యువతను నిర్వీర్యపరిచే విధానాలు మానుకొని నైపుణ్య అభివృద్ధి కి ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా కృషి చేయాలి. - వడ్డేపల్లి మల్లేశము, 9014206412.

యువతను నిర్వీర్యపరిచే విధానాలు మానుకొని నైపుణ్య అభివృద్ధి కి ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా కృషి చేయాలి. - వడ్డేపల్లి మల్లేశము, 9014206412.

 


యువతను నిర్వీర్యపరిచే విధానాలు మానుకొని నైపుణ్య అభివృద్ధి కి ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా కృషి చేయాలి.

- వడ్డేపల్లి మల్లేశము, 9014206412.


    ప్రపంచంలోనే యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశంగా భారత దేశానికి గుర్తింపు ఉన్నది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన కమ్యూనిస్టు దేశమైన చైనాలో ప్రస్తుతము కుటుంబ నియంత్రణ పూర్తిస్థాయిలో అమలు అవుతున్న కారణంగా జననాల రేటు తగ్గింది. తద్వారా యువత అంచనాలకు మించిన స్థాయిలో తక్కువగా ఉండడం అక్కడి ప్రభుత్వాన్ని కలచివేస్తున్న సమస్యగా మారింది. అందుకే ఇటీవల అక్కడి ప్రభుత్వం పిల్లలను పొందే విషయంలో కుటుంబాలకు స్వేచ్ఛ ఇవ్వడం గుర్తించదగినది. సమాజ అభివృద్ధిలో, పరిణామక్రమంలో యువత పోషించే పాత్ర ఉన్నతంగా ఉంటుంది. కనుకనే చాలా దేశాలు కూడా తమ దేశ భవిష్యత్తు యువతపైనే పెట్టడానికి సిద్ధంగా ఉంటాయి. ఇటీవల భారతదేశ ప్రధాని యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని తద్వారా నూతన ఆలోచనలతో మౌలిక సమస్యలను పరిష్కరించే దిశగా కొత్త రకమైన పాలన కొలువుతీరనున్నదని ఆశాభావాన్ని వ్యక్తం చేయడాన్ని గమనించాలి.


యువత ప్రాధాన్యత- యువత నైపుణ్య దినోత్సవ లక్ష్యాలు:-


      2014 డిసెంబర్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతకు ప్రాధాన్యతనిచ్చి వివిధ శిక్షణల ద్వారా వారి నైపుణ్యాన్ని తీర్చిదిద్దేందుకు జూలై 15 వ తేదీని ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవంగా ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించింది. ఆ మేరకు 2015 జూలై 15 వ తేదీ నుండి ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ఈ దినోత్సవం సందర్భంగా యువతకు సమాజం ఇచ్చే ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది.


  లక్ష్యాలు:- ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ స్థాయిలో విభిన్న రంగాల యొక్క ప్రాధాన్యతలను గుర్తించినట్లు గానే యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కొన్ని  లక్ష్యాలను నిర్దేశించి దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో క్రియాశీల భూమిక పోషించే విధంగా ప్రోత్సహించడమే ఈ దినోత్సవం ప్రకటించడం లోని అంతరార్థం.

    

   ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ఒక అంశాన్ని ప్రధానంగా తీసుకొని సవాళ్లను అధిగమించే విధంగా వారికి శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలనే ది అన్ని దేశాలు కూడా గుర్తించి నటువంటి సమస్య. గత సంవత్సర కాలంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడి తో పాటు యువతకు నైపుణ్యాన్ని పెంపొందించే క్రమంలో ఎదురవుతున్న టువంటి ఆటంకాలను అధిగమించడం దాన్ని ఈ సంవత్సర ప్రాధాన్యతగా గుర్తించడం జరిగింది.


ప్రభుత్వాలు- యువత పట్ల ఆచరించే సోపానాలు:


    ఐక్యరాజ్యసమితి ప్రకటన మేరకు ప్రపంచంలోని చాలా దేశాలు ఈ దినోత్సవాన్ని నిర్వహించు కుంటున్న క్రమంలో భారతదేశంలో కూడా కేంద్ర  ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలలోనూ యువతకు సంబంధించిన కార్యక్రమాలను విధిగా చేపట్టవలసిన అవసరం ఉంది. అయితే ఆచరణలో చాలా రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో యువతలో నైపుణ్యాన్ని పెంపొందించిఉపాధి కల్పించి లేదా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో వారిని తీర్చిదిద్దే బదులు మద్యం ,మత్తు పానీయాలు, ధూమపానం వంటి అనేక సామాజిక రుగ్మతల బారిన   పడి నేటి యువత నిర్వీర్యం అయిపోతున్నది.


