నిండుపున్నమిచంద్రుడు - తారకరాముడు
ఆంధ్రుల అభిమాననటుడు
నిమ్మకూరు నీలమేఘశ్యాముడు
తెలుగు చిత్రసీమకు మణిమకుటమై
వటవృక్షమై ఎదిగిన కళాఖండం
నటకిరీటాన్ని ధరించిన
నందమూరి అందగాడు
ఆదర్శపురుషుడు, యుగపురుషుడు
ఆంధ్రుల ఆరాధ్యదైవంగా
ప్రతిఇంటా వెలుగొందే దేవునిరూపం
రాముడు భీముడు రావణుడు
కృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడు
దానకర్ణుడు వంటి
నాయకప్రతినాయక పాత్రలను పోషించి
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా వెలిగి
పర్వతశిఖరమై సముద్రకెరటంలా
ఉప్పొంగి చరిత్ర పుటలలో
నిలిచిన మహోన్నతుడు
తెలుగుజాతి అఖండ కీర్తిపతాకాన్ని
తెలుగుభాష మాధుర్యాన్ని
తెలుగువారి పౌరుషాన్ని
తెలుగువారి పంచెకట్టును
ప్రపంచానికిచాటి వాసికెక్కిన
విశ్వవిఖ్యాతుడు
జననీజన్మభూమిశ్చ అంటూ
తల్లిని నేలతల్లిని గౌరవించి
మహిళల అభిమానం చూరగొన్న
అన్నయ్యగా, పేదలపెన్నిధిగా
మాటలమర్మమెరిగిన మానవుడుగా
పవిత్రమైన హృదయంతో
అనంతమైన మనసుతో
ప్రజాబంధువై ప్రజానాయకుడై
తెలుగు హృదయాలలో
ధ్రువతారయై నిలిచింది
జగమెరిగినసత్యం
ఆంధ్రులను ఉద్ధరించడానికి నడుంబిగించి
తెలుగుదేశం పార్టీ స్థాపించి
తెలుగుతమ్ముళ్లకు తెలుగుగంగను తెచ్చి
ఆడబిడ్డలకు ఆస్తిహక్కు కల్పించి
పత్వారి వ్యవస్థను రద్దుచేసి
తెలుగుహృదయాలలో నిలిచిన
నటరత్న పద్మశ్రీ నందమూరి
తారకరామారావు గారికి
శతకోటి వందనాలు
ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు