై ప్రచారం చేయడం, పిల్లల మానసిక వికాసం పై దృష్టి పెట్టడం మరియు రైతులు, దళితులు, వెనుకబడిన తరగతుల వారి కోసం, కార్మికుల కోసం రాత్రి పాఠశాలలు నడిపారు, మద్యపాన నిషేధం పై ,కుల వ్యవస్థ పై ఉద్యమించారు. 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. జ్యోతిబా రాసిన గులాంగిరి, సత్సార్ ,పుస్తకాలు సమాజాన్ని చైతన్యవంతం చేసేవే. ఇవే కాకుండా అనేక కవితలు, పద్యాలు, జానపద గేయాల ద్వారా ఆనాటి సమాజంలో ఆలోచన రేకెత్తించారు. కేవలం నిమ్న వర్గాల ప్రజల కోసం మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం ఒక మానవతావాదిగా ప్రతిస్పందించారు సతీసహగమనం బాల్య వివాహాలను వ్యతిరేకించారు.ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషికి సమానమైన హక్కులు ఉంటాయని సమాజాభివృద్ధిలో స్త్రీ,పురుషుల పాత్ర సమానమేనని
ఆ దిశగా సమాజాన్ని అక్షరాల దారుల్లో నడిపిన మహామహోపాధ్యాయుడు జ్యోతిబా పూలే. తమ కోసం కాకుండా
సమాజం కోసం జీవించేవారు మహనీయులు. సమాజానికి దిశానిర్దేశం చేస్తూ జాగృతం చేయడానికి తమ జీవితాల్ని త్యాగం చేసిన ఎందరో మహనీయులు వారిలో అగ్రగణ్యులు జ్యోతిబాపూలే. జగ్జీవన్ రామ్, అంబేద్కర్ గారు, జ్యోతిబాపూలే గారు జన్మించిన ఈ ఏప్రిల్ మాసం మహనీయుల మాసం. జ్యోతిబా స్ఫూర్తి, చైతన్యంతో ముందు కు సాగుదాం. ఆయన ఆశయాలను కొంతయినా సాధించేందుకు పూనుకుందాం. పూలే ఉద్యమ స్ఫూర్తి సాకారం కావాలని ఆశిద్దాం.
     తాళ్లపల్లి భాగ్యలక్ష్మి(టీచర్)
     M.A(Tel),M.Ed,UGC NET
     రాజన్న సిరిసిల్ల జిల్లా

0/Post a Comment/Comments