గురుదేవుళ్ళకు
వందనం ! పాదాభివందనం !!
ఓ గురు దేవుళ్ళారా !
మేము పుట్టగానే
బడిలో అడుగుపెట్టగానే
పరిమళించే పువ్వులని పసిగట్టేది మీరే
మమ్ము కనని అమ్మానాన్నలు మీరే
మా భవిష్యత్తు భవననిర్మాతలు మీరే
మా చీకటిజీవితాలను వెలిగించే
విజ్ఞానజ్యోతులు మీరే
మా దారిదీపాలు మీరే
మా జీవితమార్గ నిర్దేశకులు మీరే
మేము చదువుల్లో దిట్టలమైతే
మొట్టమొదట భుజం తట్టేది మీరే
సాన బట్టేది మీరే ముందుకు నెట్టేది మీరే
మమ్ము రాళ్ళలో రత్నాలుగా
మట్టిలో మాణిక్యాలు తీర్చిదిద్దేది మీరే
ఓ గురు దేవుళ్ళారా !
మా ఉజ్వల భవిష్యత్తును నిర్మించేది మీరే
మాలో అభ్యుదయ భావాలను రగిలించేది మీరే
మా హృదయాన్ని వికసింపజేసేది మీరే
ఒక "కన్నతల్లిలా "బుజ్జగించి,బుద్దిచెప్పేది మీరే
ఒక "కన్నతండ్రిలా" చేయిబట్టి నడిపించేది మీరే
ఒక "ప్రాణస్నేహితుడిలా" ఎవరెస్టుశిఖరమంత
ఎత్తుకు మేము ఎదగాలని ఆశించేది మీరే
ఆపదలో "భగవంతుడిలా" ఆదుకునేది మీరే
మా బ్రతుకులను బంగారుమయం చేసేది మీరే
ఓగురుదేవుళ్ళారా !
మీరు నేలమీదున్నా మేము మాత్రం
వినువీధుల్లో విదేశాల్లో విమానాలలో
విహరించాలని కలలు కనేది మీరే
ఆ కలలే నిజమై మేము
డాక్టర్లం, సినిమా యాక్టర్లం
కలెక్టర్లం, కంప్యూటర్ ఇంజనీర్లమైతే,
రాజకీయ నేతలమై రాజ్యాలనేలితే
ఉప్పొంగిపోయేది మీ గుప్పెడుమనసే
ఆ కలలే నిజమై మేము
సైంటిస్టులం,అంతరిక్ష పరిశోధకులం
వ్యోమగాములం, మీలా ఉపాధ్యాయులమైతే
పరవశించిపోయేది మీ పసిహృదయాలే
మేము గురువులను మించిన శిష్యులమైతే
"ధీర్ఘాయుష్మాన్ భవా" యని దీవించేది మీరే
అందుకే ఓ గురుదేవుళ్ళారా! మీకు
వందనం ! అభినందం !! పాదాభివందనం !!!
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502
(నేడు గురుపూర్ణిమ సందర్భంగా
గురువులకు గురుదక్షిణగా చిరుకవిత)...