     ప్రభుత్వాలకు యువజన విధానం ఉన్నప్పుడు మాత్రమే వారిని దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016లో ఒక ప్రతిపాదన చేసినప్పటికీ ఇప్పటికీ సమగ్రమైన టువంటి యువజన విధానాన్ని ప్రకటించకపోవడం చాలా బాధాకరం. నాలుగు కోట్ల జనాభాలో దాదాపుగా 40 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉన్నట్టు ఇంకా అనేక  చిరు వ్యాపారాలు స్వయం ఉపాధి పథకాలలో లక్షలాదిమంది నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ వారికి ప్రభుత్వపరంగా స్పష్టమైన టువంటి ఆదాయ మార్గాలు గాని సహకారం గాని లేకపోవడంతో పేదవాళ్లు మరీ పేదలుగా మారిపోతున్నారు.


     ప్రభుత్వం ఆదాయం కోసమే మద్యాన్ని ప్రవేశ పెట్టినట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ మద్యం వల్ల అనేక రకాలైన టువంటి సామాజిక రుగ్మతలు వ్యాప్తి చెందుతున్న ప్పటికీ సకల సమస్యల పరిష్కారానికి మద్యపానం నిషేధించడం మార్గమనే  స్పృహ ప్రభుత్వాలకు లేకపోవడం విచారకరం. దానితో యువత, ముఖ్యంగా విద్యావంతులైన నిరుద్యోగులతో పాటు చిన్న వయసులోనే విద్యార్థి వర్గం కూడా మద్యపానానికి బానిసలవుతున్నారు. కర్తవ్యాన్ని మరిచిపోతుంటారా తమ యొక్క భవిష్యత్తును గమనించలేక పోతున్నారు. యువతకు స్పష్టమైన టువంటి దారిని చూపే విధంగా శిక్షణా సౌకర్యాలను కల్పించి, వారి నైపుణ్యాలను మెరుగు పరిచి, ప్రయోజకులుగా తీర్చిదిద్ది నట్లయితే ఏ రకంగానైనా వారు తమ కాళ్ల మీద తాము నిలబడ గలరు. విద్య ,వైద్యం వంటి ప్రధానమైనటువంటి సౌకర్యాలను ప్రభుత్వమే ప్రజలకు కల్పించడంతోపాటు ఉపాధిని కూడా కల్పించడం  యువతను ప్రోత్సహించడం కనీస బాధ్యత ప్రభుత్వాలది.


దుర్వ్యసనాల నుంచి యువతను కాపాడాలి:


    గత సంవత్సర కాలంగా ముఖ్యంగా భారతదేశంలో కరోనా నేపథ్యంలో ప్రాథమిక విద్య నుండి ఉన్నత స్థాయి విద్య వరకు కూడా ఆన్లైన్ తరగతుల ద్వారానే నిర్వహించబడుట వలన ఉపాధ్యాయులకు విద్యార్థులకు ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం, అర్హులైన టువంటి యువతకు శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా మూతపడడంతో యువత గమ్యం, గమనం అగమ్యగోచరంగా మారింది.


     సక్రమ ఆలోచన హేతుబద్ధమైన  తార్కిక జ్ఞానాన్ని యువతలో నింపడం కోసం ప్రభుత్వ ప్రైవేటు పరంగా విద్యావకాశాలు ఉద్యోగ ఉపాధి శిక్షణ కళాశాలలో ఉన్నప్ప,టికీ పేద విద్యార్థులు నిరుద్యోగ యువత ప్రైవేటు సంస్థల్లో శిక్షణ పొందడానికి అవకాశం లేకుండా పోతుంది ఈ విషయాలను ప్రభుత్వం  గమనించాలి. శక్తియుక్తులు యుక్తిపరులు యువత అనే సదభిప్రాయం తల్లిదండ్రులు, సమాజం దృష్టిలో కాకుండా ప్రభుత్వం దృష్టిలో బలంగా ఉండేట్లు చిత్తశుద్ధిగా తగు చట్టాలను అమలు చేసినప్పుడు మాత్రమే సర్వత్ర నీతి నిజాయితీ, న్యాయం, ధర్మం వంటి అంశాలు ఆచరణలో కనబడతాయి. దురలవాట్లు , దురాభ్యాసాలు, దుర్నీతి కిదూరంగా యువతను ఉంచిన్నప్పుడే వారి నైపుణ్యాన్ని, కండరాల శక్తిని, దృఢ సంకల్పాన్ని మనము చూడగలము.


యువత -ప్రభుత్వం ముందున్న కీలక బాధ్యతలు:


    ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించినప్పటికీ నిరుద్యోగం అనేది విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో చాలా మంది యువకులు, పట్టభద్రులు , పరిశోధకులు ఉద్యోగాలను ప్రభుత్వం ఇవ్వని కారణంగా ఆవేదన చెంది ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు అనేకం. ఇది బంగారు తెలంగాణకు ఏ రకంగా సంకేతం అవుతుందో పాలకులే సమాధానం ఇవ్వాలి. బాధాకరమైన విషయం ఏమిటంటే గత మూడు, నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ,ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాల్లో పని చేసినటువంటి వారిని ప్రభుత్వం అనేక కారణాలు చూపి ఉద్యోగాల నుంచి తొలగించడం ద్వారా 52 వేల మంది ఇవాళ ఉద్యోగాలకు దూరం అయ్యారు. గత సంవత్సర కాలంగా కరోనా చికిత్సలో భాగంగా అర్హులైన పదహారు వందల నలభై మంది నర్సులను ఉద్యోగాలలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరం తీరగానే ఇటీవల వారిని ఉద్యోగం నుంచి తొలగించడం తో ప్రగతి భవన్ ముట్టడించిన, వాళ్ళు అనేక పోరాటాలను కొనసాగిస్తూనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం గా ఒక లక్షా తొంభై ఒక వెయ్యి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఖాళీలను భర్తీ చేయకపోవడం ఉన్న ఉద్యోగుల యొక్క ఉద్యోగ విరమణ వయసు మూడు సంవత్సరాలు పెంచడం వలన ఉద్యోగాలకు అవకాశం లేదని ఆవేదనతో యువత నిర్వీర్యం అవుతున్నది. అందులో భాగమే ఆత్మహత్యల పరంపర.

     

   ప్రపంచ యువత నైపుణ్యం అభివృద్ధి దినోత్సవమైన నేటి రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, దేహ దారుఢ్యానికి, నైపుణ్యాల అభివృద్ధికి చిత్తశుద్ధిగా కృషి చేయడానికి తమ విధానాలను కొన్ని సవరించుకోవలసిన అవసరం ఉన్నది. మద్యపానాలు, మత్తు పానీయాలు, విలాసాల సందర్భంలో 90 శాతం మంది యువత పెడదారి పట్టి నిర్వీర్యం అవుతుంటే అశ్లీల చిత్రాలు ,ప్రయోజనము లేని సామాజిక సంఘర్షణలకు గురి చేసే  టీవీ సీరియల్స్, మిగతా అసంబద్ధమైన టువంటి కార్యక్రమాలను ప్రభుత్వాలు వెంటనే నిషేధించి నూతన ఒరవడిలో యువతకు క్రియాశీల భాగస్వామ్యాన్ని కల్పించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.


    తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పెంచి పోషించే సందర్భంలో శ్రమ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించే విధంగాప్ర భుత్వం యువజన విధానాలను వెంటనే ప్రకటించి అమలులోకి తేవాలి .మంత్రివర్గంలోనూ రాజకీయపార్టీల లోనూ విద్యారంగంలో విభిన్న అంశాల్లో యువత ముందుభాగంలో ఉండే విధంగా వారిని మనం తీర్చిదిద్దుకున్న ప్పుడే ఈ సమాజానికి మరింత వారి వల్ల మేలు జరుగుతుంది. అటు ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, సమాజం, యువత తమ తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహించిన ప్పుడే ఈ దినోత్సవానికి అర్థం ఉంటుంది. యువతకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కుతుంది. పాఠశాల కళాశాల స్థాయిలో విద్యార్థులను ప్రశ్నించేవారు గా ,సమాజాన్ని పరిశీలించే శక్తి గా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో విద్యాసంస్థలది  కీలకమైన బాధ్యత. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించే వ్యక్తులుగా యువతను తీర్చిదిద్దిన ప్పుడే దేశ భవిష్యత్తు సక్రమమైన దారిలో విరాజిల్ల గలదు.


( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రం. )

0/Post a Comment/Comments